ఉదయ్‌పూర్: పెళ్లి వేడుకల్లో సంగీత్‌ అంటేనే సినిమా గీతాలకు కాలు కదపడం.. మరి బాలీవుడ్‌, హాలీవుడ్‌, పాప్‌ అగ్రతారలే తరలి వస్తే.. కళ్లు చెదరాల్సిందే. ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీ గారాల పట్టి ఈశా అంబానీ, అజయ్‌ పిరమాల్‌- స్వాతి పిరమాల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌ వివాహానికి ముందు జరుగుతున్న వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్‌ ఇందుకు వేదికైంది. వేడుకలకు హాజరైన ఆహుతులతోపాటు అంబానీ దంపతులు కాలు కదపడం విశేషం. 

‘కల్‌ హో న హో’ చిత్రంలోని విజయవంతమైన పాట ‘మాహి వే’కు ఇద్దరు తనయులు ఆకాశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీలతో కలిసి నీతా అంబానీ డ్యాన్స్‌ చేశారు. ఈ పాట ప్రారంభమైన కొద్దిసేపటే ఈశా అంబానీ, తన తండ్రి ముకేశ్‌ అంబానీని చేయి పట్టుకొని వేదిక మీదకు తీసుకొచ్చారు. తొలుత సరదాగా ప్రారంభమైన ఈ పాట ‘చందా మేరి చందా తుఝె కైసే మై యె సంఝావూ ముఝె లగ్‌తీ హై తు కిత్నీ ప్యారీ రే’ అనే లైన్ల దగ్గరికి వచ్చేసరికి అందర్నీ భావోద్వేగానికి గురి చేసింది. తర్వాత ‘జబ్‌ తక్‌ హై జాన్‌’ సినిమాలోని టైటిల్‌ పాటకు ముకేశ్ అంబానీ‌, నీతా అంబానీ కలిసి నర్తించడం ఆహూతుల్ని ఆకట్టుకుంది. ఆదివారం ప్రసిద్ధ పాప్‌ గాయని బియాన్స్‌ తన ప్రదర్శనతో ఉర్రూతలూగించారు.

అంబానీ, పిరమాల్‌ కుటుంబ సభ్యులు కూడా సంగీత్‌లో ఉత్సాహంగా పాల్గొని కొన్ని పాటలకు నృత్యం చేశారు. హిందీ చిత్ర సీమ నుంచి షారుక్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ వేసిన స్టెప్పులతో ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ హోరెత్తిపోయింది. హాలీవుడ్‌ పాప్‌ గాయని బియాన్స్‌, బాలీవుడ్‌ నటీమణి రేఖతో పాటు సచిన్‌ తెందుల్కర్‌-ఆయన భార్య అంజలి కూడా పాల్గొన్నారు. ఇటు బాలీవుడ్.. అటు హాలీవుడ్.. మరోవైపు బిజినెస్ దిగ్గజాలు రతన్ టాటా, బిర్లా తదితరులు.. దేశ విదేశాల నుంచి హాజరైన అతిథులు ఈ ఆటపాటలు వీక్షించి ముగ్ధులయ్యారు.