దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)పై కోబ్రాపోస్ట్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ కంపెనీ ప్రధాన ప్రమోటర్లు రూ.31వేల కోట్ల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపించింది. 

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్‌ వాద్వాన్‌, అరుణ వాద్వాన్‌, ధీరజ్‌ వాద్వాన్‌ ఈ నిధుల చట్టవ్యతిరేక దారి మళ్లింపునకు సూత్రధారులని తెలిపింది. కస్టమర్లను ఆకర్షించేందుకు‘చేంజింగ్ రూల్స్, చేంజింగ్ లైవ్స్’ అనే క్యాప్షన్‌తో డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు తమ జీవితాలను సుఖమయం చేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

రూ.21 వేల కోట్లు డొల్ల కంపెనీలకు బదిలీ
దాదాపు రూ.21,477 కోట్ల డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ నిధులను పలు డొల్ల కంపెనీలకు రుణాలు, పెట్టుబడుల రూపంలో బదిలీ చేశారని కోబ్రా పోస్టు పేర్కొంది. ఈ వివరాలను కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వెల్లడించలేదని అంటోంది. ఈ పరిణామంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు మూడేళ్ల కనిష్ఠ స్థాయికి చేరాయి.

అడ్వాన్సులు, రుణాల పేరిట దారి మళ్లింపు
ప్రధానంగా రుణాలు, అడ్వాన్సుల రూపంలో డొల్ల కంపెనీలకు నిధులను దారి మళ్లించారని లాభాపేక్ష రహిత కోబ్రాపోస్ట్‌ చెబుతోంది. డొల్ల కంపెనీల ద్వారా భారత్‌, విదేశాల్లో ఆస్తులను కూడగట్టుకున్నారని తెలిపింది. బ్రిటన్‌, దుబాయ్‌, శ్రీలంక, మారిషస్‌లతో పాటు భారత్‌లోనూ షేర్లు, ఈక్విటీ, ప్రైవేట్ ఆస్తులను కొనుగోలు చేయడానికి ఈ డబ్బులు ఉపయోగించినట్లు ఆరోపించింది. 
 
ఎస్బీఐ రుణం రూ.11,000 కోట్లు 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తదిరత పలు బ్యాంకులు రుణాలిచ్చాయని కోబ్రాపోస్ట్ తెలిపింది. అందులో ఎస్బీఐ అత్యధికంగా రూ.11,000 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.4,000 కోట్ల వరకు రుణాలిచ్చినట్లు చెప్పింది. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలన్నీ ప్రమోటర్లు తమ డొల్ల కంపెనీలకు బదిలీ చేశారని.. అది కూడా పలు దశల్లో కాక.. ఒకేసారి వీటిని బదిలీ చేసినట్లు ఆరోపించింది. 

బీజేపీకి రూ.20 కోట్ల విరాళాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ.19.5 కోట్ల వరకు విరాళాలను అందజేసిందని కూడా కోబ్రాపోస్ట్‌ ఆరోపించింది. ఈ విరాళాలను 2014-15, 2016-17 మధ్య ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌, స్కిల్‌ రియల్టర్స్‌, దర్శన్‌ డెవలపర్స్‌ ద్వారా ఇచ్చినట్లు పేర్కొంది. ఇవన్నీ కూడా వాద్వాన్‌లతో సంబంధం ఉన్న కంపెనీలే. 

అధికారిక ధ్రువీకరణల్లేకుండా విరాళాలు
ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ తన 2014 -15 బ్యాలెన్స్‌ షీట్లలో ఎటువంటి విరాళాలను పేర్కొనలేదని.. అలాగే స్కిల్‌ రియల్టర్స్‌ 2014-15లో రూ.2 కోట్ల విరాళం ఇచ్చినా.. ఆ కంపెనీ కూడా బ్యాలెన్స్‌ షీట్లలో చూపలేదని కోబ్రాపోస్ట్‌ పేర్కొంది. 

మూడో త్రైమాసికం లాభాల్లో 36.7% క్షీణత
మూడో త్రైమాసికంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తన నికర లాభంలో 36.7% క్షీణతను నమోదు చేసింది. ఆ నేపథ్యంలో మంగళవారమూ కంపెనీ షేర్లు 8 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో కంపెనీపై వచ్చిన ఆరోపణలూ పనిచేశాయనే చెప్పాలి.

బీఎస్‌ఈలో షేరు ఒక దశలో 11% తగ్గి మూడేళ్ల కనిష్ఠ స్థాయి రూ.164.50కు చేరింది. చివరకు 8.01%నష్టపోయి రూ.170.05 వద్ద ముగిసింది. రెండు రోజుల్లో షేరు 18.71 శాతం నష్టపోయింది.

మురికివాడల పునరావాసం పేరిట ఇలా రుణాల మంజూరు
మురికివాడల పునరావాసం పేరిట పల్లు షెల్ కంపెనీలకు డీహెచ్ఎఫ్ఎల్ రుణాలు మంజూరు చేసింది. అలా రుణాలు పొందిన సంస్థల్లో ప్రశూల్ రియల్ ఎస్టేట్, ఎద్వీనా రియల్ ఎస్టేట్, ఎర్లీన్ రియల్ ఎస్టేట్, నోషల్ రియల్ ఎస్టేట్, కనితా రియల్ ఎస్టేట్, రిప్ డెవలపర్స్, గరద్వార్ రియల్ ఎస్టేట్, సువరల్ రియల్ ఎస్టేట్, మన్ ప్రీత్ ఎస్టేట్స్, రాజెన్ స్కై స్కాపర్స్, వామిక రియల్ ఎస్టేట్, ప్రుథ్వీ రెసిడెన్సీ, వ్యోంకారా రియల్ ఎస్టేట్ తదితర సంస్థలకు డీహెచ్ఎఫ్ఎల్ రమారమీ రూ.7,390 కోట్ల సెక్యూర్డ్ రుణాలు అందజేసింది.

కర్ణాటక, గుజరాత్ సంస్థలకే రుణాలు
కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన సంస్థలకు డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ రూ.2480 కోట్ల రుణాలు మంజూరు చేసింది. వాధ్వాన్, సహానా గ్రూప్ సంస్థలు (గ్రూపు ఆధీనంలోని 45 కంపెనీలకు) రూ.14,168 కోట్ల రుణాలిచ్చాయి. ఇక ఇన్ సైడ్ డ్రేడింగ్ పేరిట రూ.1000 కోట్లు, విదేశాల్లో అంటే అమెరికా, మారిషస్, దుబాయి, శ్రీలంక వంటి దేశాల్లో డీహెచ్ఎఫ్ఎల్ సంస్థల ఆస్తుల విలువ రూ.5200 కోట్లు

సత్వరం దర్యాప్తు చేపట్టాలని యశ్వంత్ సిన్హా డిమాండ్
బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.31,000 కోట్ల రుణాలను చట్టవ్యతిరేక పద్ధతుల్లో మళ్లించిన ఆరోపణల నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై దర్యాప్తు చేపట్టాల్సిందేనని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా పేర్కొన్నారు.

‘రాజకీయ విరాళాలతో పాటు పలు ఆరోపణలపై తక్షణం దర్యాప్తు చేయడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రభుత్వ ఉద్దేశంపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కోర్టు పర్యవేక్షణలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని నేను కోరుతున్నా’అని అన్నారు.

