రూపాయి మారకం విలువ పతనానికి అంతర్జాతీయ పరిస్థితులేనని మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొదలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరూ నొక్కి చెప్పినా.. త్వరలో రూపాయి మారకం ‘సెగ’ ప్రభావం భగ్గుమనడం ఖాయంగా కనిపిస్తోంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణతకు తోడు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, వాషింగ్‌ మెషీన్ల ధరలను సంస్థలు పెంచేస్తున్నాయి. 

దేశీయంగా బిగిస్తున్నా సెల్‌ఫోన్ల విడిభాగాలన్నీ దిగుమతి చేసుకోవడంతో మొబైల్ ఫోన్ల సంస్థలు ధరలనూ పెంచేశాయి. ఈ భారం ప్రతి కుటుంబంపైనా పడుతోంది. రూపాయి మారకపు విలువ క్షీణతతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే, లోహాలకు డాలర్ల రూపంలో సుంకాలు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. 

ముడిచమురు నుంచి ఉత్పత్తి చేసే ముడిపదార్థాలను మన్నికైన వినిమయ ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. అందువల్ల ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం వీటిపై పడుతోంది. ఉక్కు, రాగి ధరల పెరుగదలతో, ఈ భారాన్నీ కొనుగోలుదార్లకు బదలాయిస్తున్నారు. ఇక రూపాయి ప్రభావమైతే చెప్పనవసరం లేదు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అమెరికా డాలర్‌పై రూపాయి మారకపు విలువ రూ.65 అయితే, ఇప్పుడు రూ.71.75కి చేరింది. రూపాయి విలువ ఇంతగా క్షీణించడం ఇదే తొలిసారి. రూపాయి విలువల్లో మార్పొచ్చినప్పుడల్లా కంపెనీలు ధరలు పెంచలేవు.

కొద్దికాలం ఎదురు చూస్తాయి. కానీ ఏ రోజు కారోజు రూపాయి మారకపు విలువ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుతుండటంతో, ధరలు పెంచేందుకే కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పాత ధరతో తయారైన ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యే వరకు కూడా వేచి చూసే పరిస్థితులు ఉన్నాయి.

ఉక్కు ధర 7-8 శాతం వరకు పెరగ్గా, రాగి కండెన్సర్‌ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నందున దిగుమతి సుంకం భారం డాలర్ల రూపేణా భారం పడుతోంది. ఫోమింగ్‌ ఏజెంట్‌ వంటి రసాయనాల ధరలు కొంత తగ్గడం కంపెనీలకు ఊరట కలిగించే అంశం.

వేసవి తరవాత, పండగల సీజన్‌ వరకు ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఈ సమయంలో ధరల పెంపు వల్ల కొనుగోళ్లు మరింత మందగిస్తాయని భావిస్తున్నారు.

ముడి పదార్థాల ధరలకు తోడు రూపాయి విలువ క్షీణతతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు అంటున్నాయి. టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలన్నీ పెంచామని, ఎల్‌జీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 5-7 శాతం ధరలు పెరిగాయని, సగటున 3.5 శాతం పెరుగుదల నమోదైందని తెలిపారు. 

డాలర్‌ విలువను రూ.65గా పరిగణించి, ఉత్పత్తుల ధరలను కంపెనీలు నిర్ణయించాయని, ఇప్పుడు 11 శాతం పైగా పెరిగి, రూ.72 సమీపానికి చేరుతుండటంతో, కొంత భారాన్నైనా బదలాయించక తప్పదని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. 5 నెలల పాటు వేచి చూసినా, పరిస్థితి మారకపోగా, రూపాయి విలువ మరింత క్షీణిస్తోందని గుర్తు చేశారు.

పాత ధరల్లో సమీకరించిన విడిభాగాలన్నీ అయిపోయాక, కొత్త ధరల్లో కంపెనీలూ కొనాల్సిందే. డాలర్‌ విలువ ప్రకారం, ఈ భారం పడుతుంది. అందువల్ల తయారీ సంస్థలన్నీ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయని చెప్పారు. శామ్‌సంగ్‌ కూడా 4-5 శాతం మేర ధరలు పెంచిందని, గోద్రేజ్‌, వర్ల్‌పూల్‌ వంటి సంస్థలు కూడా 2-3 శాతం వరకు పెంచాయని డీలర్లు చెప్పారు. తక్కువ ధర కల ఉత్పత్తులపై రూ.1000 వరకు, ఏసీలపై అధికంగా  రూ.2,500 వరకు పెంచినట్లు చెప్పారు.

సెల్‌ఫోన్ల ధరలు ఇప్పటివరకు పెంచినట్లు ఏ కంపెనీ కూడా ప్రకటనలు ఇవ్వక పోవడానికి కారణం వేసవి తర్వాత అమ్మకాలు తక్కువగా ఉండటమే. డాలర్‌ విలువ రూ.65గా ఉన్నప్పుడు, కొనుగోలు చేసిన విడిభాగాలతో తయారు చేసిన ఫీచర్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు అధికంగా నిల్వలు ఉన్నందున, ధరలు పెంచేందుకు సంస్థలు సాహసించలేదు.

మార్కెట్‌లో తీవ్రమైన పోటీ ఉండటమూ ఒక కారణమే. సాధారణంగా సెల్‌ఫోన్‌పై 10-15 శాతం వరకు మార్జిన్లు ఉంటాయి. డాలర్‌ విలువ బాగా పెరిగి, ఈ మార్జిన్‌ కుంచించుకున్నా, పాత ఉత్పత్తులపై ధరలు పెంచకుండా కంపెనీలు మిన్నకుండిపోయాయి. 

అదీకాక నెలారంభంలో ధరలు పెంచితే, డీలర్లకు ‘సవరించిన ధరల పట్టిక’లను కంపెనీలు పంపుతుంటాయి. అదే నెలలో ద్వితీయార్థంలో మార్పు చేస్తే, వాటికి సంక్షిప్త సందేశాలతో సరిపెడుతుంటాయి. ఇందువల్ల ధరలు పెరిగాయనే వార్తలు వ్యాప్తిలోకి రావు. అందువల్లే ఈ నెల ద్వితీయార్థంలో ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు ఒక సెల్‌ఫోన్‌ కంపెనీ యజమాని చెప్పారు. ప్రస్తుత డాలర్‌ విలువ కనుగుణంగా 5-6 శాతం వరకు అన్ని కంపెనీలు ధరలు పెంచక తప్పదన్నారు.

స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ప్రతి 3-6 నెలలకు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే విక్రయిస్తున్న మోడళ్లన్నీ, గతంలో డాలర్‌ విలువ తక్కువగా ఉన్నప్పుడు దిగుమతి చేసుకున్నవే. కొత్తగా విడుదల చేయనున్న మోడళ్ల ధరలోనే, డాలర్‌ భారం కలిసి ఉంటుందని మరో సెల్‌ఫోన్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ కొత్త మోడళ్లన్నీ కొత్త ధరలతోనే రానున్నాయని చెప్పారు.