Paytmపై RBI కొత్త వినియోగదారులను చేర్చుకోవద్దని నిషేధం విధించిన అనంతరం. PayTM స్టాక్ కదలికలపై ప్రభావం చూపిస్తోంది. ఇంట్రాడేలో ఇప్పటికే ఈ స్టాక్ 12 శాతం నష్టపోగా, లిస్ట్ అయినప్పటి నుంచి ఈ స్టాక్ 65 శాతం నష్టపోయింది. 

Paytmకు RBI ఇచ్చిన షాక్ తో ఈ రోజు ట్రేడింగ లో ఆ కంపెనీ షేర్లలో భారీ క్షీణత నమోదవుతోంది. ఈరోజు ఇంట్రాడేలో కంపెనీ షేరు 12 శాతానికి పైగా బలహీనపడి రూ.672 వద్ద ఉంది. స్టాక్‌కు ఇది సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి రికార్డు గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 65 శాతం బలహీనపడింది. 

వివరాల్లోకి వెళితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై పెద్ద చర్య తీసుకుంటూ, తక్షణమే అమలులోకి వచ్చేలా కొత్త కస్టమర్‌లను చేర్చుకోవడంపై నిషేధం విధించింది. దీని తరువాత, స్టాక్‌కు సంబంధించి మార్కెట్ సెంటిమెంట్ మరింత దిగజారింది. దీంతో ఈ స్టాక్‌ను ఇణ్వెస్టర్లు భారీగా విక్రయించారు. ప్రస్తుతానికి ఈ స్టాక్‌ ను హోల్డ్ చేస్తున్న ఇన్వెస్టర్లు ఏమి చేయాలి అని తలపట్టుకుంటున్నారు. 

బ్రాండ్‌ ప్రభావితం అవుతోంది...
బ్రోకరేజ్ హౌస్ మాక్వేరీ Paytm స్టాక్‌లో అండర్ పెర్ఫార్మర్ రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ బ్రోకరేజ్ హౌస్ స్టాక్‌ టార్గెట్ రూ.700 గా నిర్ణయించగా, ఇంట్రాడేలో స్టాక్ ఆ స్థాయిని బ్రేక్ చేసి రూ.672కి బలహీనపడింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును RBI నిషేధించడం స్టాక్ అమ్మకాలకు దారితీస్తోందని, బ్రోకరేజ్ చెబుతోంది. పేమెంట్ బ్యాంక్ కస్టమర్ బేస్ ఇప్పటికే భారీగా ఉన్నప్పటికీ, ఇది కంపెనీ వ్యాపారాన్ని పెద్దగా ప్రభావితం చేయకపోయినా. బ్రాండ్ కస్టమర్ లాయల్టీపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. 

టార్గెట్ కట్‌ చేసిన బ్రోకరేజీలు..
బ్రోకరేజ్ హౌస్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తూ, 2022-23లో Paytm వినియోగదారు బేస్ 10 శాతం పెరుగుతుందని పేర్కొంది. మరోవైపు, నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారులు 25 శాతం కంటే ఎక్కువ రన్ రేట్‌ను పెంచుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం, RBI నిషేధం తర్వాత, ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి, ఇప్పటికే ఉన్న కస్టమర్ బేస్ పెంచుకోవడానికి కంపెనీ అదనపు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.

కొత్త వినియోగదారులపై నిషేధం ద్వారా రాబడిపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలనే సలహా ఉన్నప్పటికీ, బ్రోకరేజ్ స్టాక్ టార్గెట్ ధరను రూ.1352 నుండి రూ.1285కి తగ్గించింది. 

2021 సంవత్సరంలో ఎన్నో ఎదురు చూపుల తర్వాత లిస్టైన PayTM IPO స్టాక్ పెట్టుబడిదారులను నిరాశపరిచింది. కంపెనీ స్టాక్ ఈ రోజు సరికొత్త కనిష్ట స్థాయి రూ.672కి చేరుకుంది. కంపెనీ స్టాక్ 18 నవంబర్ 2021న మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. ఇది రూ. 2150 ఇష్యూ ధర కన్నా తక్కువగా రూ. 1955 వద్ద లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ రోజున 27 శాతం క్షీణించి రూ.1564 వద్ద ముగిసింది. ఈ షేరు ప్రస్తుతం రూ.672 వద్ద ఉంది, ఇది రికార్డు గరిష్ట స్థాయి కంటే 65 శాతం తక్కువ. IPO అధిక వాల్యుయేషన్ కూడా ఈ క్షీణతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.