న్యూఢిల్లీ: రూ.వేల కోట్ల పెట్టుబడితో దశాబ్దాల క్రుషితో ఆవిష్కరించిన చమురు, సహజవాయువు క్షేత్రాల విక్రయ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టినట్లు సమాచారం. ఓఎన్‌జీసీతోపాటు ప్రభుత్వంలోని కొన్ని వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే కేంద్రం వెనుకడుగు వేసినట్లు తెలిసింది. 

ప్రభుత్వరంగ ఓఎన్‌జీసీ కీలక ఆస్తుల విక్రయం నిలిచిపోయిందని సమాచారం. ముంబై హై, వాసాయ్‌ ఈస్ట్‌ వంటి తొమ్మిది విలువైన ఆస్తులను ప్రైవేట్, విదేశీ కంపెనీలకు తెగనమ్మేందుకు రూపొందించిన ప్రణాళికపై ప్రభుత్వంలోనే అంతర్గతంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఓఎన్జీసీ సహా ఆయిల్ క్షేత్రాల అమ్మకం ప్రయత్నాలను ప్రభుత్వం నిలిపివేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

వెస్ట్ కోస్టల్ ఆఫ్‌షోర్‌ చమురు, సహజవాయువు క్షేత్రాలైన ముంబై హై, హీరా, డీ-1, వాసాయ్‌ ఈస్ట్‌, పన్నా, అసోంలోని గ్రేటర్‌ జోరజాన్‌, గెలెకీ, రాజస్థాన్‌లోని భగ్వేవాలా, గుజరాత్‌లోని కలోల్‌ చమురు క్షేత్రాన్ని ప్రైవేట్, విదేశీ కంపెనీలకు తెగనమ్మేందుకు గతేడాది ఆఖరులో నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీ నిర్ణయించింది. 

కానీ ఈ క్షేత్రాల నుంచే దేశీయ చమురు-సహజవాయువు 95 శాతం ఉత్పత్తి జరుగుతోంది. ఇంతటి కీలక ఆస్తుల విక్రయ ప్రతిపాదన వల్ల, దురుద్దేశాలకు వీలు కల్పించే వీలుందని ఓఎన్‌జీసీతోపాటు కొన్ని అధికార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో, ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఆగిందని నీతిఆయోగ్‌తో పాటు ప్రభుత్వ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే మొత్తం ఉత్పత్తిలో ఐదుశాతానికి సమానమైన మరో 149 చిన్న క్షేత్రాలను మాత్రం బిడ్‌ల ప్రక్రియ ద్వారా విక్రయించనున్నారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు శ్రమించి, రూ.వేల కోట్ల పెట్టుబడులతో ఆవిష్కరించిన చమురు, సహజవాయువు క్షేత్రాలను ప్రైవేట్, విదేశీ సంస్థలకు ఎలా కట్టబెడతారని ఓఎన్‌జీసీ వర్గాలు ప్రశ్నించాయి. ఎంతో విలువైన ప్రైవేట్, విదేశీ సంస్థలకు అప్పగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమిటనే విషయమై ప్రభుత్వంలోనే కొన్ని వర్గాలకు మింగుడు పడలేదు.

ప్రైవేట్ సంస్థలకు  విక్రయించడం ద్వారా, సహజవాయువు-చమురు ఉత్పత్తిని మరింత పెంచొచ్చని రూపొందించిన గణాంకాలకు భూమిక ఏమిటో, ప్రాతిపదిక ఏమిటో స్పష్టత లేదు. కనీసం ఆయా బేసిన్, ఆయిల్క్షేత్రాలను పరిశీలించకుండానే కమిటీ ఎలా నివేదిక ఇచ్చిందో వెల్లడి కాలేదు.

ప్రభుత్వరంగ చమురు కంపెనీల ఆధీనంలో ఏళ్ల తరబడి ఉన్న క్షేత్రాల నుంచి ఉత్పత్తి పెరగలేదన్న వాదన ముందుకు వచ్చింది. దీంతో, వీటిని ప్రైవేటు/విదేశీ కంపెనీలకు విక్రయించాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ అంశం ప్రధాని నరేంద్రమోదీ గత అక్టోబర్ నెలలో నియమించిన రాజీవ్‌కుమార్‌ కమిటీకి చేరింది. మార్కెటింగ్‌, ధరల నిర్ణయంలో వాటికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలనీ సూచించారు. ఈ కమిటీ తుది నివేదికను జనవరి 29న ప్రభుత్వానికి అందించింది.

ప్రధాన ఆయిల్ క్షేత్రాలను విక్రయించాలన్న ప్రతిపాదనను పక్కన బెట్టినా 64 ఓఎన్‌జీసీ, రెండు ఆయిల్‌ ఇండియా చిన్న క్షేత్రాలను నాలుగు నెలల్లోగా బిడ్‌ల ద్వారా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ కంపెనీలు మరో 64 క్షేత్రాలు అట్టేపెట్టుకునేందుకు అనుమతించాలని సూచించారు. ఇందులో ఓఎన్‌జీసీకి 49, ఆయిల్‌ ఇండియాకు మూడు ఉంటాయి. ఈ క్షేత్రాల్లో ఉత్పత్తి పెంచే చర్యలు ఇప్పటికే చేపట్టడం ఇందుకు కారణం. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కొత్త అన్వేషణలకు అంగీకరించే ఒప్పందంపైనే ఇక నుంచి క్షేత్రాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయ్యే క్షేత్రాల నుంచి లాభాలను ప్రభుత్వంతో పంచుకోవాల్సిన అవసరం ఉండదు.

అసలు వాస్తవ పరిస్థితేమిటంటే కొత్త క్షేత్రాల్లో సహజ వనరుల అన్వేషణకు ప్రైవేట్, విదేశీ కంపెనీలు దూరంగా ఉంటాయి. వ్యయ ప్రయాసలకు తోడు నష్టభయం అధికంగా ఉండటం ఇందుకు కారణం. దీనికి బదులు ఓఎన్జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి సంస్థలు అభివృద్ధి చేసిన చమురు-సహజ వాయువు క్షేత్రాల్లో వాటా కోసం అవి ప్రయత్నిస్తుంటాయి. 

కొత్త పెట్టుబడి, సాంకేతికత ద్వారా ఉత్పత్తి పెంచుతామని ప్రైవేట్, అంతర్జాతీయ సంస్థలు ప్రకటించుకుంటాయి. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ ముడి చమురు సంస్థలు చూస్తే.. వీటికి మార్కెటింగ్‌, ధరలు నిర్ణయించుకునే అంశాల్లో స్వేచ్ఛ ఉండదు. అయినా కూడా 10 శాతం చొప్పున అదనపు వ్యాపారాన్ని నమోదు చేస్తున్నాయి. వీటికీ ఈ స్వేచ్ఛ ఇస్తే, కొత్త సాంకేతికతను అవీ అమలు చేయగలవని అధికార వర్గాలు చెబుతున్నాయి.