న్యూఢిల్లీ: దేశీయంగా ప్రయాణ వాహనాల (పీవీ) అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. గత డిసెంబర్ నెలలోనూ పీవీల అమ్మకాలు తగ్గాయి. దీంతో జూలై నుంచి ఐదు నెలల్లో అమ్మకాలు తగ్గినట్లైందని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం (సియాం‌) తెలిపింది. 

గత డిసెంబర్ నెలలో ప్రయాణ వాహనాల అమ్మకాలు 2,38,692 యూనిట్లుగా నమోదయ్యాయి. 2017 డిసెంబర్ నెలలో 2,39,723 ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. దేశీయంగా కార్ల అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 2.01 శాతం తగ్గాయి. 2017 డిసెంబర్ నెలలో 1,58,338 యూనిట్లు అమ్ముడు పోతే 2018లో 1,55,159 యూనిట్లకు చేరాయి. 

2018 నవంబర్ నెలలో ప్రయాణ వాహనాల అమ్మకాలు 3.43 శాతం తగ్గాయి. గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ప్రయాణ వాహనాల అమ్మకాలు వరుసగా 2.71 శాతం, 2.46 శాతం, 5.61 శాతం తగ్గాయి. అక్టోబర్ నెలలో 1.55 శాతం పెరగడంతో అమ్మకాల్లో వరుస క్షీణతకు అడ్డుకట్టపడినట్లైంది. 

పండగల సీజన్‌లో అనుకున్న స్థాయిలో అమ్మకాలు జరగని కారణంగా డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోయాయని, ఈ నేపథ్యంతో ఆటో కంపెనీలు సర్దుబాటు చేస్తున్నాయని సియాం ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా తెలిపారు. ఇంతకు ముందు ఇన్వెంటరీ స్థాయిలు 45-50 రోజుల వరకు ఉండేదని, ఇప్పుడు 30-35 రోజులకు తగ్గినట్టు చెప్పారు. అధిక ఇంధన ధరలు, ఫైనాన్స్‌ కొర త తదితర అంశాలు మూడో త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడానికి కారణమైనట్టు ఆయన తెలిపారు.