Asianet News Telugu

నో రిలీఫ్: మాల్యా పిటిషన్‌ కొట్టివేత.. చౌక్సీ ఆస్తులు జప్తు


ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తన ఆస్తులను ఈడీ జప్తు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చోక్సీకి చెందిన రూ.24.77 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 

No HC relief to Vijay Mallya on proceedings for seizure of assets
Author
Mumbai, First Published Jul 12, 2019, 10:55 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై: ఘరానా మోసగాళ్లు విజయ్ మాల్య, మెహుల్ చౌక్సీలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తన ఆస్తుల జప్తును నిలిపివేయాలని కోరుతూ విజయ్‌ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్‌ అఖిల్ ఖురేషి, జస్టిస్‌ ఎస్‌జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది. 

 

కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేగాక తనపై వేసిన ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’ ముద్రకు సంబంధించి చెల్లుబాటును సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చే వరకు రక్షణ కల్పించాలని ఇదే పిటిషన్‌లో కోరారు. కానీ విజయ్ మాల్యా పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. 

 

బ్యాంకులకు రూ.9,000 కోట్లు అప్పు ఎగవేత కేసులో విజయ్‌ మాల్యా నిందితుడిగా ఉన్నారు. 2019 జనవరిలో ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్) కోర్టు మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

ఇదిలా ఉండగా ‘మీరు ఎవరితో అయిన కలిసి కాఫీ తాగండి.. కానీ, మీరు అనుకున్నదే చేయండి’ అని హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ సీఈఓ కం ఎండీ ఆదిత్య పురి తెలిపారు. ప్రముఖ జర్నలిస్టు తమల్‌ బంధోపాధ్యాయ రచించిన ఒక పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. 

 

‘మనం ఎవరితోనైనా కలిసి కాఫీ తాగవచ్చు.. కానీ, మనం ఏది అనుకుంటామో అదే చేయాలి. వ్యక్తిగత పరిచయాలను వృత్తిలోకి తీసుకొని రాకూడదు. నా చిరకాల సహచరుడు పరేష్‌ సుక్తాంకర్‌ ఈ విషయాన్ని అక్షరాలా ఆచరించాడు. మీరు రిస్క్‌గా మారితే.. మీకు అప్పు ఇవ్వడం నాకు కూడా రిస్కే. మీరు నాకు మిత్రుడైతే పిలిచి కాఫీ ఇచ్చి పంపగలను’ అని తెలిపారు.

 

‘కొన్నేళ్ల కిందట రుణం కోసం దరఖాస్తు తీసుకొని మాల్యా సిబ్బంది నా వద్దకు వచ్చారు. ఆ దరఖాస్తును పరిశీలిస్తానని చెప్పి వారికి కాఫీ ఇచ్చి పంపించేశాను. ఆ తర్వాత దరఖాస్తును నా సహచరుడు పరేష్‌కు అందజేశాను. ఆయనకు మాల్య విషయం అర్థమై ఆ దరఖాస్తును నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత మాల్యా ఫోన్‌ చేసిన ప్రతిసారి ఆవేశంగా మాట్లాడేవారు. స్నేహం.. బ్యాంకింగ్‌ అనే రెండు కత్తులూ ఒకే ఒరలో ఇమడవు. వచ్చే మూడు నెలల్లో మా బ్యాంక్‌ను లైఫ్‌ స్టైల్‌ బ్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన 90శాతం పని పూర్తిచేశాం’ అని ఆదిత్యపురి వివరించారు. 

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రుణాల మంజూరు విషయంలో స్పష్టమైన విధానం ఉండటంతో ఆ బ్యాంక్‌కు అతితక్కువ మొండి బాకీలు ఉన్నాయి. పదేళ్ల నుంచి నికర లాభాల్లో 20శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2019 మార్చి త్రైమాసికంలో బ్యాంక్‌ 23శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. 

 

మెహుల్ చోక్సీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రుణాలు ఎగవేసిన కేసులో నిందితుల్లో ఒకరైన మెహుల్‌చోక్సీ ఆస్తులపై ఈడీ కొరడా ఝళిపించింది. భారత్‌తోపాటు విదేశాల్లో ఉన్న రూ.24.77 కోట్ల విలువైన అతని ఆస్తుల్ని జప్తు చేసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహుల్‌ చోక్సీకి చెందిన దుబాయి కేంద్రంగా ఉన్న మూడు వాణిజ్య ఆస్తులు , ఒక మెర్సెడెస్‌ బెంజ్‌ కారు, భారత్‌ సహా ఇతర దేశాల్లో ఉన్న అతని బ్యాంకు ఖాతాలను జప్తు చేశామన్నారు. తాజాగా జప్తు చేసిన ఆస్తుల విలువ మొత్తం రూ.24.77 కోట్లు ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. తాజాగా జప్తు చేసిన వాటితో కలిపి ఇప్పటి వరకూ మొత్తం రూ.2534.7 కోట్లు ఆస్తుల్ని జప్తు చేశామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios