గతేడాది చివరలో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గినట్టు  అనిపించినా.. ఈ ఏడాది మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. గడిచిన 15 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కి రూ.2పెరిగాయి. జనవరి 1న పెట్రోల్‌ లీటరు రూ. 75.06 ఉండగా, జనవరి 15న రూ. 76.88 ధరగా ఉంది. డీజిల్‌ విషయానికి వస్తే.. రూ. 70.60గా ఉన్న ధర ఇదే తేదీకి రూ. 72.50గా ఉంది. ఈ 15 రోజుల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 పైసల వరకు ప్రతి రోజూ పెరుగుతూ వస్తోంది.

ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, ధరలను తగ్గించిందన్న విమర్శలు నేడు నిజమవుతున్నాయి. ఎన్నికలలో లబ్ధికోసం బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు డ్రామా ఆడిందన్న విమర్శలు వాహనదారుల నుంచి వస్తున్నాయి. 

ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చినప్పటి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకేవిధమైన పరిస్థితులు ఉంటే... అప్పుడు ఎందుకు తగ్గాయో, ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయో అంతుచిక్కటం లేదని పెట్రోల్‌, డీజిల్‌ బంకుల డీలర్లు అంటున్నారు.

మరో నెల రోజుల వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతాలను డీలర్లు ఇస్తున్నారు. పెట్రోల్‌ రూ. 80, డీజిల్‌ రూ.75 ఆపైన చేరుకునే ప్రమాదం కూడా లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నెల తర్వాత ఎన్నికల ఫీవర్‌ కారణంగా కొంతమేర ధరలు తగ్గటానికి అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది.