Asianet News TeluguAsianet News Telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్: తగ్గిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు...కానీ వాటికి పెరిగిన డిమాండ్...

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రపంచ దేశాలపై జనవరి నుంచే మొదలైంది. కాకపోతే భారత ప్రధాని నరేంద్రమోదీ గత నెల 25 నుంచి 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడింది. పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా తగ్గితే.. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకు పరిమితం కావడం వల్ల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్స్ పెరిగిపోవడం గమనార్హం.

Petrol sales in India shrink 17.6%, diesel 26% in March as lockdown wipes demand
Author
Hyderabad, First Published Apr 7, 2020, 10:10 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలను తాకుతున్నా కొద్దీ పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ వల్ల మార్చిలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు పడిపోగా, గృహావసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్లకు డిమాండ్ పెరిగినట్లు ప్రభుత్వరంగ పెట్రోలియం సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్‌), హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వెల్లడించాయి.

మార్చి నెలలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలపై ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థల్లో విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది. భారత్‌లో 2019 మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్‌ అమ్మకాలు 17.6 శాతం తగ్గగా, డీజిల్ అమ్మకాలు 26 శాతం మేర పడిపోయాయి.

అంతర్జాతీయ, దేశీయ విమానాల రాకపోకలపై కూడా ఆంక్షలు అమలులో ఉండటంతో ఏవియేషన్ టర్బైన్‌ ఫ్యూయల్ (ఏటీఎఫ్) అమ్మకాలు కూడా 31.6 శాతం పడిపోయినట్లు ఆయా కంపెనీలు వెల్లడించాయి. కానీ గృహావసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల కోసం వినియోగదారుల నుంచి బుకింగ్స్ పెరగడంతో ఒక్క మార్చి నెలలోనే 1.9 శాతం పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గత నెల 25వ తేదీ నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అత్యవసర సేవలు, నిత్యావసరాల సరఫరాకు మాత్రం మినహాయింపునిచ్చారు.

also read వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఆనంద్ మహీంద్రా పోస్ట్...సోషల్ మీడియా వైరల్..

దీంతో మార్చి నెలలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, వంటకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ బుకింగ్స్ మీద ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఏప్రిల్ నెల మధ్య వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉండటం, లాక్‌డౌన్‌ ఎత్తేసినా ఆంక్షలు అమలులో ఉంటాయనే సంకేతాలు వంటి పలు కారణాలతో ఏప్రిల్‌లో కూడా దాదాపు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

2019తో పోలిస్తే గత నెలలో పెట్రోల్ విక్రయాలు 1.943 మిలియన్ టన్నులు పడిపోయింది. డీజిల్ విక్రయాలు 25.9 శాతం తగ్గి 4.982 మిలియన్ టన్నులకు పతనమైంది. ఇక ఏటీఎఫ్ సేల్స్ 4.63 టన్నులకు పడిపోయింది. ఎల్పీజీ సిలిండర్ల విక్రయాలు 1.9 శాతం పెరిగి 2.286 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.

గత రెండున్నరేళ్లలో పెట్రోల్ సేల్స్ పడిపోవడం ఇదే మొదటిసారి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తొలి 11 నెలల్లో పెట్రోల్ విక్రయాలు 8.2 శాతం ఎక్కువైతే, డీజిల్ వినియోగం 1.1 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.

ఎల్పీజీ సిలిండర్ల విక్రయాల్లోనూ గత ఫిబ్రవరిలో డీగ్రోత్ నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య సిలిండర్ల బుకింగ్స్‌లో 6.2 శాతం గ్రోత్ రికార్డైంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios