గత వృద్ధి రేట్ల సవరణ, నోట్ల రద్దు నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంపై కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ సందేహాలు వ్యక్తం చేశారు. డీమానిటైజేషన్‌ను క్రూరమైన చర్యగా ఆయన అభివర్ణించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.

గత ఆర్థిక సంవత్సరాల్లో దేశ జీడీపీ వృద్ధిరేట్లను సవరించడం తప్పని సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. మార్చిన అంకెలపై నిపుణులతో పునఃపరిశీలన ద్వారా గందరగోళానికి తెరదించాలని సూచించారు. జీడీపీ లెక్కగట్టేందుకు అవసరమైన సమాచారం సేకరించడం కూడా తెలియని సంస్థలు వీటిల్లో తలదూర్చకూడదని నీతి ఆయోగ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘ఒక ఆర్థిక వేత్తగా కొత్త జీడీపీ గణాంకాలపై నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం వివరణ అవసరం. అక్కడ సందేహాలను తొలగించి విశ్వాసం నెలకొల్పాలి. మన దగ్గర నిపుణులు ఉన్నారు.

దీనిపై పరిశీలన నిర్వహించి సందేహాలకు సమాధానాలు ఇవ్వాలి. ఇది పూర్తిగా సాంకేతిక అంశాలతో కూడుకున్న పని. దీనిని నిపుణులు మాత్రమే చేయాలి. నిపుణులు లేని సంస్థలు దీనికి దూరంగా ఉండాలి’ అని అరవింద్ సుబ్రమణ్యం ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

జీడీపీ నూతన గణన విధానం కారణంగా నోట్ల రద్దు నిర్ణయం తక్కువ ప్రభావం చూపినట్లు కనిపిస్తోందని కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. ‘పెద్దనోట్ల రద్దుకు 18నెలల ముందు 8శాతం వృద్ధి రేటు నమోదైంది.

నోట్లు రద్దు చేసిన 21నెలల తర్వాత 6.8శాతం వృద్ధి రేటు నమోదైంది’ అని అరవింద్ ఆఫ్ కౌన్సెల్: ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోదీ-జైట్లీ ఎకానమీ అనే పేరుతో తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ‘మనం జీడీపీని సరిగ్గా గణించకపోవడం వల్లగానీ, లేక మన ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా కోలుకొనైనా ఉండాలి’ అని సందేహం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం , ఆర్‌బీఐ మధ్య సహకారం, సమన్వయం కూడా ఉండాలని తెలిపారు. 

‘నోట్ల రద్దుతో నగదులో 86 శాతం తగ్గిపోవడాన్ని మీరెలా అభివర్ణిస్తారు? తీవ్రమైన అనేదానికి శబ్దార్థంలో క్రూరం అనే పదాన్ని వినియోగిస్తాం. సాహోసపేతమైనది, తీవ్రమైనదన్న అర్థంలో నేను ఉపయోగించాను.

ఒకవేళ మీరు 86 శాతం నగదును ఉపసంహరించుకుంటే దాన్ని సౌమ్యమని సున్నితమైనదని అంటారా? అక్కడ ముఖమైనదీ మీరంతా గుర్తించనిది ఏమిటంటే, ఈ విషయంలో ఓపెద్ద పజిల్ దాగి ఉందని.

ప్రజలు అనుకుంటున్నదానికి నేను భిన్నంగా చెప్పాలనుకున్నాను. యాక్షన్, తీవ్రమైనది, అత్యంత తీవ్రం, క్రూరం ఏదైనా పదం వాడండి కానీ పజిల్ ఏమిటంటే జీడీపీ మీద ప్రభావం లేదు’ అని అరవింద్ సుబ్రమణ్యం స్పష్టం చేశారు. 

‘ఆర్థిక విధానంగా, నిర్ణయం తీసుకోవడం రాజకీయాల గురించి నేను డీమానిటైజేషన్‌పై మరిన్ని ముఖ్యమైన ప్రశ్నలను అడగాలనుకుంటున్నాను. డీమానిటైజేషన్ గురించి ఏమి నేర్చుకోవాలి? నా వరకు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక దృగ్విషయంలో భాగమే.

తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఓటేస్తారు? అమెరికాలో తెల్లజాతి పురుష ఓటర్లు ట్రంప్‌కు, రిపబ్లికన్లకు ఎందుకు ఓటేశారు? అసంఘటిత రంగంపై అనేక కష్టాలను రుద్దాం. ఒకవేళ అదే క్రూరమైనదైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అదే ప్రజలు ఎలా గెలిపించారు?’ అని ప్రశ్నించారు.

‘ఒకవేళ ప్రభావం కొంత మీద కన్నా అందరి మీద సమానమైతే నిర్ణయం తీసుకోవడం తేలిక. కొన్ని ధనిక రైతులు వంటి కొన్ని స్వార్థ శక్తుల మీద కన్నా విస్తృత స్థాయిలో ప్రజలందరి మీదా నిర్ణయం కఠిన నిర్ణయాలు అమలుచేయడం తేలిక.

కనుక అదే పజిల్, ఆర్థిక పజిల్ ఏమిటంటే నగదు ఎలా పనిచేస్తుందనేది మనకు తెలియదు. జీడీపీని మనం పూర్తిగా తప్పుగా లెక్కిస్తున్నామా? మనకు తెలియని పద్దతుల్లో దేశీయ ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉందా? అందుకే ఈ ప్రశ్నలను మనం అర్థం చేసుకోవాల్సి ఉంది’ అని అరవింద్ సుబ్రమణ్యం అన్నారు. 

నోట్ల రద్దేమీ ముద్దు కాదని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చెప్పారు. ఇతర దేశాల్లో నోట్ల రద్దు అనే అంశం సందర్బానుచితం అని, ఇది దేశాలు తమకు తాముగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

‘నిర్వచనం ప్రకారం లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. సో, అక్కడ అసమ్మతి, సృజనాత్మక ఉద్రిక్తత ఉండాల్సి దే. కానీ, అన్నింటి కన్నా విశ్వాసం, స్వతంత్రత, కమ్యూనికేషన్‌ల నేపథ్యాలకు వ్యతిరేకంగా ఉండాలి.

నేను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాణ్ణి. చర్చను కొనసాగించేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చేది. నేనలా చేసినందుకు సంతోషంగా ఉండేది’ అని చెప్పారు. 

‘కానీ, నాకున్న ప్రాథమిక అవగాహన కారణంగా నేనలా చేయగలిగాను. మీరు గౌరవిస్తున్నవారి అభిప్రాయాలను వ్యతిరేకించవచ్చు. విస్తృత స్థాయిలో చూస్తే రిజర్వ్‌బ్యాంక్ బాగానే పనిచేసింది. కానీ గత ఏడెనిమిదేండ్లలో ఆర్థికవ్యవస్థ పర్యవేక్షణ కాస్త ఆందోళన కలిగిస్తున్నది.

అప్పుడు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం తలెత్తుంది. అకస్మాత్తుగా రూ. 90 వేల కోట్ల ఉత్పాతం మీద పడుతుంది. అదెలా జరిగిందో ఎవరికీ తెలియదు. డ్రాయింగ్ బోర్డు దగ్గరకు వెళ్లి అందుకు సంబంధించి కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అనేక అంశాలపై మనం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాం. వాటితో మనం ముందుకు కదులుతాం’ అని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తెలిపారు.

‘మనం సంస్కరణల గురించి ముఖ్యంగా బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పీసీఏ నిబంధనల అమలు పరిష్కారం కనుక్కోవడానికి ఓ చక్కని మార్గం. అదొరకంగా వైవీ రెడ్డీ ైస్టెల్ పరిష్కారం. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ అసెట్ క్వాలిటా మీద దృష్టిని సారించాలి.

