ఇప్పటివరకు వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించాలంటే పెట్రోల్ బంకులకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి సూపర్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు, ఇంట్లో సరుకులు కొన్న మాదిరిగా... ఇందనాన్ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు. మీరు చదివింది నిజమే. ఈ సౌలభ్యాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అలా అని పెట్రోల్ బంకులు మూసేస్తారనుకుంటే పొరపడినట్లే. పెట్రోల్ బంకులతోపాటు... సూపర్ మార్కెట్లో కూడా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే సదుపాయాన్ని  కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురావాలని  యోచిస్తోంది. ఈ మేరకు నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియ, సహజవాయువు  మంత్రిత్వ శాఖ త్వరలోనే ఓ ప్రతిపాదనను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

దీంతో త్వరలోనే సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లో ఇంధనం అమ్మకాలు సాగించేలా అనుమతి లభించనుంది. కనీస మౌలిక వసతుల కోసం దేశవాళీ మార్కెట్లో కనీసం 2 వేల కోట్ల పెట్టుబడులు, 30 లక్షల టన్నుల క్రూడాయిల్‌కు బ్యాంకు గ్యారెంటీలు తదితర నిబంధనలు సడలించనున్నారు.

దీంతో ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌తో పాటు అంతర్జాతీయ కంపెనీ సౌదీ అరామ్‌కో తదితర మల్టీనేషనల్  కంపెనీలు భారత రిటైల్ ఇంధన రంగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇది అమలు కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.