యూట్యూబ్‌లో సెర్చ్ చేయడంలో చేసిన చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కనిపించిన ముత్యాల సాగు వీడియో ఆయన జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే రూ.లక్షల్లో అప్పులు తీర్చేసి రూ.లక్షలు సేవ్ చేసేంతగా.. ఆ వ్యక్తి ఎవరు? ఆయన సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందామా?
Pearl farming: యూట్యూబ్‌లో టెర్రస్ సాగుపై వీడియోలు చూస్తున్నప్పుడు చిన్న స్పెల్లింగ్ తప్పు రాజస్థాన్‌కు చెందిన నరేంద్ర కుమార్ గిర్వా జీవితాన్నే మార్చేసింది. పుస్తకాల వ్యాపారిగా జీవితం ప్రారంభించిన నరేంద్ర ఇప్పుడు విజయవంతమైన ముత్యాల సాగు రైతుగా మారిపోయారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆయన ఇప్పుడు ఏకంగా సంవత్సరానికి రూ.15 లక్షల వరకూ ఆదాయం పొందుతున్నారు. కాలం కలిసి రావడం అంటే ఇంతేనేమో..
ముత్యాల సాగులోకి నరేంద్ర ఎలా వచ్చారంటే..
రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కిషన్‌గఢ్ రెన్వాల్ గ్రామానికి చెందిన నరేంద్ర మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆ ఊరిలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తారు. కాని నరేంద్రకు సొంత పొలం లేకపోవడంతో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. గ్రామంలోని మంచి సెంటర్ లో షాపు అద్దెకు తీసుకొని పుస్తకాల దుకాణం ప్రారంభించారు. ఎనిమిదేళ్లు దుకాణం విజయవంతంగా నడిచింది. వచ్చిన ఆదాయంతో భార్య, పిల్లలతో ఆయన సంతోషంగా జీవించేవారు.
షాపు ఖాళీ చేయించడంతో కష్టాలు ప్రారంభం
అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఒకరోజు షాపు యజమాని వచ్చి దుకాణం తీసేయాలని ఆదేశించారు. తన కుమారుడు అక్కడ షాప్ పెడతాడని, అందుకే ఖాళీ చేయాలని చెప్పడంతో నరేంద్ర ఖాళీ చేయక తప్పలేదు. పుస్తక దుకాణాన్ని కొత్త సెంటర్ కి మార్చారు. కాని అక్కడ వ్యాపారం నడవకపోవడంతో రూ.4–5 లక్షల నష్టం వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది.
దారి చూపించిన యూట్యూబ్ వీడియో
ఈ సమయంలో యూట్యూబ్‌లో టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం వెతికే క్రమంలో ‘పెర్ల్ ఫార్మింగ్’ వీడియో ఎదురవడం అతని జీవితాన్ని మలుపుతిప్పింది. స్పెల్లింగ్ తప్పుకొట్టడంతో ముత్యాల సాగు వీడియో ఓపెన్ అయ్యింది. అది చూసిన నరేంద్ర, తాను ముత్యాల సాగు చేయగలనని నమ్మకంగా కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కి చెప్పారు. చాలా మంది ఆయన్ను డిస్కరేజ్ చేశారు. అయినా కూడా నరేంద్ర ధైర్యంగా ముందుకు సాగారు.
ఒడిశాలో ట్రైనింగ్..
ఒడిశాలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ (CIFA)కు రూ.6,000 చెల్లించి నరేంద్ర అయిదు రోజుల శిక్షణ పొందారు. 2015లో కేరళ నుంచి 500 ముత్యాల ముస్సెల్స్(ముత్యపు జీవి) కొనుగోలు చేసి మొదటిసారి సాగు ప్రారంభించారు. అయితే రాజస్థాన్ వాతావరణం అనుకూలించకపోవడంతో మొదటి బ్యాచ్‌లో 35 మాత్రమే బతికాయి. అమోనియా స్థాయిల సమస్య వల్ల ఈ నష్టం వాటిల్లింది. అయినా ఆయన నైతికంగా కుంగిపోలేదు. మళ్ళీ మరో 500 ముస్సెల్స్‌తో ప్రయత్నం చేశారు.
తప్పులు సరిదిద్దుకొని సక్సెస్ సాధించి..
ఈసారి పూలింగ్ టెంపరేచర్, నీటి చలనం, హరిత నీడల వంటి పద్ధతులు ఉపయోగించి 70% సర్వైవల్ రేటు సాధించారు. 700 ముత్యాలను ఒక్కొక్కటి రూ.300కి అమ్మి రూ.2 లక్షల ఆదాయం సంపాదించారు. రెండో ప్రయత్నం సక్సెస్ కావడంతో నెమ్మది నెమ్మదిగా పెట్టుబడి పెంచారు.
18 నెలలకు రూ.15 లక్షల ఆదాయం..
ముత్యాల సాగుకు సుమారు సంవత్సరంన్నర సమయం పడుతుంది. ఇలా ఆయన పంట పంటకు సాగు పెంచుతూ ప్రస్తుతం ఆయన 3000 ముస్సెల్స్‌తో ముత్యాల సాగు చేస్తున్నారు. ఇదంతా కేవలం 300 చదరపు అడుగుల స్థలంలోనే చేస్తుండటం విశేషం. ప్రతి 18 నెలలకు 5000 ముత్యాల దిగుబడి సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు రూ.10–15 లక్షల ఆదాయం వస్తోంది.
అమెజాన్, ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలలో అమ్మకం..
తన ముత్యాలను అమెజాన్, రిటైల్ మార్కెట్ల ద్వారా విక్రయిస్తున్నారు. ముత్యాలతో ఆభరణాలు తయారు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇతరులకు కూడా అవకాశం కల్పిస్తూ ఇప్పటివరకు మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి 200 మందికి శిక్షణ ఇచ్చారు. రూ.4,000 శిక్షణ ఫీజుగా తీసుకొని రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.