ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ రూపొందించిన కొత్త శాంత్రో మోడల్ కారు మార్కెట్లోకి రాకముందే సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో 14,208 బుకింగ్స్‌ నమోదు చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నెల 10వ తేదీన హ్యుండాయ్ నూతన శాంత్రో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించారు. దీనిని బుక్‌ చేసుకోవాలంటే రూ.11 వేలు అడ్వాన్స్‌ చెల్లించాలి. 

ఈ కారు వేరియంట్లు, ధరల వివరాలు ఇంకా వెల్లడించకముందే జనాలు భారీగా బుకింగ్స్‌కు అడ్వాన్స్‌లు చెల్లించడం విశేషం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు చాలా మంది వినియోగదారులు హ్యుండాయ్ నూతన శాంత్రోతోపాటు ఆస్టా, స్పోర్ట్స్‌ ఏఎంటీ మోడల్స్‌కు ఆసక్తి చూపడం విశేషం. వీటిల్లో దసరా బుకింగ్స్‌ సంఖ్యను కలపలేదు. 

దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళల నుంచి అత్యధిక బుకింగ్స్‌ వచ్చాయి. త్వరలో కార్‌ షోరూమ్స్‌లో బుకింగ్స్‌ ప్రారంభించాక వీటి 20 వేలకు పెరుగవచ్చునని అంచనా వేస్తున్నారు.

ఈ నెల 23వ తేదీన హ్యుండాయ్ నూతన శాంట్రో మోడల్ కారును భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్నారు. కాగా, ఇటీవలే మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో ఆవిష్కరించిన మరాజో మోడల్ మల్టీ యుటిలిటీ వెహికల్ కోసం కేవలం 40 రోజుల్లోనే 10 వేల బుకింగ్‌లు నమోదయ్యాయి.