ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో కిలో ధర రూ.70-80కి చేరింది. ఉల్లి సాగు చేసే ప్రధాన రాష్ర్టాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. 

ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఉల్లి నిల్వలపై పరిమితి విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. అంతకుముందు వారం ఉల్లి రిటైల్ ధరలు గుర్గావ్, జమ్ములో కిలో రూ.60, ఢిల్లీలో రూ.57, ముంబైలో రూ.56, కోల్‌కతాలో రూ.48, చెన్నైలో రూ.34గా ఉన్నాయి. అయితే గత వారం ఇవి రూ.20 మేరకు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు.

ధరల నియంత్రణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నిజానికి ఉల్లి సరఫరాను మెరుగుపరిచి ధరలను సాధారణ స్థాయికి తెచ్చేందుకు గత కొన్ని వారాలుగా కేంద్రం చర్యలు చేపట్టిందని, అయితే ప్రధానంగా ఉల్లిసాగు చేసే రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురువడం వల్ల గత రెండు మూడు రోజుల్లో ఉల్లి ధరలు అమాంతం పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఉల్లిని ఎక్కువగా సాగు చేసే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వచ్చే 2-3 రోజుల్లో పరిస్థితులు అదుపులోకి రాకపోతే, ఉల్లి నిల్వలపై పరిమితులు విధించాలని కేంద్రం భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. రాయితీలకు కోత విధించడం, కనీస ఎగుమతి ధర పెంపు ద్వారా ఇతర దేశాలకు జరుగుతున్న ఎగుమతులకు చెక్ పెట్టాలని కూడా మోదీ సర్కార్ యోచిస్తున్నది.

దేశంలో తగినన్ని ఉల్లి నిల్వలున్నా, వర్షాల కారణంగా వాటి సరఫరా నిలిచిపోవడంతోనే మార్కెట్‌లో ధరలకు రెక్కలు తొడుగుతున్నాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉంచిన ఉల్లిని విక్రయిస్తున్నామని, వర్షాకాల పంట దిగుబడులు నవంబర్ నుంచి మార్కెట్‌కు చేరుతాయని అంటున్నారు. 

కాగా, ప్రభుత్వం వద్ద ఉన్న నిల్వలను నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా సరఫరా చేస్తుండగా, వాటిని కిలో రూ.22కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రంగ మదర్ డైరీల్లో రూ.24కు అమ్ముతున్నారు. కేంద్రం వద్ద 56 వేల టన్నుల ఉల్లి నిల్వలు ఉండగా, ఇప్పటివరకు 16 వేల టన్నులను సరఫరా చేశారు. ఒక్క ఢిల్లీలోనే రోజుకు 200 టన్నుల ఉల్లి దిగుమతి అవుతున్నది. 

ఉల్లిగడ్డకు హోల్‌సేల్ మార్కెటైన మహారాష్ట్రలోని లాసల్గావ్‌లో కిలో ధర రూ.45ను తాకింది. నిరుడు ఇదే సమయంలో రూ.10 కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. తమతమ రాష్ర్టాల్లోని కేంద్రం ఉల్లి నిల్వలను పెంచుకునేందుకు ఢిల్లీసహా త్రిపుర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాలు ఆసక్తి కనబరుస్తున్నాయని సమాచారం.