న్యూఢిల్లీ: కరోనా కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కేందుకు చాలా కాలం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతల రుణ వాయిదాలను చెల్లించడానికి మారటోరియం మరింత కాలం పొడిగించడమే మేలని కొందరు బ్యాంకర్లు అంటున్నారు. 

కొవిడ్‌-19 సంక్షోభం నుంచి రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్బీఐ తొలుత మార్చి నుంచి మే వరకు మారటోరియం కల్పించింది. ఆ తర్వాత ఈ వెసులుబాటును మరో మూడు నెలలు అంటే ఆగస్టు వరకు పొడిగించింది.

కానీ, కరోనా వైరస్‌ ఇంకా అదుపులోకి రాకపోగా కేసులు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. ఈ వైరస్‌కు టీకా 2021లోనే అందుబాటులోకి వస్తుందని వైద్య నిపుణులంటున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ను దాదాపు సడలించినా కొన్ని వ్యాపారాలపై ఆంక్షలు ఇంకా తొలగ లేదు. తెరుచుకున్న వ్యాపారాలూ గిరాకీ లేక సతమతం అవుతున్నాయి. 

మొత్తంగా ఈ ఏడాది చివరిదాకా గడ్డుకాలమేనని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ నెలతో ముగిసే త్రైమసికం బ్యాంకులకు టెస్టింగ్ పీరియడ్ వంటిదేనని యూనియన్ బ్యాంక్ చీఫ్ జీ రాజ్ కిరణ్ రాయ్ పేర్కొన్నారు. రుణ గ్రహీతలు వాయిదాలు చెల్లించడం కోసమైనా డిసెంబర్ నెల వరకు మారటోరియం కొనసాగించక తప్పదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని నవంబరు లేదా డిసెంబరు వరకు పొడిగించడం తప్ప ఆర్‌బీఐ ముందు ప్రత్యామ్నాయం లేదని సీనియర్‌ బ్యాంకర్లు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోకముందే మారటోరియం ముగిస్తే, ఈ ఆప్షన్ ఉపయోగించుకునే రుణ ఖాతాల్లో చాలా వరకు మొండి బకాయిలుగా (ఎన్‌పీఏ) మారే ప్రమాదం ఉందని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొండి బాకీలు పెరిగే ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మారటోరియాన్ని మళ్లీ పొడిగించడమే మార్గమని బ్యాంకర్లు అంటున్నారు. కరోనా దెబ్బకు రుణాలు తిరిగి చెల్లించలేని వారి సంఖ్య మన్ముందు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ అమితాబ్‌ చౌదురి అన్నారు. 

also read రిటైల్ బిజినెస్ విలవిల.. ప్రజల్లో తగ్గని ఆందోళన.. ...

అన్ని విభాగాల రుణగ్రహీతలు బకాయిల చెల్లింపుల్లో ఇబ్బందులెదుర్కొంటున్నారని ఈ మధ్య ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్ చౌదరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి కార్పొరేట్‌ రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే 12-18 నెలలు దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి సవాలేనని చౌదురి హెచ్చరించారు.

గత రెండేళ్ల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) గణనీయంగా తగ్గా యి. 2018 మార్చి నాటికి 11.6 శాతం ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న ఎన్‌పీఏలు.. 2020 మార్చి ముగిసేసరికి 8.5 శాతానికి దిగివచ్చాయి. 

కరోనా దెబ్బకు బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పెరగవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. వచ్చే మార్చి చివరినాటికి బ్యాంకుల మొండిపద్దుల వాటా 13-14 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. 


మొండి బకాయిల పెరుగుదల బ్యాంకులపై రుణ వ్యయాన్ని పెంచుతుందని, రేటింగ్‌పైనా ప్రభావం చూపనుందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశీయ ఆర్థిక సేవల రంగంలో సగటున 35-40 శాతం రుణాలు మారటోరియంలో ఉండవచ్చని ఎస్బీఐ గ్రూప్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ అంచనా వేశారు. 

గత మార్చి నాటికి బ్యాంకింగ్‌ రంగంలోని రుణ ఖాతాల విలువ రూ.104 లక్షల కోట్లు. ఎన్‌బీఎప్సీలు రూ.24 లక్షల కోట్లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు మరో రూ.లక్ష కోట్ల మేర రుణాలిచ్చాయని ఎస్‌బీఐ ఎకోవ్రాప్‌ రిపోర్టు పేర్కొంది.

మొత్తం రూ.129 లక్షల కోట్లలో 35-40% అంటే రూ.45-51 లక్షల కోట్లు) రుణాలు మారటోరియం ఎంచుకోవచ్చని అంచనా. అందులో 5-10 శాతం  అంటే రూ.2.5-5 లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారవచ్చని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా ఉధృతి కొనసాగితే మారటోరియం రుణాల్లో 20 శాతం అంటే రూ.9-10 లక్షల కోట్లు మొండిపద్దుల్లో చేరవచ్చన్న అంచనాలూ వ్యక్తమవుతున్నాయి.