డిజిటల్ చెల్లింపుల పట్ల ప్రజల్లో క్రమంగా ఆసక్తి పెంచుతూ దూసుకెళ్తున్న ఆన్ లైన్ పేమెంట్స్ బ్యాంక్ ‘పేటీఎం’ మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’ నష్టాలు మరింత పెరిగాయి. గత మార్చితో ముగిసిన 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 879 కోట్ల నుంచి రూ.1,490.4 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

గతేడాదితో పోలిస్తే నష్టాలు 69 శాతం పెరిగాయన్న మాట. అంతకు ముందు ఏడాది సంస్థ నష్టం రూ.879.6 కోట్లుగా నిలిచాయి. 2017-18లో ‘వన్ ‌97కమ్యూనికేషన్స్’ నిర్వహణ ఆదాయం రూ.627.76 కోట్ల నుంచి రూ.2,987.41 కోట్లకు పెరిగింది. ఉద్యోగులకు రూ.540 కోట్లు వేతనాలు, ఇతర రూపేణా ఖర్చుచేసింది.

ప్రస్తుతం వన్‌97 కమ్యూనికేషన్స్‌ కింద పేటీఎం ఎంటర్‌టైన్‌మెంట్‌, పేటీఎం మనీ, మొబిక్వెస్ట్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌, లిటిల్‌ ఇంటర్నెట్‌, ఎక్సీడ్‌ ఐటీ సొల్యూషన్‌, నియర్‌బై ఇండియా, ఆక్యూమెన్‌ గేమ్‌ ఎంటర్‌టైన్‌ వంటి సబ్సిడరీ సంస్థలు ఉన్నాయి.

పేటీఎం మాల్‌ బాధ్యతలు నిర్వహించే పేటీఎం ఈ- కామర్స్‌ 2017-18 ఏడాదికి రూ.1,787.55 కోట్ల నష్టాన్ని మరో ప్రత్యేక ఫైలింగ్‌లో చూపింది. అంతకు ముందు ఏడాది ఇది రూ.13.63 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక నిర్వహణాదాయం రూ.7.16 కోట్ల నుంచి రూ.744.15 కోట్లకు పెరగడం విశేషం.

2016-17లో పేటీఎం పూర్తి ఆదాయం రూ.780 కోట్ల నుంచి నాలుగింతలు పెరిగి రూ.3,314 కోట్లకు చేరుకున్నది. చైనా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘ఆలీబాబా’ అనుబంధ సంస్థ పేటీఎం ఉద్యోగుల వ్యయం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఖర్చులు, వాణిజ్య ప్రకటనల వ్యయం రెట్టింపైంది.

2017లో సంస్థ ఖర్చులు రూ.1947 కోట్లు అయితే మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.4,718 కోట్లకు ఎదిగింది. పేటీఎం ఖర్చుల్లో అత్యధికం వాణిజ్య ప్రకటనలు, ప్రమోషన్లపై రూ.967 కోట్ల నుంచి రూ.2,917 కోట్లకు పెరిగాయి. సిబ్బంది కోసం రూ.540 కోట్లు ఖర్చు చేసింది. 

తాజాగా 2016 ఆగస్టులో పేటీఎం తన ఈ- కామర్స్ బిజినెస్ ‘పేటీఎం మాల్’ను ‘పేటీఎం ఈ- కామర్స్’గా విడదీసింది. జపాన్ నుంచి రూ.1,500 కోట్లు, ఆలీబాబా సంస్థ నుంచి రూ.3000 కోట్లు నిధులు సేకరించింది. వచ్చే మూడేళ్లలో రూ.5000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేటీఎం గత మే నెలలో ప్రకటించింది. తాజాగా జపాన్‌లో ‘పేపే’ పేరిట ఆన్ లైన్ లావాదేవీలను ప్రారంభించింది.