Asianet News TeluguAsianet News Telugu

ఇజ్రాయెల్ లో పనిచేస్తున్న మా ఉద్యోగులు సురక్షితం, మీడియా ప్రకటన విడుదల చేసిన అదానీ పోర్ట్స్..

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కారణంగా అదానీ పోర్ట్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్ షేర్లు దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్ అదానీ పోర్ట్స్ ఆధీనంలో ఉంది. అయితే దీనికి సంబంధించి అదానీ పోర్ట్స్ మీడియా ప్రకటన విడుదల చేసింది. తమ ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపింది.

Our employees working in Israel are safe Adani Ports released a media statement MKA
Author
First Published Oct 9, 2023, 5:50 PM IST | Last Updated Oct 9, 2023, 5:50 PM IST

ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్, సెజ్ సోమవారం తెలిపింది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని నియంత్రించే హమాస్, శనివారం ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలపై భూ, వైమానిక దాడులను నిర్వహించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైఫా పోర్ట్ విషయంలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాపార కొనసాగింపు ప్రణాళికను సిద్ధం చేసినట్లు అదానీ పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఓడరేవును కంపెనీ ఏడాది ప్రారంభంలో 1.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, “మేము గ్రౌండ్ రియాలిటీని, ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. హైఫా ఓడరేవు ఉత్తర ప్రాంతంలో ఉండగా, దక్షిణ ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిణామాలు జరుగుతున్నాయని" ఆయన తెలిపారు. అదానీ పోర్ట్స్ అండ్ SEZ లిమిటెడ్ ఒక ప్రకటనలో, "మా ఉద్యోగుల భద్రతను పర్యవేక్షించేందుకు మేము అన్ని చర్యలు తీసుకున్నాము. వారందరూ సురక్షితంగా ఉన్నార" ని ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే అదానీ పోర్ట్స్, SEZ మొత్తం వ్యాపారంలో హైఫా పోర్ట్ వాటా కేవలం మూడు శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో కంపెనీ మొత్తం లోడింగ్ 203 మిలియన్ టన్నులు కాగా, ఇందులో హైఫా వాటా 60 లక్షల టన్నులుగా పేర్కొన్నారు. దీనితో పాటు, కంపెనీ తన వ్యాపార పనితీరును కొనసాగించడంలో పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే ఈ యుద్ధం కారణంగా, గౌతమ్ అదానీ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టాక్ కూడా నష్టపోయింది. అదానీ పోర్ట్స్ షేర్ 4.50 శాతం భారీ పతనంతో ట్రేడవుతోంది. షేరు విలువ రూ.800 దిగువకు పడిపోయింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios