పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. రోజు రోజుకీ పెరిగిపోతున్న ఇందన ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయినప్పటికీ ధరలు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. శనివారం కూడా ఇంధన ధరలు మరింత పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. దేశ రాజధానిలో నేడు పెట్రోల్‌ ధర 35పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.63కు చేరింది. ఇక డీజిల్‌ ధర కూడా 24పైసలు పెరిగి లీటర్‌ ధర రూ. 73.54గా ఉంది.

ఇంధన ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో పెట్రోల్‌ ధర రూ. 90కి మరింత చేరువైంది. శనివారం అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 89.01గా ఉంది. ఇక లీటర్ డీజిల్‌ ధర రూ. 78.07కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 86.18, డీజిల్‌ ధర రూ. 79.73గా ఉండగా.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.41, డీజిల్‌ ధర రూ. 78.63కు చేరింది.

సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4.83, డీజిల్‌పై రూ.5 పెరిగింది.