Asianet News TeluguAsianet News Telugu

నో జాబ్ లాస్: ఆటోపై జీఎస్టీ తగ్గింపునకు కౌన్సిల్‌దే ఫైనల్


బ్యాంకుల విలీనం వల్ల ఒక్క ఉద్యోగం కూడా పోదని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్యోగులకు భరోసా కల్పించారు. వివిధ రంగాలను ఆదుకునేందుకు బ్యాంకులకు మరింత మూలధనం అందజేస్తున్నట్లు తెలిపారు. రంగాలవారీగా సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక ఆటోమొబైల్ రంగ అభ్యర్థనల మేరకు జీఎస్టీ తగ్గించాలన్న విషయమై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని, తనదేమీ లేదని తేల్చి చెప్పారు. 

No job loss due to merger of banks
Author
New Delhi, First Published Sep 2, 2019, 12:27 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్‌టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల భేటీ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  

ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులపై ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుందంతే‘ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. 

పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయించిన సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్‌ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్‌ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. 

అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి దిగజారకుండా ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం’ అని విత్త మంత్రి నిర్మలాసీతారామన్ పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు.

సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్‌ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్‌–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ సుప్రీంకోర్టు లక్ష్యాన్ని నిర్దేశించిందని ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 

ఇక జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్‌ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్‌టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు.

‘ఆటోమొబైల్‌ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.  

ఇదిలా ఉండగా, కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ స్పందిస్తూ పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు.

బ్యాంకింగ్‌ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్‌ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్‌ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios