గత రెండు దశాబ్దాలుగా రిటైల్ మార్కెట్లో సంచలనంగా మారిన బిగ్ బజార్ బ్రాండ్ ఇకపై కనుమరుగు కానుంది. ఫ్యూచర్ గ్రూపు నుంచి స్టోర్లను టేకోవర్ చేసుకున్న రిలయన్స్ రిటైల్ విభాగం, బిగ్ బజార్ పేరును మార్చేందుకు సిద్ధం అవుతోంది. 

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) గత వారం బిగ్ బజార్‌ను తన ఆధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. ఫ్యూచర్ గ్రూపునకు (Future Group) చెందిన ఈ అతిపెద్ద బ్రాండ్ పేరును కూడా మార్చడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి.

బిగ్ బజార్ పేరు మారనుంది
రిలయన్స్ రిటైల్ (Reliance Retail) గతంలో బిగ్ బజార్ ఉన్న అన్ని ప్రదేశాలలో ఇప్పుడు కొత్త రిటైల్ స్టోర్లను తెరవబోతోంది. ఈ కొత్త స్టోర్ పేరు స్మార్ట్ బజార్ (Smart Bazaar) అని పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ రంగ సంస్థగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది ఇప్పటికే రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ డిజిటల్ వంటి రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది.

స్మార్ట్ బజార్ (Smart Bazaar) 950 లొకేషన్లలో తెరిచే చాన్స్..
రిలయన్స్ రిటైల్ 950 లొకేషన్లలో సొంత స్టోర్లను తెరవాలని ప్లాన్ చేస్తోంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ గ్రూప్ (Future Group) నుంచి కంపెనీ స్వాధీనం చేసుకున్న స్టోర్లే కావడం విశేషం. అంతేకాదు కంపెనీ కొత్తగా ఈ నెలలో 'స్మార్ట్ బజార్' (Smart Bazaar)పేరుతో దాదాపు 100 స్థానాల్లో స్టోర్లను తెరవనుంది. అయితే ఈ విషయమై ఇంకా రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్ పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

బిగ్ బజార్ టేకోవర్ ఇలా జరిగింది
ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య రూ.24,713 కోట్ల డీల్ కుదిరి ఏడాది దాటిపోయింది. కానీ అమెజాన్ న్యాయప్రక్రియ ద్వారా అడ్డుకోవడంతో డీల్ పూర్తి కాలేదు. గత వారం నుండి, టేకోవర్ పై రిలయన్స్ దూకుడు పెంచింది. టేకోవర్ లో భాగంగా ఫ్యూచర్ గ్రూప్ కు చెందిన బిగ్ బజార్ స్టోర్లను స్వాధీనం చేసుకుంది. రిలయన్స్ మొదట్లో బిగ్ బజార్ స్టోర్‌లను అదే పేరుతో నడిపేందుకు ఫ్యూచర్ గ్రూపుకే లీజుకు ఇచ్చేందుకు అనుమతించింది. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూపు నుంచి నేరుగా రిలయన్స్ రిటైల్ ద్వారా బిగ్ బజార్ స్టోర్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.