Asianet News TeluguAsianet News Telugu

మొండి బాకీలపై బెయిలౌట్ బ్యాంకర్ల బాధ్యత కాదు: ఆర్బీఐ

పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం రుణాలు తీసుకుని, వాటిని మొండి బాకీలుగా మార్చిన కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు బ్యాంకులు ఉద్దీపన (బెయిలవుట్) ఎందుకు ప్రకటించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. 

Not job of banks to bail out borrowers: RBI deputy governor
Author
New Delhi, First Published Nov 4, 2018, 1:40 PM IST


న్యూఢిల్లీ: పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం రుణాలు తీసుకుని, వాటిని మొండి బాకీలుగా మార్చిన కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులకు బ్యాంకులు ఉద్దీపన (బెయిలవుట్) ఎందుకు ప్రకటించాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ ప్రశ్నించారు. బ్యాంకర్లు తమ వద్ద నగదు డిపాజిట్ చేసిన మదుపర్లకు జవాబుదారీగా ఉండాలన్నారు. గతవారం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య చేసిన వ్యాఖ్యతో కేంద్రానికి, ఆర్బీఐకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని బయటపడింది. దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇష్టారాజ్యంగా ఎందుకు రుణాలిచ్చారని ఆక్షేపించారు.

కానీ తమ స్వయంప్రతిపత్తిని కాల రాస్తున్నారన్న ఆర్బీఐ ఆందోళనను పట్టించుకోలేదు. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధి దిశలో పయనిస్తోందంటూ ఆర్బీఐ, బ్యాంకర్లకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ గార్గ్ ఎదురు దాడికి దిగారు. కానీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 అమలుకు కేంద్రం సిద్ధ పడటం.. దాని స్వయంప్రతిపత్తిని హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆర్బీఐ వర్గాలు తీవ్ర అసంత్రుప్తికి గురి కావడంతో విభేదాలు మరింత పెరిగాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు.  

ఇప్పటికే కేంద్ర బ్యాంక్‌ల స్వయంప్రతిపత్తిలో ప్రభుత్వ జోక్యాన్ని ఆక్షేపిస్తూ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య సర్కారుకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసి కొద్ది రోజులు కూడా గడవక ముందే.. మరో డిప్యూటీ గవర్నర్‌ ఎన్‌.ఎస్‌.విశ్వనాథన్‌ ఈ దిశగా తన గొంతు విప్పారు. బాసిల్‌-3 నిబంధనల ప్రకారం బ్యాంకుల 'మూలధన సంపద నిష్పత్తిని' (సీఏఆర్‌) ప్రస్తుతం అమలులో ఉన్న 9% నుంచి 8 శాతానికి తగ్గించాలని కొన్ని రోజులుగా ఆర్‌బీఐపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తేస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల.. ఆర్‌బీఐ వద్ద నిల్వ ఉన్న సొమ్ము వ్యవస్థలోకి వస్తుందని సర్కారు సాకుగా చెబుతోంది. అయితే ఆర్‌బీఐ దీనికి ససేమీరా అంటోంది. 

భారత్‌లో బ్యాంకులు అంతర్జాతీయ బ్యాంకుల మాదిరిగా అనూహ్యంగా ఎదురయ్యే ప్రతికూల పరిస్థితలను ఎదుర్కొని నిలబడేలా తగి ప్రొవిజన్స్‌ను (కేటాయింపులను) కలిగి లేవని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విశ్వనాథన్‌ అన్నారు. అనుకోని రుణ ఎగవేతలు, అనూహ్య మొండి బాకీల పెరుగుదలను బ్యాంకులు తట్టుకొనేందుకు గాను సీఏఆర్‌ను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలని తాము నిర్ణయించామని ఆయన తెలిపారు. ఎక్కువ మొత్తంలో సీఏఆర్‌ ఉండడం వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాలను బ్యాంకులు సమర్థంగా ఎదుర్కొనే వీలుంటుందని అన్నారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, జెషండ్‌పూర్‌లో చేసిన స్నాతకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తీవ్రంగా నిధుల కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో విశ్వనాథన్‌ చేసిన ప్రకటన ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వంటిదేనని ఆర్థిక వేత్తలు అంటున్నారు. 

బ్యాంకుల నుంచి రుణాలను తీసుకొని వివిధ కారణాలతో సకాలంలో చెల్లించని వారందరూ ఎగవేతదారులేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విశ్వనాథన్‌ అన్నారు. కారణాలు ఏమైనా రుణాలు చెల్లించలేని వారి పట్ల సానుకూల ధోరణిని ప్రదర్శిస్తూ మరింత సాయం చేయడమనేది సబబు కాదని స్పష్టం చేశారు. రుణాలను ఎగేసిన వారికి డబ్బులిస్తూ కూర్చోవడానికి బ్యాంకులేమి స్వతహాగా గుట్టలు గుట్టలుగా నిధులు కలిగిన కుబేర సంస్థలేమీ కాదన్నారు. ప్రజల డిపాజిట్ల నుంచి వచ్చిన సొమ్మును బ్యాంకులు రుణాలుగా ఇస్తుంటాయన్నారు. మళ్లీ ప్రజలకు తమ డబ్బు అవసరమైనప్పుడు విత్త సంస్థలు తిరిగి ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రుణాలను ఎగ్గొడుతూ వస్తున్న వారి కష్టాలను పంచుకుంటూ ముందుకు సాగేంత ఆర్థిక స్తోమత బ్యాంకులకు ఉండదని ఆయన వివరణనిచ్చారు.

దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను బలోపేతానికి ఆర్‌బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదల చేసిన 'మొండి బాకీల గుర్తింపు సర్క్యులర్‌' దేశంలోని 'దివాళా చట్టానికి' ప్రకరణం వంటిదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్‌ అన్నారు. ఆర్‌బీఐ సంస్కరణలలో ఇది ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. 

బ్యాంకుల బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయని భ్రమలో ఉండే కంటే లోపాలను గుర్తించి వాటికి తగ్గ కేటాయింపులతో ముందుకు సాగితేనే దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్‌ పరోక్షంగా ప్రభుత్వానికి చురకలంటించారు. ఆర్‌బీఐ అమలులోకి తెచ్చిన మొండి బాకీల గుర్తింపు సర్క్యులర్‌ను సవరించాలని గత కొద్ది రోజులుగా ఆర్‌బీఐని  కేంద్ర ప్రభుత్వం కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సెంట్రల్ బ్యాంక్‌ ససేమిరా అంటోంది. బ్యాంకుల బలోపేతానికి ఇది చాలా అవసరం అన్నది ఆర్‌బీఐ మాట.
 

Follow Us:
Download App:
  • android
  • ios