ముడిచమురు ధరలు 130 డాలర్లకు చేరువ అవడంతో ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. దీంతో వాహనదారులు ధరాఘాతం నుంచి తప్పించుకునేందుకు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకున్నారు. దీంతో మార్చి తొలి 15 రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నడిచాయి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాహనాల ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాల కారణంగా మార్చి మొదటి 15 రోజుల్లో దేశంలో పెట్రోలు, డీజిల్ విక్రయాలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. గత రికార్డులను అధిగమించాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్, డీజెల్ ధరలు భారీగా పెరుగతాయని వార్తా కథనాలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాహనదారులు, ధరల పెరుగుదలను ఊహించి, వినియోగదారులు, డీలర్లు తమ ట్యాంకులను ఫుల్ చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వాహనాల ఇంధన ధరలు పెరుగుతాయని అంతా భావించారు. దీంతో డీలర్లతో పాటు సామాన్యులు కూడా తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేసి పెట్టుకున్నారు.
ముఖ్యంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెరుగుతాయని సూచించాయి. దీంతో ధరలు ఎప్పుడైనా పెంచవచ్చనే ఉద్దేశ్యంతో చాలా మంది వాహనదారులు తమ వాహన ట్యాంకులను ఫుల్ చేయించుకున్నారు. కాగా మార్కెట్‌లో దాదాపు 90 శాతం నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల పెట్రోలు విక్రయాలు మార్చి 1 - 15 తేదీల మధ్య 1.23 మిలియన్ టన్నులుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ సేల్స్ 18 శాతం పెరిగాయి. 2019 మార్చితో పోల్చితే 24.4 శాతం ఎక్కువగా నమోదైంది.
డేటా ప్రకారం, 2020 మార్చి 1 నుండి 15 వరకు అమ్మకాల కంటే ఈ సంవత్సరం పెట్రోల్ 24.3 శాతం ఎక్కువ నమోదు కాగా, డీజిల్ 33.5 శాతం ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో పెట్రోల్ విక్రయాలు 18.8 శాతం, డీజిల్ అమ్మకాలు గత నెల కంటే 32.8 శాతం పెరిగాయి.
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఏమన్నారంటే
సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా, పెట్రోల్ పంప్ డీలర్లు కూడా వెనుకంజ వేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వారు తమ నిల్వ ట్యాంకులను మాత్రమే కాకుండా, ధరల పెరుగుదల విషయంలో లాభాన్ని పొందేందుకు ట్యాంకర్ ట్రక్కులను కూడా పూర్తిగా నింపారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు ముందే ప్రజలు తమ వాహనాలను పూర్తిగా నింపుకోవాలని ఆలోచనవల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఇంధన విక్రయాలు 20 శాతం పెరిగాయి.
133 రోజుల నుంచి ధరలు పెరగలేదు
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, నవంబర్ 2021 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఈ సమయంలో, ముడి చమురు ధర బ్యారెల్‌కు 81 డాలర్ల నుండి 130 డాలర్లకు చేరుకుంది. ఇదిలావుండగా, ఈరోజు వరుసగా 133వ రోజు వాహన ఇంధన ధరలు పెరగలేదు.