Asianet News TeluguAsianet News Telugu

ఇతేహాద్ ఉందిగా: జెట్ ఎయిర్వేస్ కైవసంపై ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌


ఎతిహాద్ ఎయిర్ లైన్స్ ఉండగా, జెట్ ఎయిర్వేస్ సంస్థలో తాము వాటా కొనుగోలు చేయబోమని ఖతార్ ఎయిర్ లైన్స్ సీఈఓ అక్బర్ అల్ బకర్ పేర్కొన్నారు. ఒకవేళ ఎతిహాద్ ఎయిర్ లైన్స్ లేకుంటే జెట్ ఎయిర్వేస్ ప్రతిపాదనను పరిశీలించే వారమన్నారు.

Not interested in Jet Airways as backed by enemy state: Akbar al-Baker, CEO, Qatar Airways
Author
Mumbai, First Published Jan 16, 2019, 11:43 AM IST

ముంబై: రుణ, నగదు లభ్యత సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటాను కొనుగోలు చేసే ఆసక్తి ఎంతమాత్రం లేదని ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సీఈవో అక్బర్‌ అల్‌ బకర్‌ స్పష్టం చేశారు. జెట్‌ ఎయిర్వేస్ సంస్థలో వాటా కొనుగోలు చేసేందుకు ఖతార్ ఎయిర్ లైన్స్ ఆసక్తిగా ఉన్నదన్న వార్తలపై  మంగళవారం ముంబైలో జరిగిన ఏవియేషన్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన స్పందించారు. ‘మా శత్రు దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ వాటా ఉన్న సంస్థను మేమెలా కొనుగోలు చేస్తాం’అని ఖతార్ ఎయిర్ లైన్స్ సీఈవో అక్బర్‌ ప్రశ్నించారు.

ఎతిహాద్ లేకుంటే పరిశీలించేవారం.. ఇండిగోలో వాటా కొనుగోలు యత్నం
‘జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్‌కు 24 శాతం వాటా కనుక లేకున్నట్లైతే..  ఈ విషయాన్ని పరిశీలించే వాళ్లం. కానీ మా శత్రువు భాగస్వామ్యం ఉన్న సంస్థను మేం ఎలా తీసుకుంటాం? అని  ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ సీఈవో అక్బర్‌ అల్‌ బకర్‌ అన్నారు. ఇండిగోలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించామన్నారు. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు చెందింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ వారితో సంబంధాలు పెట్టుకుందని ఆరోపిస్తూ ఖతార్‌తో 2017లో యూఏఈ సంబంధాలు తెంచుకుంది. 

ఖతార్‌తో ఇలా అరబ్ దేశాలు ‘బంధం’ కట్
యూఏఈతో పాటు సౌదీ అరేబియా, ఈజిప్టు, బహ్రెయిన్‌ కూడా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు తమ దేశం రాకుండా గతేడాది జూన్‌లో నిషేధం విధించాయి. అప్పటి నుంచి ఖతార్‌కు, యూఏఈకి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌లో తన శత్రు దేశమైన యూఏఈకి చెందిన కంపెనీ వాటా ఉంటే తాము అసలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ స్పష్టం చేసింది.

జెట్ ఎయిర్వేస్‌లో వాటా పెంచుకునేందుకు ఎతిహాద్ ఓకే
జెట్‌ ఎయిర్‌వేస్‌లో 24శాతం వాటా కలిగిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ తన వాటాను 49శాతానికి పెంచుకునేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ మెజార్టీ నియంత్రణ వాటా వదులుకునేందుకు సిద్ధపడటంతో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకొస్తున్నాయని సమాచారం. గోయల్‌ వాటా ప్రస్తుతం 51శాతం ఉండగా.. ఒకవేళ ఎతిహాద్‌కు ఇచ్చినట్లయితే 20శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది.

కారణం చెప్పకుండా టికెట్ల రద్దుపై ‘గోఎయిర్‌’కు జరిమానా!
కారణం చెప్పకుండా టికెట్లు రద్దు చేసిన ప్రముఖ ఎయిర్‌వేస్ సంస్థ‌ గోఎయిర్‌కు వినియోగదారుల ఫోరమ్ జరిమానా విధించింది. ముంబై వాసి జయేశ్ పాండ్యాకు రూ.98 వేలు చెల్లించాలని ఆదేశించింది. 2014 మేలో పాండ్యా గోఎయిర్‌ సంస్థ విమానంలో 2015 ఫిబ్రవరి 17న తన బంధువులతో కలిసి ముంబైకి రావడానికి దాదాపు రూ.50 వేలు చెల్లించి టికెట్లు బుక్‌ చేసుకున్నాడు. తర్వాత విమానం రద్దయిందని సంస్థ అతడికి సమాచారమిచ్చింది. తిరిగి డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో పాండ్యా 2016లో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

పొంతనలేని సమాధానంతో గో ఎయిర్ కాలయాపన
డీజీసీఏ వింటర్‌ షెడ్యూల్‌ ప్రకారం 2014 సెప్టెంబర్ 6న విమానం టైమింగ్స్‌ మారాయని గోఎయిర్‌ సంస్థ ఫోరంకు పొంతనలేని సమాధానం ఇచ్చింది. దీంతో డీజీసీఏ నుంచి ఆర్టీఐకు వచ్చిన సమాధానం, గోఎయిర్‌ జవాబు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఫోరం‌.. గోఎయిర్‌ తప్పుడు సమాధానం చెప్పిందని తేల్చింది. వినియోగదారుడికి ఇబ్బంది కల్గించిన నేపథ్యంలో గోఎయిర్‌ టికెట్ల మొత్తం రూ.50 వేలు, మరో ఎయిర్‌లైన్స్‌కు పాండ్యా చెల్లించిన రూ.38,816 వేలతోపాటు కారణం చెప్పకుండా టికెట్లు రద్దు చేసినందుకు జరిమానాగా రూ.10 వేలు చెల్లించాలని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios