ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నేటితో ముగియనుంది. ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. మరి 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్న కీలక మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం.

రేపటి నుంచి (ఏప్రిల్​ 1) కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీనితో బడ్జెట్​ 2022లోని ప్రతిపాదనలు, మార్పులు రేపటి నుంచి అమలుకానున్నాయి. వీటితో పాటు రేపటి నుంచి ఆర్థికపరంగా అమలులోకి రానున్న మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిప్టో లావాదేవీలపై పన్ను

ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీల లావాదేవీలు (క్రిప్టో కరెన్సీలు కొనడం, విక్రయించడం) ఇప్పటి వరకు పన్ను రహితంగా ఉన్నాయి. అయిత్ బడ్జెట్ 2022 ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై క్రిప్టో కరెన్సీ లాభాలపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో క్రిప్టో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

భారంగా మారనున్న సొంతింటి కల

ఏప్రిల్​ 1 నుంచి సొంతిటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి మరింత ఆర్థిక భారం పడనుంది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం 80ఈఈఏ కింద ఇళ్ల కొనుగోలుకు ఇచ్చే మినహాయింపును నిలిపివేయనుంది.

ఔషధాల ధరలకు రెక్కలు

రేపటి నుంచి ఔషధాల ధరలు కూడా పెరగున్నాయి. మఖ్యంగా తరచూ వినియోగమయ్యే.. పెయిన్ కిల్లర్స్​, యాంటీ బయోటిక్స్​, పారా సిటమాల్​ సహా వివిధ ఔషధాలు ప్రియం కానున్నాయి. ప్రస్తుతంతో పోలిస్తే.. 10 శాతం మేర ధరలు పెరగొచ్చని తెలుస్తోంది.

మరోసారి బండ బాదుడు..!

ఇప్పటికే పెరిగిన ఇంధనల ధరలతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రజలకు మరోసారి షాకివ్వనున్నాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. రేపటి నుంచి సిలిండర్ ధరలు మరింత ప్రియం కానున్నాయని అంచనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల 15న ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

రెండు పీఎఫ్​ ఖాతాలు..!

రేపటి నుంచి పీఎఫ్ ఖాతాలు రెండు రకాలుగా విడిపోనున్నాయి. పన్ను వర్తించే, పన్ను రహిత ఖాతాలుగా పీఎఫ్​ అకౌంట్స్​ను విభజించనున్నారు. ఉద్యోగి పీఎఫ్​ వాటాలో ఏడాదికి రూ.2.5 లక్షల కన్నా ఎక్కువగా జమ అవుతే ఆ ఖాతాన్నీ పన్ను వర్తించే విభాగంలోకి మారనున్నాయి. మిగతావి పన్ను రహిత ఖాతాలుగా ఉండనున్నాయి.