Asianet News TeluguAsianet News Telugu

డబ్బు చెల్లిస్తేనే ఆయిల్: ‘మహరాజా’కు ఆయిల్ సంస్థల ఆల్టిమేటం!!

రుణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియా సంస్థను ఒక సమస్య వెంబడి మరొక సమస్య వెంటాడుతున్నది. రూ.50 వేల కోట్ల రుణాలతో అల్లాడుతోంది. మొత్తం సంస్థను వేలం వేయడానికి జరిగిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఒక్కొక్కటి విక్రయించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో రోజువారీగా పెట్రోల్ బిల్లులు చెల్లిస్తే పెట్రోల్ సరఫరా చేస్తామని పెట్రోలియం సంస్థలు ఆల్టిమేటం జారీ చేసింది.

Pay daily or well turn off fuel supply: Oil companies to Air India
Author
Mumbai, First Published Sep 20, 2018, 11:54 AM IST

‘మహారాజా’గా పేరొందిన కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా రోజురోజుకో సవాల్ ఎదుర్కొంటోంది. బకాయిల చెల్లింపుల కోసం సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నది. మరోవైపు గ్రూప్ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.

రూ.50వేల కోట్ల రుణాల ఊబిలో చిక్కుకున్న ఎయిర్ ఇండియా సంస్థకు మరో చిక్కు వచ్చి పడింది. ముడి చమురు సంస్థలు ఇక రోజువారీగా చెల్లింపులు జరిపితేనే జెట్ ఫ్యూయల్ సరఫరా చేస్తామని మహారాజా ‘ఎయిర్ఇండియా‘కు తేల్చేశాయని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.

ఎందుకంటే ఇప్పటికే ఫ్యూయల్ ఇంధనం సరఫరా చేసినందుకు చమురు సంస్థలకు ఎయిర్ ఇండియా బకాయిలు రూ.5000 కోట్లు దాటింది మరి. రోజూ ఎయిర్ ఇండియా రూ.20 కోట్ల విలువైన ఫ్యూయల్ కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముడి చమురు సంస్థలన్నీ ఏకమై రోజువారీగా చెల్లింపులు జరిపితేనే ఆయిల్ సరఫరా చేస్తామని ఆల్టిమేటం జారీ చేసేశాయి. 

పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారి ఒకరు దీనిపై స్పందిస్తూ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నందు వల్లే రెగ్యులర్‌గా ఇంధన చార్జీలు చెల్లించలేకపోతోంది’ అని ధ్రువీకరించారు. ఈ విషయమై ఎయిర్ ఇండియా, ముడి చమురు సంస్థలు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని తెలిపారు. 

గమ్మత్తేమిటంటే ప్రభుత్వం సమకూర్చిన నిధులతో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల రుణ వాయిదాలన్నీ క్లియర్ చేసిన తర్వాత ఎయిర్ఇండియా సంస్థను తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి ముడి చమురు సంస్థలు. ముడి చమురు సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.5000 కోట్లు దాటిందన్న అంచనాలు ఉన్నాయి.

ఏడాదిన్నర నుంచి ఎయిర్ ఇండియా రోజువారీగా ఆయిల్ చెల్లింపులు జరుపడం లేదని ముడి చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం జెట్ ప్యూయల్ ధరల పెరుగుదల కూడా సమస్యకు మరో కారణమని సీనియర్ ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. సదరు ముడి చమురు సంస్థలతో సంప్రదిస్తున్నామని, త్వరలో పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. తమ బకాయిల చెల్లింపు విషయమై స్ఫష్టమైన వైఖరితో ముందుకు రావాలని ఎయిరిండియాను చమురు సంస్థలు కోరుతున్నాయి. 

ఎయిరిండియాలో 76 శాతం వాటాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా, వాటాల కొనుగోలు కోసం ఏ సంస్థ కూడా రాలేదు. దీంతో తాత్కాలికంగా రూ.2000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎయిరిండియా కోరింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.980 కోట్లు ఈక్విటీ రూపంలో విడుదల చేయగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలపై రూ.2000 కోట్ల రుణాలిచ్చింది. ఇవి కాకుండా ఎయిరిండియా స్వయంగా నిధులు సేకరించింది. అదనంగా మరో 500 కోట్లను సేకరించనున్నామని తెలిపింది. 

కాగా, ఇంతకుముందు ఎయిర్‌ ఇండియా  అనుబంధ విభాగాలైన ఎయిర్‌లైన్‌ అల్లైడ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఎఎస్ ఎల్‌), హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌సిఐ), ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఎఐఎటిఎ్‌సఎల్‌), ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఎఐఈ్‌సఎల్‌)లో వ్యూహాత్మక వాటా విక్రయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్ మెంట్‌) ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నదని సమాచారం. 

ఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ప్రధాన కార్యాలయ భవనం, దేశంలోని పలు ప్రాంతాల్లో సంస్థకున్న భూములు, భవనాలు, గతంలో సంస్థ కొనుగోలు చేసిన ప్రముఖుల పెయింటింగ్స్‌, ఇతర కళాఖండాలను సైతం విక్రయించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే జాబితాను రూపొందిచినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

వీటితో పాటు దిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయ భవనం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంస్థకు ఉన్న ఇతర స్థిరాస్తులు, విమానయాన సంస్థ భవంతులను విక్రయానికి పెట్టనుంది. విమానయాన సంస్థకు చెందిన ఆస్తుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలయన్స్‌ ఎయిర్‌ పేరు కింద ప్రాంతీయ అనుసంధాన సేవలను ఏఏఎస్‌ఎల్‌ అందిస్తోంది. దిల్లీ, శ్రీనగర్‌, ఇతర ప్రాంతాల్లో హెచ్‌సీఐ హోటళ్లను నిర్వహిస్తోంది. 

ఇక గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌, కార్గో హ్యాండ్లింగ్‌ సేవలను ఏఐఏటీఎస్‌ఎల్‌ నిర్వహిస్తుంటే, ఇంజిన్ల మరమ్మతు,, నిర్వహణ, ఓవర్‌హాల్‌ సేవలను ఏఐఈఎస్‌ఎల్‌ చూసుకుంటుంది. ప్రధాన కార్యాలయం భవంతితో పాటు ముంబయి, దిల్లీల్లో ఇతర ప్రధాన ఆస్తులను విక్రయించాలని ఎయిరిండియా భావిస్తోంది.

ఆస్తుల విక్రయం ద్వారా సంస్థ రుణాలు తగ్గించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయానికి బిడ్లు ఆహ్వానించగా.. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎయిరిండియాను పునరుజ్జీవం చేయాలని మంత్రుల బృందం నిర్ణయించిన సంగతి విదితమే.

Follow Us:
Download App:
  • android
  • ios