నేను ఆర్థికవ్యవస్థ పర్యవేక్షణపై రిజర్వ్‌బ్యాంక్‌ను విమర్శించాను. ఆర్బీఐ ఎన్‌బీఎఫ్‌సీల అసెట్ క్వాలిటీని పర్యవేక్షిస్తే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. 2012-13 నుంచి మనందరికీ మొండి బాకీల సమస్యేమిటో తెలుసు. అది ప్రజలంతా అనుకుంటున్నదానికన్నా పెద్ద సమస్య.

ఈ సమస్య పరిష్కారానికి ఆర్బీఐ ముందు నుంచి ఎందుకు ప్రయత్నించలేదన్నదే నా ప్రశ్న. పీసీఏ నిబంధనలను ప్రభుత్వం కొనసాగనివ్వాలి. పబ్లిక్ అసెట్ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ) ఏర్పాటు గురించి, బ్యాంక్ నేషనలైజేషన్ చట్టం, విద్యుత్ రంగాల గురించి సీరియస్‌గా ఆలోచించాలి’ కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.

ఆర్బీఐ ప్రభుత్వరంగ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం నిధులను పక్కన పెట్టాలని అందుకు సంస్కరణ చేపట్టాలన్న నిబంధన విధించాలని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తెలిపారు. లేదంటే నిధులన్నీ మాయం అవుతాయని కొన్నేళ్లుగా నేను అదనపు రిజర్వుల గురించి ప్రస్తావిస్తున్నానని తెలిపారు.

‘ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 4-4.5 లక్షల కోట్లు నిధులు చాలు. జనరల్ ఫైనాన్సింగ్‌కు, లోటు పూడ్చడానికి ఆ నిధులను ఉపయోగించరాదు. ఆర్బీఐ బోర్డును రాజకీయం చేయరాదు.

అలా చేస్తే ఆర్బీఐ ప్రాథమిక స్వయం ప్రత్తిపత్తికి విఘాతం కలిగినట్టే. స్వయం ప్రతిపత్తి అంటే చర్చలు లేకపోవడం, సహకరించకపోవడం, సమాచారాన్ని అందించకపోవడం కాదు’ అని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం వివరించారు. 

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌కు మొదట ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని, తాను చేసిన బెస్ట్ జాబ్ అది అని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చెప్పారు.

‘టీమ్‌లను నిర్మించండి. ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరితో సంబంధాలను నెలకొల్పండి. సొంతంగా ఆలోచించండి. ఆర్థిక మంత్రి అలాంటి స్వతంత్ర ఆలోచనలను కోరుకుంటున్నారు. విశ్లేషణల నాణ్యత విషయం రాజీ పడరాదు.

ఆర్థిక మంత్రితో మంచి సంబంధాలను కలిగి వుండండి. వ్యవసాయ రంగం పెద్ద సవాలు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ విశ్లేషణ అత్యున్నత ప్రమాణాలను పాటించండి. కరెంట్ ఖాతా, చమురు ఈ విషయాలపై దృష్టిపెట్టండి’ అని కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు పేలవం : ఉదయ్ కొటక్
-వివాదాస్పదమైన పెద్ద నోట్ల రద్దు పేలవంగా సాగిందని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ పేలవంగా అమలైందని, రూ.2 వేల నోటును మళ్లీ రద్దు చేయకూడదని కేంద్రానికి సూచించారు.

పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ చిన్న స్థాయి పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం మంచిదైనా ఇది సత్ఫలితాలను ఇవ్వడం లేదన్నారు.

అత్యధిక వినిమయంలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా నగదు కొరత తీవ్రంగా నెలకొన్నదని, దీంతో సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వరకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు.

అయినా, ఆర్థిక రంగానికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూర్చిందని చెప్పారు. దీంతో బ్యాంకింగ్ రంగంలో పొదుపు అమాంతం పెరిగిపోయిందన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రద్దుచేసిన వాటిలో 99.3 శాతం నిధులు మళ్లీ బ్యాంకుల వద్ద జమయ్యాయి.