Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులకు భారీ షాక్.. రూ.6 పెరగనున్న పెట్రో ధరలు

సౌదీ చమురు క్షేత్రాలపై దాడుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై  రూ.5-6 మేర పెరిగే అవకాశం ఉంది. సోమవారం ఒక్కరోజే ముడి చమురు బ్యారెల్‌పై 20 శాతం ఎగసిపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెంపు అనివార్యం అని హెచ్‌పీసీఎల్‌ సంకేతాలిచ్చింది.
 

Petrol, diesel prices may jump Rs 5-6 per liter due to Saudi drone attack: Reports
Author
Hyderabad, First Published Sep 17, 2019, 12:03 PM IST

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అరామ్‌కోపై గతవారం యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. 

ఈ దాడిలో క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో కంపెనీ తమ ఉత్పత్తిని సగానికి సగం తగ్గించింది. దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేశాకే ఉత్పత్తిని పెంచుతామని స్పష్టం చేసింది. దాడి ప్రభావం చమరు ధరలపై పడే అవకాశం ఉందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. 

పెట్రోలు, డీజిల్ ధరలు భారత్‌లో రూ.5-రూ.6 పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాల సమాచారం. ఈ వార్తలపై హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్పందించింది. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుత స్థితిలోనే ఉంటే పెట్రోలు, డీజిల్ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. క్రూడ్ అయిల్ ధరలు మరో పదిశాతం పెరిగితే ఆ ప్రభావం పెట్రో ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని హెచ్‌పీసీఎల్ చైర్మన్ ఎంకే సురానా తెలిపారు.

ఆరామ్ కో సంస్థ చమురు ఉత్పత్తి తగ్గించినందున భారతదేశానికి ఎగుమతులపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో సోమవారం ఒక్కరోజే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 20 శాతం మేరకు పెరిగాయి.

అయితే ఆరామ్ కో సంస్థలో చమురు ఉత్పత్తి నిలిచిపోయినా భారతదేశానికి చేసే చమురు ఎగుమతులపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఆ సంస్థ ఇప్పటికే హామీ ఇచ్చింది.

మనదేశానికి వంటగ్యాస్, చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో సౌదీ అరేబియాది రెండో స్థానం. ఈ నేపథ్యంలో ఆరామ్ కో పై దాడి పరిణామాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ చమురుశాఖ అధికారులు తెలిపారు. 

ఇరాన్ వల్లే ఈ దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఇరు దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తాజా పరిణామాలు చమురు ధరలపై ఎక్కడ ప్రభావం చూపుతాయోనని భారత్ కలవర పడుతోంది.

డ్రోన్ దాడితో చమురు ధరలు సోమవారం బ్యారెల్‌పై ఐదు నుంచి 10 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సోమవారం ఉదయానికే దాదాపు ఆరు డాలర్లు పెరిగింది. చమురు ధరలు త్వరలో 100 డాలర్లకు చేరుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం మనదేశీయ చమురు అవసరాల్లో 80 శాతం, సహజ వాయువులో 10 శాతం దిగుమతుల ద్వారానే సమ కూర్చుకుంటున్నాం. ఈ నేపథ్యంలో హఠాత్‌గా ధరలు పెరిగితే భారత దిగుమతుల ఖర్చుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 

ఒకవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చమురు ధరల అంశం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఆరామ్ కోకు చెందిన రెండు చమురు ఉత్పత్తి కేంద్రాలపై ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు దారులు డ్రోన్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో 5.7 మిలియన్ల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అంటే.. అంతర్జాతీయ చమురు ఉత్పత్తితో ఆరు శాతం మేర నిలిచిపోయింది. అయితే వీలైనంత త్వరగా ఉత్పత్తి పునరుద్దరిస్తామని ఆరామ్ కో సీఈఓ ప్రకటించడం గమనార్హం. 

కాగా, సౌదీ రిఫైనరీలపై దాడుల నేపథ్యంలో భారత్‌కు ముడి చమురు సరఫరాలో వచ్చే ఇబ్బందులేమీ ఉండబోవని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ మేరకు సౌదీ అరేబియా నుంచి భారత్‌కు హామీ లభించిందని ఆయన చెప్పారు. 

‘ఈ నెలకు ముడి చమురు సరఫరాపై మా చమురు మార్కెటింగ్‌ సంస్థ (ఓఎంసీ)లతో సమీక్ష నిర్వహించాం. భారత్‌కు సరఫరా తగ్గదని మేం నమ్మకంగా ఉన్నాం. అయినా మొత్తం పరిస్థితులను చాలా దగ్గరగా గమనిస్తున్నాం’ అని దాడులకు గురైన రిఫైనరీల సంస్థ ఆరామ్కో ఉన్నత వర్గాలు చెప్పినట్లు ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. 

ఇరాక్‌ తర్వాత సౌదీ నుంచే అత్యధికంగా ముడి చమురును భారత్‌ కొనుగోలు చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) భారత్‌కు 207.3 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతులు జరుగగా, సౌదీ వాటా 40.33 మిలియన్‌ టన్నులుగా ఉన్నది.

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడంతో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాపై ప్రతి నెల రూ.50 కోట్ల అదనపు భారం పడనున్నది. ప్రస్తుతం నెలకు రూ.500 కోట్ల చెల్లింపులు జరుపుతున్నది. 

ఈ నూతన ధరలతో కనీసంగా మరో రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్‌ మార్కెట్లో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర ఒక దశలో 20 శాతానికి పైగా పెరిగింది. ఇలాగే ధరలు పెరిగితే తప్పనిసరిగా విమాన టిక్కెట్టు ధరలు పెంచాల్సి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios