Asianet News TeluguAsianet News Telugu

బాలాకోట్ ‘ఆంక్షలు’: ఇండియన్ ఎయిర్ లైన్స్ కుదేలు

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాల ధ్వంసానికి భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు భారత ఎయిర్‌లైన్స్‌కు కష్టాలు తెచ్చి పెట్టాయి. బాలాకోట్ పై దాడి తర్వాత పాక్ గగనతల మూసివేసిన సంగతి తెలిసిందే.

Pakistan airspace ban has hit India's airlines
Author
New Delhi, First Published May 6, 2019, 11:12 AM IST

న్యూఢిల్లీ: భారతీయ విమానయాన సంస్థల పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైంది. అసలే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న మన విమానయాన రంగానికి ఇప్పుడు పాకిస్తాన్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగులుతున్నది. 

పుల్వామా ఉగ్రదాడి.. అటుపై పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారతీయ వాయుసేన వైమానిక దాడులతో తంటా వచ్చి  పడింది. పాకిస్థాన్ ప్రభుత్వం తన పరిధిలోని గగన తలం నుంచి ప్రయాణించడానికి భారత విమానయాన సంస్థలపై నిషేధం విధించింది పాక్. గగన తలంపై పాక్ ఆంక్షల్ని తెచ్చి పెట్టాయి. 

అంతర్జాతీయ మార్గాల్లో పాకిస్తాన్ గగనతలం అత్యంత కీలకం కావడంతో దాయాది నిర్ణయం.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలను ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. 

వ్యాపారం పడిపోయి వ్యయ నియంత్రణ చర్యల్లో ఉన్న దేశీయ విమానయాన సంస్థలకు పాక్ గగన తలం మూసివేత శరాఘాతమే అయ్యింది. పాక్ గగన తలంపై ఉన్న ఆంక్షల నేపథ్యంలో భారత్ నుంచి చాలా దేశాలకు వెళ్లే విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. 

పాకిస్థాన్ చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల విమానాల ఇంధన వినియోగం పెరిగిపోతున్నది. ఏప్రిల్‌లో కిలో లీటర్ ఖర్చు 668 డాలర్లుగా ఉంటే.. ఈ నెల 700 డాలర్లకు పెరిగింది. 

ఈ నెల 15దాకా పాక్ గగన తలంపై ఆంక్షలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మరో 10 రోజులు మన ఎయిర్‌లైన్స్‌కు తిప్పలే.

పాకిస్తాన్ గగన తలం మూసివేత ప్రభావం రోజూ దాదాపు 400 విమానాలపై పడుతున్నది. ఇప్పటికే ఇరాన్ గగన తలంపై రద్దీ పెరిగింది. ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని విమానయాన సంస్థలు వాడుకుంటుండగా, 100 కుపైగా విమానాల రాకపోకలు పెరిగాయి. 

ఇరాన్ గగనతలం మీదుగా వెళ్లడం వల్ల 451 కిలోమీటర్ల దూరం పెరిగింది. ఫలితంగా చాలా విమాన సర్వీసులు రద్దెపోయాయి. తప్పని పరిస్థితుల్లో ఒమన్ తదితర అరబ్ దేశాల మార్గాలను విమానయాన సంస్థలు వాడుకుంటున్నాయి. అయితే వ్యయభారం మాత్రం భరించలేకుండా ఉన్నాయి.

పాక్ నిర్ణయం అన్నింటికంటే భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై ఎక్కువ ప్రభావం చూపుతున్నది. భారత్ నుంచి ఐరోపా దేశాలకు, అమెరికాకు నడుస్తున్న ఏకైక విమాన సర్వీసులు ఎయిర్ ఇండియావే.

ఐరోపా, అమెరికాకు వెళ్లాలంటే పాకిస్తాన్ మీదుగానే దగ్గర దారి. అదికాస్తా మూతబడటంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దీంతో నిషేధం ఎత్తివేసేదాకా ఎయిర్ ఇండియాకు మరో 100 కోట్ల నష్టం వాటిల్లవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రూ.372 కోట్ల నష్టం వాటిల్లింది. ఢిల్లీ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసు.. ఇంధనం కోసం మరోచోట ఆగాల్సి వస్తున్నది. ముంబై, అహ్మదాబాద్‌ మీదుగా వెళ్తూ అరేబియా సముద్రం, మస్కట్ గుండా అమెరికాకు చేరుతున్నాయి. ఫలితంగా గంటల తరబడి ఆలస్యం, వ్యయభారం తప్పట్లేదు.

దేశీయ ప్రైవేట్ రంగ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్లనూ పాక్ నిర్ణయం గట్టిగానే దెబ్బకొట్టింది. ఈ ఏడాది మార్చి 20న ఢిల్లీ-ఇస్తాంబుల్ మార్గంలో సర్వీసుల్ని ఇండిగో ప్రారంభించింది. ఇండిగోకు ఇదే సుదూర సర్వీసు. అయితే నాన్‌స్టాప్‌గా ఉన్న ఈ సర్వీసు పాక్ గగన తలం మూసివేతతో ఇంధనం కోసం ఓ దగ్గర ఆగాల్సి వస్తున్నది.

అంతేగాక ఒక వైపునకు అదనంగా 2,500 -3,000 లీటర్ల ఇంధనం ఖర్చవుతున్నది. ఇక స్పైస్‌జెట్‌కు చెందిన ఢిల్లీ-గల్ఫ్ విమాన సర్వీసులకూ పాక్ సెగ తగులుతున్నది. ఇప్పటికే ఢిల్లీ-కాబూల్ సర్వీసును స్పైస్‌జెట్ రద్దు చేసింది.

 మొత్తానికి పాక్ నిర్ణయం భారతీయ ఎయిర్‌లైన్స్ ఆదాయానికి భారీగానే గండి కొడుతున్నది. పాక్ రక్షణాత్మక ధోరణి దేశీయ విమానయాన సంస్థల మనుగడనే దెబ్బతీస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios