వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే విషయం ఇది. గత కొంతకాలంగా భారీగా పెరిగిన ఇందన ధరలు.. ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. వరుసగా 12వ రోజు వీటి ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80 దిగువకు వచ్చింది. దిల్లీలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర 30 పైసలు తగ్గి రూ. 79.75గా ఉంది. ఇక డీజిల్‌ కూడా 20 పైసలు తగ్గి రూ. 73.85గా ఉంది.

ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.24గా ఉంది. కోల్‌కతాలో రూ. 81.63, చెన్నైలో రూ. 82.86, హైదరాబాద్‌లో రూ. 84.54కు చేరింది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో రూ. 77.40, కోల్‌కతాలో రూ. 75.70, చెన్నైలో రూ. 78.08, హైదరాబాద్‌లో రూ. 80.35గా ఉంది.

అక్టోబరు 18 నుంచి ఈ తగ్గింపు కొనసాగుతోంది. ఈ 12 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 3.08 తగ్గగా.. 11 రోజుల్లో(అక్టోబరు 24న డీజిల్‌ ధర స్థిరంగా ఉంది) డీజిల్‌పై రూ. 1.84 తగ్గింది. అంతకుముందు దాదాపు 2 నెలల పాటు ఇంధన ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. ఓ దశలో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84, డీజిల్‌ రూ.74.73కు చేరుకున్నాయి.