Asianet News TeluguAsianet News Telugu

వడ్డీరేట్లు తగ్గిస్తాం.. విత్తమంత్రికి బ్యాంకర్ల హామీ

ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఐఎంఎఫ్, ఏడీబీలు భారత్ జీడీపీ అంచనాలను తగ్గించిన నేపథ్యంలో వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతామని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం బ్యాంకర్లతో సమావేశమై ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా కీలక వడ్డీరేట్లు తగ్గించాలని కోరారు. ఈ మేరకు బ్యాంకర్లు కూడా సానుకూలంగా స్పందించారు.
 

Nirmala Sitharaman to meet representatives of various sectors during this week
Author
Hyderabad, First Published Aug 6, 2019, 12:01 PM IST

భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో రెపో రేటును తగ్గించినప్పుడల్లా, ఆ  ప్రయోజనాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ స్థాయిలో బ్యాంకులు రుణ రేట్లను సవరించడం లేదు. ఈ విషయంపై ఆర్బీఐ గవర్నర్‌తోపాటు ఆర్థిక శాఖ కూడా బ్యాంకర్లను పలుమార్లు హెచ్చరించిన సంగతి విదితమే.

సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీలు) అధిపతులతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి రుణ రేట్ల ప్రయోజన బదిలీపై చర్చించారు. బ్యాంకర్లందరూ ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష ప్రకారం, రుణ రేట్లను సవరించేందుకు అంగీకారం తెలిపినట్లు సమావేశం తర్వాత విత్త మంత్రి ప్రకటించారు.

2018 డిసెంబర్ నుంచి ఆర్బీఐ మూడు సార్లు పావు శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. బుధవారం వెల్లడించనున్న సమీక్ష వివరాల్లోనూ పావు శాతం మేర కీలక రేట్ల కోత ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.

బడ్జెట్‌లో అధిక సంపన్న వర్గంపై సర్‌ఛార్జి విధించడం వల్ల దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో  వారితో చర్చించేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ‘విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) ప్రతినిధులతో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి త్వరలోనే చర్చలు జరుపుతారు. వారు ఏం చెప్పాలని అనుకుంటున్నారో వినడానికి మేము సిద్ధంగా ఉన్నామ’ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

దేశీయ కేపిటల్‌ మార్కెట్ల నుంచి ఈ నెల 1, 2 తేదీల్లోనే ఎఫ్‌పీఐలు నికరంగా రూ.2,985.88 కోట్ల నిధుల్ని వెనక్కి తరలించారు. ట్రస్టులు/అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎఫ్‌పీఐలు కూడా అధిక సంపన్న వర్గం పరిధిలోకి వస్తున్నారు,  కాబట్టి వారు కూడా సర్‌ఛార్జి చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో నిధులు ఉపసంహరించుకుంటున్నారు.

వివిధ రంగాల ప్రతినిధులతో ఈ వారంలో సమావేశమై సమస్యలు తెలుసుకోవడంతోపాటు, వారికి ఎలాంటి సాయం అందిస్తే ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందో, ఆ చర్యలు తీసుకుంటామని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ), వాహన రంగం, పరిశ్రమ సంఘాలు, మార్కెట్లు, స్థిరాస్తి, గృహ కొనుగోలుదార్లు.. ఇలా అన్ని రంగాల ప్రతినిధులతో ఈ వారంలోనే సమావేశాలు నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. 

ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్‌ఎఫ్‌), ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) భారత్‌ వృద్ధి రేటును తగ్గిస్తూ అంచనాలు వెల్లడించిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకునేందుకే ఆర్థిక మంత్రి ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

8 నుంచి బీఓబీ రుణ రేట్ల తగ్గింపు
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) రుణ రేట్లను సవరించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) 15 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. సవరించిన రుణ రేట్లు ఈ నెల 8 (గురువారం) నుంచి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకు బ్యాంకు సమాచారం ఇచ్చింది. వివిధ గడువుల్లో వడ్డీరేట్లు రుణ రేట్లు 8.05-8.45 శాతం మధ్య ఉండబోతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios