సుబ్రతా ‘సహరా’ ఆంబీ వ్యాలీ వేలానికి నో రెస్సాన్స్!!

No Takers for Sahara's Aamby Valley Properties: Official Liquidator Tells SC
Highlights

చట్టవిరుద్ధంగా రూ.24 వేల కోట్ల మేరకు చిన్న మదుపర్ల నుంచి నిధులు సేకరించి కష్టాలు కొని తెచ్చుకున్న ‘సహారా’ గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ ఇప్పట్లో సమస్యల నుంచి బయటపడేలా కనిపించడం లేదు. మహారాష్ట్రలోని ఆయన ఆంబీ వ్యాలీ ఆస్తుల వేలానికి స్పందనే లేదు మరి.

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార వేత్త సుబ్రతారాయ్‌ ఆధ్వర్యంలోని సహారా సంస్థకు చెందిన మహారాష్ట్రలోని ఆంబీ వ్యాలీ ఆస్తుల వేలం నోటీసులకి ఎలాంటి స్పందన రాలేదని అధికారిక లిక్విడేటర్‌ సుప్రీంకోర్టుకు తెలిపింది. వాటిని కొనడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నది. అయితే వసాయ్‌ ప్రాంతంలోని తమ ఆస్తులను రూ.1000 కోట్లకు కొనేందుకు రెండు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని సహారా సుప్రీంకు నివేదించింది. కొనుగోలుదారులు చెల్లించిన రూ.99కోట్ల డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఆ డబ్బును సెబీ-సహారా ఖాతాలో జమ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆస్తుల కొనుగోలు దారులు వచ్చేనెల 15వ తేదీలోగా రూ.200కోట్లను చెల్లించాలని మిగతా రూ.682కోట్ల డబ్బును సెప్టెంబర్‌లోగా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబరు 14వ తేదీన జరగనుంది.

సహారాపై ఇలా అక్రమాస్తుల కేసు


సహారా గ్రూప్‌ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా రూ. 24వేల కోట్లను వసూలు చేసిన ఆరోపణలతో కోర్టు కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మెత్తాన్ని ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో సహారా గ్రూపు తమ ఆస్తులను అమ్మి వేల కోట్ల రూపాయలను సెబీకి చెల్లిస్తోంది. ప్రస్తుతం సహారా గ్రూప్‌ ఛైర్మన్‌ సుబ్రతా రాయ్‌ పెరోల్‌పై బయట ఉన్నారు.

సిప్లా చేతికి దక్షిణాఫ్రికా మిర్రెన్


ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేయనున్నది. ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్‌ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్‌లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్‌ లిమిటెడ్‌ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్‌ప్రో సౌత్‌ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది.

ఇలా సౌతాఫ్రికా కాంపిటీషన్ కమిషన్ ఆమోదం కావాలి


మిర్రెన్‌ను సిప్లా స్వాధీనం చేసుకోవడానికి దక్షిణాఫ్రికా కాంపిటీషన్‌ కమిషన్‌ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్‌ కల్లా ఈ డీల్‌ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్‌వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్‌ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్‌ల టర్నోవర్‌ను సాధించింది. దక్షిణాఫ్రికాలోని ఔషధ కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో సిప్లా షేర్‌ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది.  

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు ఊరట


కొత్తగా మళ్లీ ఖాతాదారులను చేర్చుకోవడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) నుంచి అనుమతులు లభించినట్లు ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తెలిపింది. ఖాతాదారుల వివరాల ధృవీకరణ కోసం ఆధార్‌ ఈ–కేవైసీని ఉపయోగించుకోవడానికి విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ నుంచి కూడా అనుమతి లభించినట్లు తెలియజేసింది. 


గతంలో సబ్ స్కైబర్ల అనుమతి లేకుండా ఇలా..


ఎయిర్‌టెల్‌ మొబైల్‌ సబ్‌స్క్రయిబర్ల అనుమతి లేకుండానే వారి పేరున ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంకు ఖాతాలు తెరవడం, కోట్ల కొద్దీ రూపాయల వంటగ్యాస్‌ సబ్సిడీ మొత్తాలు వీటిల్లోకి మళ్లడంతో కొన్నాళ్ల కిందట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోరాదంటూ ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఆదేశించింది. అలాగే ఆధార్‌ డేటా బేస్‌ను ఉపయోగించుకోకుండా టెలికం సంస్థ ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కి ఇచ్చిన ఈ–కేవైసీ లైసెన్సులను కూడా యూఐడీఏఐ సస్పెండ్‌ చేసింది. ఈ ఏడాది మార్చిలో ఎయిర్‌టెల్‌ లైసెన్సును పునరుద్ధరించినా, పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్సుపై సస్పెన్షన్‌ కొనసాగింది.  

loader