లండన్‌: ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద రూ.9000 కోట్ల రుణాలు తీసుకుని పరారైన విజయ్‌ మాల్యా అప్పగింత కేసులో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించకుండా విజయ్‌ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం బ్రిటన్ రాజధాని లండన్ హైకోర్టు అనుమతించింది.

సీబీఐ వేటాడుతున్నదన్న మాల్య
హైకోర్టు ఆదేశాల తర్వాత విజయ్ మాల్యా మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ భారత్‌కు తనను అప్పగించాలని రాసిపెట్టి ఉంటే అలాగే కానివ్వాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కానీ సీబీఐ తనను వెంటాడుతున్నదని ఆరోపించారు. బ్యాంకులకు రుణ బకాయిలు చెల్లించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. 

బ్రిటన్ హోంమంత్రి ఆదేశాలపై మాల్యా పిటిషన్
తనను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రి సాజిద్‌ జావిద్‌ ఐదు కారణాలతో జారీ చేసిన ఉత్తర్వుల్లో కనీసం ఒకదానికైనా వ్యతిరేకంగా తన పిటిషన్‌ను అనుమతించాలంటూ మాల్యా చేసిన అభ్యర్ధనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. భారత్‌లో బ్యాంకులను రూ.9,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో విజయ్‌ మాల్యా ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

మాల్యా వాదనలు న్యాయబద్దమేనన్న లండన్ హైకోర్టు
జస్టిస్‌లు జార్జ్‌ లెగ్గాట్‌ ఆండ్రూ పోపెల్‌వెల్‌లతో కూడిన రాయల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ బెంచ్‌.. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం మాల్యా పిటిషన్‌ను అనుమతించింది. వెస్ట్‌ మినిస్టర్‌ మెజిస్ట్రేట్స్‌ కోర్టు చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎమ్మా ఆర్బునాట్‌ ముందు వినిపించిన వాదనలు న్యాయంగానే ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. దిగువ కోర్టులోని కొన్ని సాక్ష్యాలు, వ్యాఖ్యానాలు అనుమతించే విధంగా ఉన్నాయన్న పరిమితులకు లోబడి విజయ్‌ మాల్యా పిటిషన్‌ను విచారణకు అనుమతినిస్తున్న ట్లు హైకోర్టు న్యాయమూర్తులు ఉత్తర్వులు జారీ చేశారు.

అప్పీల్ డ్రాఫ్ట్ సమర్పించేందుకూ హైకోర్టు ఆదేశాలు 
అప్పీల్‌కు సంబంధించి డ్రాఫ్ట్‌ను సమర్పించేందుకు అవసరమైన ఆదేశాలను కూడా బెంచ్‌ జారీ చేసింది. వాదనల అనంతరం హైకోర్టు వెలుపల మాల్యా మాట్లాడుతూ.. తాను పాజిటివ్‌గా ఉన్నట్లు ఫీలవుతున్నట్లు చెప్పారు. హైకోర్టు విచారణకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు హాజరు కాగా విజయ్‌ మాల్యా.. తన కుమారుడు సిద్ధార్ధ మాల్యా, ఆయన భాగస్వామి పింకీ లల్వానీ హాజరయ్యారు.
 
మెహుల్‌ చౌక్సీపై సుప్రీంకు వెళ్లిన కేంద్రం
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన మెహుల్‌ చౌక్సీ భారత్‌కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. ఆయన అనారోగ్యం పేరిట తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు తీసుకురావడానికి ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా? అనే దాన్ని పరిశీలించేందుకు ఛోక్సీ మెడికల్‌ రిపోర్టులు ఇవ్వాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ కేంద్రం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

చౌక్సీ తరలింపుపై బాంబే హైకోర్టు ఆదేశాలు తీవ్ర ప్రభావం
బాంబే హైకోర్టు ఆదేశాలు చౌక్సీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై త్వరితగతిన విచారణ జరపాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 

అంటిగ్వాలో తల దాచుకున్న మెహుల్ చౌక్సీ
ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్న మెహుల్‌ చౌక్సీ అనారోగ్య కారణాల రీత్యా తాను భారత్‌కు రాలేనని, పీఎన్‌బీ దర్యాప్తునకు ఇక్కడ నుంచే సహకరిస్తానని పదేపదే చెబుతూ వస్తున్నారు. అయితే ఇందుకు దర్యాప్తు సంస్థలు ససేమిరా అంటున్నాయి. మరోవైపు చౌ పౌరసత్వం రద్దు చేసి, భారత్‌కు అప్పగించే వీలుందని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌనె ఇటీవల వెల్లడించారు. తమది నేరగాళ్లు తలదాచుకునే దేశం కాదనీ, న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిన క్షణమే చౌక్సీని భారత్‌కు పంపుతామని ఆయన పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి.