లండన్‌: పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు నీరవ్‌ మోదీ.. బ్రిటన్‌ జారీ చేసే‘గోల్డెన్‌ వీసా’తో అడుగుపెట్టినట్లు తెలిసింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)యేతర పెట్టుబడిదారులకు బ్రిటిష్‌ ప్రభుత్వం టైర్‌-1 (ఇన్వెస్టర్‌) వీసాను జారీ చేస్తుంది. దీన్నే యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో గోల్డెన్‌ వీసాగా వ్యవహరిస్తారు. 

బ్రిటన్ ప్రభుత్వ బాండ్లు లేదా కంపెనీ షేర్లలో దాదాపు 20 లక్షల పౌండ్లు (సుమారు రూ.18 కోట్లు) పెట్టుబడులు పెట్టే వారికి అక్కడి ప్రభుత్వం ఈ వీసాను జారీ చేస్తుంది. నీరవ్‌ మోదీ ఇదే తరహా వీసాను తీసుకోవటం ద్వారా బ్రిటన్‌లో నివాసం ఉంటున్నట్లు బ్రిటన్ ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

కాగా నీరవ్‌కు గోల్డెన్‌ వీసా చాలా ఏళ్ల క్రితమే జారీ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో నీరవ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్టు ఆధారంగా గతేడాది జనవరిలో నీరవ్‌ మోదీ అమెరికాకు పారిపోయారు. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నీరవ్‌ను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించటమే కాకుండా ఆయనను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.

ఒక వ్యక్తి యునైటెడ్ కింగ్‌డమ్‌లో వ్యాపారాన్ని నెలకొల్పడం, పని చేయడం, విద్యాభ్యాసానికి గోల్డెన్ వీసా అనుమతినిస్తుంది. వన్ టైం పెట్టుబడి కింద 20 లక్షల పౌండ్లు పెట్టుబడి పెట్టిన వారికే ఇది వర్తిస్తుంది. 

ఐదేళ్ల పాటు వరుసగా ఇదే స్థాయిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళితే సదరు వీసా గల వ్యక్తి శాశ్వత పౌరసత్వానికి అర్హుడవుతారు. విదేశాల్లో ఉంటూ యునైటెడ్ కింగ్ డంలో పెట్టుబడులు పెట్టిన వారు కూడా గోల్డెన్ వీసా కోసం అప్లయ్ చేసుకునే అవకాశం ఉండటం గమనార్హం. 

మొన్నటి వరకు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో తల దాచుకున్న నీరవ్ మోదీ.. గత నెలలోనే యునైటెడ్ కింగ్ డంలో అడుగు పెట్టినట్లు సమాచారం. డైమండ్ హోల్డింగ్స్ పేరిట నీరవ్ మోదీ లండన్ సెంటర్ పాయింట్‌లో ఒక వజ్రాభరణాల షోరూమ్ నిర్వహిస్తున్నట్లు ఇటీవల టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టిన సంగతి తెలిసిందే.

గతేడాది ఫిబ్రవరిలోనే భారత ప్రభుత్వం నీరవ్ మోదీ పాస్ పోర్ట్ రద్దు చేయడమే కాక రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. కాగా, నీరవ్ మోదీ గతేడాది మే నెలలోనే డైమండ్ హోల్డింగ్స్ ఏర్పాటు చేశారని తెలుస్తున్నది. ఈ షోరూమ్ ను స్కాటిష్ ప్రావిడెండ్ హౌస్ చిరునామాలో ఏర్పాటు చేశారు. అదీ కూడా నీరవ్ మోదీ అక్కౌంటెంట్స్ ‘దత్తానీ చార్టర్డ్ అక్కౌంటెంట్స్’ది కావడం గమనార్హం. 

మరోవైపు నీరవ్‌ మోదీ భార్య ఆమీ మోదీకి ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ను జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌కు అనుగుణంగా స్పెషల్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం (పీఎంఎల్‌ఏ) న్యాయమూర్తి ఎంఎస్‌ అజ్మీ ఈ వారంట్‌ను జారీ చేశారు. 

అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల ద్వారా అమీ మోదీ 3 కోట్ల డాలర్ల నిధులను అక్రమంగా మళ్లించారని ఈడీ ఆరోపించటమే కాకుండా పీఎన్‌బీ కేసులో ఈమెకు ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిపింది. అక్రమంగా మళ్లించిన నగదును న్యూయార్క్‌లో ఆస్తుల కొనుగోలుకు వినియోగించారని ఈడీ పేర్కొంది.