Asianet News TeluguAsianet News Telugu

ఈ- గ్రాసరీపై పట్టే లక్ష్యం: బిగ్‌బాస్కెట్‌తో పేటీఎం చర్చలు.. కానీ!!

దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ – గ్రాసరీ మార్కెట్‌ పట్టు పెంచుకుంటున్నది. ఈ సెగ్మెంట్‌లో పట్టు కోసం పలు కంపెనీల ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగా బిగ్‌బాస్కెట్‌లో వాటాకోసం పేటీఎమ్‌ మాల్‌ శరవేగంగా చర్చలు ప్రారంభించింది. మార్కెట్‌లో పట్టు కోసం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ భారీగా పెట్టుబడులు పెడుతున్నది. 

Paytm Mall may acquire majority stake in BigBasket, talks on fast track
Author
New Delhi, First Published Oct 3, 2018, 8:05 AM IST

ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌లో ఈ – గ్రాసరీ సెగ్మెంట్‌ ఇప్పుడొక హాట్‌‌కేక్‌. భవిష్యత్‌లో భారీ రాబడి, లాభాలు వస్తాయన్న అంచనాలు ఉన్న ఈ–గ్రాసరీ సెగ్మెంట్లో పట్టు, మార్కెట్‌ వాటా పెంచుకోవడం కోసం పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడం, పెట్టుబడులను మరింత గుమ్మరించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో టాప్‌లో ఉన్న ‘బిగ్‌బాస్కెట్‌’లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం పేటీఎమ్‌ అనుబంధ వేదిక పేటీఎం మాల్‌ ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ చర్చలు వేగంగా సాగుతున్నాయి. అయితే బిగ్ బాస్కెట్ విలువపైనే పీటముడి పడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన వాల్‌మార్ట్‌ సంస్థ ఈ–గ్రాసరీ సెగ్మెంట్‌ పట్టు సాధించడం కోసం కోసమే భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇంకొక వైపు రిటైల్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తన ఈ కామర్స్‌ నెట్‌వర్క్‌ను మరింత పటిష్ట పరుచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతేగాక ఇటీవలే మోర్‌ సూపర్‌ మార్కెట్లను కొనుగోలు చేసిన అమెజాన్‌ కంపెనీ కూడా ఈ–గ్రాసరీ సెగ్మెంట్‌ కోసం భారీ పెట్టుబడులు గుమ్మరించేందుకు సిద్ధమవుతోంది. 

తొలుత బిగ్‌బాస్కెట్‌ బెంగళూరులో తన కార్యకలాపాలను మొదలు పెట్టింది. ప్రస్తుతం 25 నగరాల్లో కిరాణా సరుకులు, స్నాక్స్‌ డెలివరీ చేస్తోంది. 20 వేలకు పైగా ఉత్పత్తులను, వెయ్యికి పైగా బ్రాండ్ల వస్తువులను 40 లక్షల మంది వినియోగదారులకు అందిస్తోంది. ఇందులో అత్యధిక మార్కెట్‌ వాటా బిగ్‌ బాస్కెట్‌దే. ఇతర సంస్థలతో పోల్చితే బిగ్‌బాస్కెట్‌కు అధికంగా ఆర్డర్లు వస్తాయి. నెలకు దాదాపు 70 లక్షల ఆర్డర్లు వస్తాయని అంచనా.

ఈ స్థాయిల్లో ఆర్డర్లు వచ్చినా, ఈ కంపెనీ ఇంకా కీలక మైలురాయిని చేరుకోలేదు. ఈ కంపెనీలో మెజారిటీ వాటా కోసం డిజిటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్‌కు చెందిన ఈ టైల్‌ ప్లాట్‌ఫార్మ్‌  పేటీఎమ్‌ మాల్‌ ప్రయత్నస్తోంది. ఈ వాటా కొనుగోలు విషయమై గత ఏడాదే  చర్చలు ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయని సమాచారం. కానీ బిగ్‌బాస్కెట్‌తో ఎలాంటి చర్చలు జరపడం లేదని పేటీఎమ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో పేటీఎంకు దన్నుగా నిలిచిన చైనా ఆన్ లైన్ రిటైల్ మేజర్ అలీబాబా.. బిగ్‌బాస్కెట్‌లో 20 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఆ సమయంలోనే మరింత వాటా కొనుగోలు చేయగలమని పేర్కొంది.  

బిగ్‌బాస్కెట్‌–పేటీఎమ్‌ మాల్‌ డీల్‌ విషయమై బిగ్‌బాస్కెట్‌ విలువను ఎంతగా నిర్ణయించాలనే అంశంపైనే పీటముడి పడినట్లు బిగ్‌బాస్కెట్‌ వర్గాలు చెప్పాయి. ఈ అంశం తేలనందు వల్లే చర్చలు ముందుకు సాగట్లేదని  ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు మెజారిటీ వాటా ఇచ్చినందుకు పేటీఎమ్‌ మాల్‌లో తమకొక డైరెక్టర్‌ పదవి కావాలని కూడా బిగ్‌బాస్కెట్‌ కోరుతోందని సమాచారం. డీల్‌ విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, బిగ్‌బాస్కెట్‌కు ప్రీమియమ్‌ విలువ కట్టాలని కోరుతున్నామని ఆ వర్గాలంటున్నాయి.  

ఈ కామర్స్‌ స్పేస్‌లో అమెజాన్‌–ఫ్లిప్‌కార్ట్‌ల వాటా దాదాపు 95 శాతంగా ఉంది. పేటీఎమ్‌ మాల్‌ ఈ కామర్స్‌ స్పేస్‌లో మరింతగా విస్తరించాలంటే ఒక పటిష్టమైన సంస్థ కావాలి. అందుకే బిగ్‌బాస్కెట్‌లో వాటా కొనుగోలు కోసం పేటీఎం మాల్‌ తీవ్రమైన ప్రయత్నాలే చేస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

బిగ్‌బాస్కెట్‌తో టై అప్‌ వల్ల పేటీఎమ్‌ మాల్‌కు రిపీటెడ్‌ కస్టమర్లు లభిస్తారని,  ఈ రంగంలో అత్యంత ముఖ్యమైన సంస్థ, బిగ్‌బాస్కెట్‌తో జత కడితే అది పేటీఎమ్‌ మాల్‌కు, బిగ్‌బాస్కెట్‌.. ఇరు సంస్థలకు కూడా ప్రయోజనకరమని వారంటున్నారు.  

ఆన్‌లైన్‌ మార్కెట్‌ సంస్థలకు భవిష్యత్తులో గ్రాసరీ వల్లనే అధిక ఆదాయం వస్తుందని  రెండేళ్ల క్రితమే అమెజాన్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ అంచనా వేశారు. కానీ అప్పట్లో ఈ అంచనాలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రానున్న ఐదేళ్లలో ఆన్‌లైన్‌ వ్యాపారంలో సగం వాటా గ్రాసరీలు, వినియోగవస్తువులదేనని ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా  పేర్కొన్నారు.

ఈ ఏడాది చివరికల్లా ఈ గ్రోసరీ సెగ్మెంట్‌ విలువ 2,800 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.  ఈ గ్రాసరీ మార్కెట్‌ జోరు అంతకంతకూ పెరగనున్నదని గుర్తించిన అన్ని ఈ–కామర్స్‌ సంస్థలు గ్రాసరీస్పేస్‌లో మరింత మార్కెట్‌ వాటా కోసం ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్‌ తదితర సంస్థలు ఈ గ్రాసరీ సెగ్మెంట్‌లో మరింత వాటా కొల్లగొట్టడంపైనే దృష్టి పెట్టాయి. ఈ గ్రాసరీ సెగ్మెంట్‌ కోసమే వాల్‌మార్ట్ 40 కోట్ల డాలర్లు కేటాయించింది. ఈ సంస్థ ఇప్పటికే తన ఆన్‌లైన్‌ గ్రాసరీ విభాగాన్ని సూపర్‌మార్ట్‌ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. గతంలో నియర్‌బై ద్వారా ఈ–గ్రాసరీ సెగ్మెంట్‌లో ఎదురు దెబ్బలు తిన్న ఫ్లిప్‌కార్ట్‌ ఈసారి మాత్రం విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

ప్రతిరోజూ డిస్కౌంట్లు ఇవ్వడం, సొంత సరఫరా నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకుంటోంది. ఇక రిలయన్స్‌ అతి పెద్ద ఈ గ్రోసరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్‌ రిటైల్‌ ఇప్పటికే 8,000 స్టోర్స్‌ను నిర్వహిస్తోంది. భారత్‌లో నాలుగో అతి పెద్ద రిటైల్‌ చెయిన్‌ మోర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఈ–గ్రోసరీ సెగ్మెంట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని అమెజాన్‌ ప్రయత్నాలు చేస్తోంది.

మొత్తం మీద ఈ–గ్రోసరీ మార్కెట్లో మరింత మార్కెట్‌ వాటా కోసం కంపెనీల మధ్య పోరు మరింతగా వేడెక్కుతోందని, కొన్నాళ్లు వినియోగదారులకు డిస్కౌంట్ల నజరానాలు లభిస్తాయని నిపుణులంటున్నారు.

కాగా బిగ్ బాస్కెట్ సంస్థలో చైనా రిటైల్ మేజర్ ఆలీబాబా  రూ.1,460 కోట్లు పెట్టుబడులు పెట్టింది. ‘ఈ- గ్రాసరీ’ మార్కెట్ కోసం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ రూ.2,920 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఇక ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన ‘మోర్’ కోసం అమెజాజన్, సమర క్యాపిటల్ రూ.4,200 కోట్లు వెచ్చించింది. దేశవ్యాప్తంగా రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్లు 8,000 ఉన్నాయి. వీటిని ఈ –గ్రాసరీ కోసం వాడాలని  రిలయన్స్‌ భావిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios