PayTM వ్యవస్థాపకుడు, CEO అయిన విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి DCP వాహనాన్నిఢీకొట్టినందుకు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ సంఘటన ఫిబ్రవరి 22 న జరిగింది.

Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ తన కారును DCP సౌత్ ఢిల్లీ వాహనంపైకి ఢీకొట్టడంతో అరెస్టు అయి, ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సంఘటన ఫిబ్రవరి నెలలో జరిగింది. విజయ్ శేఖర్ శర్మను IPC సెక్షన్ 279 (వేగం మరియు నిర్లక్ష్యంగా నడపడం) కింద అరెస్టు చేశారు. ఈ సంఘటన ఫిబ్రవరి 22న జరిగింది. సౌత్ ఢిల్లీ డీసీపీ బెనిటా మేరీ జాకర్ కారుపైకి విజయ్ శేఖర్ శర్మ కారు దూసుకెళ్లిన ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం, ఢిల్లీలోని అరబిందో మార్గ్‌లోని మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వెలుపల, పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ నడుపుతున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది.

తొలుత విజయ్ శేఖర్ శర్మను అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి సుమన్ నల్వా తెలిపారు. కానిస్టేబుల్ దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, తాను డీసీపీ వద్ద డ్రైవర్ డ్యూటీలో ఉన్న సమయంలో, ఫిబ్రవరి 22న ఉదయం 8 గంటల ప్రాంతంలో పెట్రోల్ పోయించుకునేందుకు డీసీపీ కారు పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి ఆ తర్వాత బయలుదేరామన్నారు. 

అనంతరం డీసీపీ కారుతో మదర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు రాగానే ట్రాఫిక్ జామ్ అయింది. తాను కారు స్పీడ్ తగ్గించి, మరో కానిస్టేబుల్ ప్రదీప్‌ని దిగి ట్రాఫిక్ క్లియర్ చేయమని అడిగాను. ఈ లోగా విజయ్ శేఖర్ శర్మ నడుపుతున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ అతి వేగంతో వచ్చి డిసిపి వాహనాన్ని ఢీకొట్టింది. రిజిస్ట్రేషన్ నంబర్ హర్యానాదని, ఆ వ్యక్తి అక్కడి నుంచి తన వాహనంతో తప్పించుకున్నారని తెలిపారు. 

ఆ తర్వాత మేము మా DCP కి సమాచారం అందించాము. యాక్సిడెంట్ చేసిన వాహనం నంబర్‌ను నోట్ చేసుకున్నామని, ఆపై మాళవియా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కానిస్టేబుల్ దీపక్ కుమార్ తెలిపారు. 

ఢిల్లీ పోలీసులు, రవాణా శాఖ కారుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించగా. ఆ కారు చిరునామా గురుగ్రామ్‌లోని ఓ కంపెనీ పేరుతో రిజిస్టర్ చేయబడి ఉంది. గ్రేటర్ కైలాష్-2 నివాసి శర్మకు చెందిన వాహనంగా కంపెనీ పోలీసులకు తెలిపింది. అనంతరం శర్మను మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అక్కడే అయనను అరెస్టు చేయగా, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ప్రమాదం అనంతరం కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌ను మీడియా సంప్ర‌దించే ప్ర‌య‌త్నం చేయ‌గా, ఆయన అందుబాటులో లేరు.