ఆరోపణలపై స్పందించలేమన్న కార్పొరేట్ వ్యవహారాలశాఖ
ఒక మీడియా సంస్థ ఆరోపణలపై స్పందించలేమని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. ‘మేం మా సొంత వర్గాల ద్వారా ఆ వార్తలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. అపుడే మేం ఆ ఆరోపణలపై స్పందించగలం’ అని ఆ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

బ్యాంకుల పాత్ర ఉన్నదని తేలిందంటున్న ప్రశాంత్ భూషణ్
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ బ్యాంకులు సరిగ్గా క్షేత్రస్థాయి తనిఖీలు చేసి ఉంటే.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కిచ్చిన రుణాలు డొల్ల కంపెనీలకు అక్రమ పద్ధతుల్లో బదిలీ అయ్యాయని తెలిసేదన్నారు. అంటే ఈ కుంభకోణంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన పలువురి హస్తం ఉందని అర్థమవుతోందన్నారు. 

కోబ్రాపోస్ట్ ఆరోపణలపై డీహెచ్ఎఫ్ఎల్ ఇలా
‘కోబ్రాపోస్ట్‌ ఆరోపణలన్నీ దురుద్దేశంతో కూడుకున్నవే. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బ్రాండ్‌, ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తోంది. ఆ ఆరోపణలతో వాటాదార్ల విలువ తగ్గే ప్రమాదం ఉంది. కంపెనీని అస్థిరపరచాలన్నదే ఈ ఆరోపణల వెనక ఉద్దేశంగా ఉంది’ని డీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

చట్టబద్ద లావాదేవీలు జరుపుతున్నా:డీహెచ్ఎఫ్లఎ
‘కంపెనీ ఆర్థిక ప్రకటనలన్నిటినీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందజేశాం. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, గ్రూప్‌ కంపెనీలన్నీ ఏ తనిఖీలకైనా సిద్ధం. కంపెనీలో బలమైన కార్పొరేట్‌ పాలన ఉంది. క్రెడిట్‌ ఏజెన్సీల నుంచి ఏఏఏ రేటింగ్‌ మాకుంది. పూర్తిగా పన్ను నిబంధనలన్నీ పాటించింది. అంతర్జాతీయ ఆడిటర్లు మా ఖాతాలను ఆడిట్‌ చేశారు’అని డీహెచ్ఎఫ్ఎల్ ఆ ప్రకటనలో తెలిపింది. 

నియంత్రణ సంస్థల పర్యవేక్షణలో పని చేస్తుందని సమర్థన
మా కంపెనీ నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, సెబీ తదితర నియంత్రణ సంస్థల నియంత్రణలోనే పనిచేస్తోందని డీహెచ్ఎఫ్లఎ వివరించింది.  అన్ని రుణాల పంపిణీని సాధారణ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగానే చేశామని.. నిబంధనలను అనుగుణంగానే చేశామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. గత మూడు నెలల్లో అన్ని బ్యాంకులకు రూ.17,000 కోట్ల మేర రుణ బకాయిలు చెల్లించామని పేర్కొంది.

రూ.8,795 కోట్ల నికర విలువ పెట్టుబడులతో రూ.96 వేల కోట్ల రుణాలు
అసలు గమ్మత్తేమిటంటే డీహెచ్ఎఫ్ఎల్ నికర విలువ రూ.8,795 కోట్లయితే తీసుకున్న రుణాలు మొత్తం రూ.96,880 కోట్లని కోబ్రాపోస్ట్ ఆరోపించింది. ఎన్సీడీల ద్వారా సెక్యూర్డ్ రుణాలు రూ.28,819 కోట్లు, అన్ సెక్యూర్డ్ రుణాలు రూ.2,492 కోట్ల తీసుకున్నది.

బ్యాంకుల నుంచి రూ.36,963 కోట్లు, విదేశీ వాణిజ్య రుణాల రూపేణా రూ.2,965 కోట్ల రుణాలు పొందిందని కోబ్రాపోస్ట్ ఆరోపణ. ఇంకా నేషనల్ హౌసింగ్ బోర్డు ద్వారా రూ.2,848 కోట్ల రుణాలు పొందితే, పబ్లిక్ డిపాజిట్ల ద్వారా రూ.9,225 కోట్లు, ఇతర మార్గాల్లో రూ.13,567 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలుస్తోంది.