న్యూఢిల్లీ: నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్న దేశీయ నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఉద్దీపనలతో ఊపిరిలూదింది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని తొలగించేందుకు రంగాలవారీగా సంస్కరిస్తున్న మోదీ సర్కార్ తాజాగా రియల్ ఎస్టేట్‌ రంగానికి చేయూతనందించింది. 

ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రం ముందుకు వచ్చింది. రూ.25 వేల కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్‌)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది.

also read ఐదవ రోజు....పడిపోయిన పెట్రోల్ ధరలు


మొండి బకాయిలు (ఎన్‌పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాకు తెలిపారు. 

రూ.25,000 కోట్ల ఏఐఎఫ్‌ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ అందిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్‌ రంగాల్లో డిమాండ్‌ పున రుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు.

వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్‌ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక మొండి బాకీలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్‌సీఎల్‌టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. పూర్తికాని ప్రాజెక్టులకు రుణాలు అందేలా ఓ స్పెషల్ విండోను మాత్రమే నాడు నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్టర్లు.. ప్రాజెక్టులను పూర్తి చేయలేని పరిస్థితిలో పడిపోయిన సంగతి విదితమే.తాజాగా వీటికి కూడా ఏఐఎఫ్‌ ద్వారా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్టు సీతారామన్‌ తెలిపారు.

ఏఐఎఫ్ నిధిని ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్లు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. నిర్మాణాల కోసం దశలవారీగా నిధులు విడుదలవుతాయన్నారు. సావరిన్, పెన్షన్ ఫండ్లు కూడా ఈ ఏఐఎఫ్‌లో పాల్గొంటే నిధి పరిమాణం పెరుగుతుందని చెప్పారు.

also read మైక్రోసాఫ్ట్, నోకియా మరోసారి చేతులు కలపనున్నాయి...

కాకపోతే రెరా రిజిస్ట్రేషన్‌ ఉండి, సానుకూల నికర విలువ ఉన్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్‌ ఫండ్స్‌ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు.

కేంద్రం తాజా నిర్ణయాన్నిరియల్ ఎస్టేట్ పరిశ్రమ స్వాగతించింది. ఇళ్ళ కొనుగోలుదారులకు గల దీర్ఘకాల సమస్యలకు ఇది పరిష్కారం చూపగలదన్న ఆశాభావాన్ని క్రెడాయ్ చైర్మన్ జక్సేషా వ్యక్తం చేశారు. ‘గతంలో ప్రకటించిన ప్యాకేజీని విస్తరించి, ఎన్‌పీఏలకూ వర్తింపజేయడం చాలా బాగుంది.

దీనివల్ల నిర్మాణ రంగంలో మందగమనం ఛాయలు తొలగిపోతాయి’ అని అన్నారు. ఇటు నిర్మాణ రంగ సంస్థలకు, అటు గృహ కొనుగోలుదారులకు కేంద్రం గొప్ప ఊరటనిచ్చిందని ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి ఆనందం వ్యక్తం చేశారు.