Asianet News TeluguAsianet News Telugu

ఐటీ ఫైలింగ్స్ పాజిటివ్: 68% పెరిగిన కోటీశ్వరులు


కఠిన చట్టాలకు తోడు ఐటీ, సీబీడీటీ తదితర దర్యాప్తు సంస్థలు అవగాహనతోపాటు నిఘా పెంచడంతో పన్ను చెల్లింపుదారుల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. గత మూడేళ్లలో పన్ను చెల్లిస్తున్న వారిలో కోటీశ్వరుల సంఖ్య 68 శాతం పెరిగిందని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.

Number of crorepati taxpayers surges 68% in 3 years: CBDT
Author
New Delhi, First Published Oct 23, 2018, 11:55 AM IST

న్యూఢిల్లీ: గత మూడేళ్లలో దేశంలో భారీగా కోటీశ్వరులు పెరిగారు. 1.40 లక్షల మంది రూ. కోటికి పైగా వార్షిక ఆదాయాన్ని ప్రకటించారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పెరిగింది. దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 15.7 శాతం పెరిగాయన్నది. దీని ప్రకారం 2013 - 14 నుంచి 2016-17 వరకు కోటికి పైగా సంపాదిస్తున్న వారి సంఖ్య 68 శాతంగా (81,344 మంది) పైగా నమోదైంది. పన్ను చెల్లింపులు ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా రూ.4.89 లక్షల కోట్లకు చేరాయని వెల్లడించింది. మరోవైపు భారతీయులు విదేశాల్లో పోగేసిన అక్రమ సొమ్ముపై ఐటీ శాఖ దృష్టి సారించింది.

గత మూడేళ్లలో కోటీశ్వరులు 68 శాతం పెరిగారన్న సీబీడీటీ.. వీరిలో వ్యక్తులు, కార్పొరేట్లు, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నది. 2014-15 మదింపు సంవత్సరంలో వ్యక్తిగతంగా కోటి రూపాయలకుపైగా వార్షిక ఆదాయాన్ని చూపించిన పన్ను చెల్లింపుదారులు 48,416 మంది ఉన్నారని, 2017-18లో 81,344కు వీరు చేరారని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

సంస్థలు, కార్పొరేట్లు, హిందూ అవిభాజ్య కుటుంబాలతో కలిపితే కోటి రూపాయలకుపైగా వార్షిక ఆదాయాన్ని చూపినవారు 2014-15లో 88,649గా ఉంటే 2017-18లో 1,40,139కి పెరిగారని సుశీల్ చంద్ర చెప్పారు. బకాయిల వసూళ్లలో భాగంగా గత కొన్నేండ్లుగా పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన పెంచుతున్నామని, అలాగే పరిపాలన, శాసన, సమాచార, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల కృషి కూడా దోహదం చేసిందని సుశీల్ చంద్ర అన్నారు. ఆదాయం పన్ను (ఐటీ) రిటర్నుల దాఖలు కూడా 2013-14 నుంచి 2017-18 వరకు 3.79 కోట్ల నుంచి 6.85 కోట్లకు పెరిగాయని తెలిపారు.

పన్నులు చెల్లిస్తున్న ఉద్యోగ, ఉద్యోగేతరుల సగటు ఆదాయం గత మూడేళ్లకుపైగా కాలంలో పెరిగిందని సీబీడీటీ స్పష్టం చేసింది. కార్పొరేట్ల ఆదాయం కూడా ఎగబాకిందని చెప్పింది. 2014-15 నుంచి 2017-18 వరకు పన్నులు చెల్లించే ఉద్యోగుల సంఖ్య 37 శాతం ఎగిసి 1.70 కోట్ల నుంచి 2.33 కోట్లకు చేరింది. వీరి ఆదాయం కూడా 19 శాతం పుంజుకుని రూ.5.76 లక్షల నుంచి రూ.6.84 లక్షలను తాకిందని సీబీడీటీ పేర్కొన్నది.

పన్ను పరిధిలో ఉద్యోగేతరులు 1.95 కోట్ల నుంచి 2.33 కోట్లకు పెరిగారని, వీరి ఆదాయం రూ.4.11 లక్షల నుంచి రూ.5.23 లక్షలకు చేరిందన్నది. ఇక కార్పొరేట్ ట్యాక్స్‌పేయర్ల పన్ను చెల్లింపులు సగటున 2014-15లో రూ.32.28 లక్షలుగా, 2017-18లో రూ.49.95 లక్షలుగా ఉన్నాయి.

దేశంలో నికర ప్రత్యక్ష పన్నులు వసూళ్లు 15.7 శాతం పెరిగాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా (అక్టోబర్ మూడో వారం ముగింపు నాటికి) రూ.4.89 లక్షల కోట్లకు చేరాయని సీబీడీటి వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.11.5 లక్షల కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 42 శాతానికిపైగా సాధించామని తెలిపింది. గత వారం వరకు దాదాపు 2 కోట్ల రిఫండ్స్‌ను ఐటీ శాఖ జారీ చేసిందని, దీని విలువ సుమారు రూ.1.09 లక్షల కోట్లుగా ఉంటుందని సీబీడీటీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

భారతీయులు విదేశాల్లో పోగేసిన అక్రమ సంపదపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఓ భారీ ఆపరేషన్‌కు తెర తీసింది. దీంతో వేలాది మంది ఇప్పుడు ఐటీ పరిశీలనలో ఉన్నారు. కాగా, నేరస్తులపై కఠిన చర్యల్ని తీసుకునేందుకు కొత్త నల్లధన నిరోధక చట్టాన్నీ వినియోగించుకునే దిశగా కూడా ఐటీ శాఖ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేసుల విచారణలో భాగంగా ఆయా దేశాల్లోని ఐటీ శాఖల సహకారంతో ముందుకెళ్తున్న అధికారులు.. అక్కడి భారతీయుల బ్యాంక్ ఖాతాలు, కొనుగోలు చేసిన ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర కూడా ధ్రువీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios