అంతా అనుకున్నట్లు సవ్యంగా సాగితే జాతీయ స్థాయిలో ఆర్థిక, వివిధ రంగాల పరిశ్రమలకు మాదిరిగానే ‘పుత్తడి ఎక్చ్సేంజ్’ కొలువు దీరనున్నది. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సమగ్ర పసిడి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల పరిశీలనకు ముసాయిదా విధానాన్ని పంపింది. బులియన్ పరిశ్రమ వర్గాలు సైతం పసిడి విధానం కోసం ఎదురు చేస్తున్నాయి.

ఎంతో కాలంగా బంగారానికి ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. ‘బంగారాన్ని ఒక ప్రత్యేక తరగతికి చెందిన ఆస్తిగా అభివృద్ధి చేసేలా సమగ్ర విధానం తీసుకు వస్తున్నట్లు కొద్ది కాలం క్రితం అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.
 
పుత్తడి వినియోగం, దిగుమతుల్లో ప్రస్తుతం మన దేశం చైనాతో పోటీ పడుతోంది. దీంతో ఒక్కోసారి కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌) పెరిగిపోతోంది. దీన్ని నివారణకు పసిడి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచేస్తోంది.

గతంలో మూడు శాతంగా ఉన్న పసిడి దిగుమతి సుంకం ఇప్పుడు 10 శాతానికి చేరింది. ఇది చాలదన్నట్టు దేశీయంగా పసిడి కొనుగోళ్లపై మూడు శాతం జీఎస్టీ, ఆభరణాల ఎగుమతులపై మూడు శాతం ఐజీఎస్టీ భారం మోపుతోంది. 

దీంతో అడ్డదారుల్లో (స్మగ్లింగ్‌ ద్వారా) బంగారం సరిహద్దులు దాటి దేశంలోకి వస్తోంది. సమగ్ర పసిడి విధానం తీసుకు వస్తే దిగుమతులతో పాటు, అక్రమ దిగుమతులకూ చెక్‌పెట్ట వచ్చని బులియన్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
నగలు, పెట్టుబడి లాభాల కోసం మన దేశంలో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు. విదేశాల్లో పెట్టుబడి లాభాల కోసం బంగారం కొనే వారిలో ఎక్కువ మంది కాగిత రహితంగా డిమ్యాట్‌ రూపంలో ఉండే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు/బాండ్స్‌ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. 

మన దేశంలోనూ నేరుగా బంగారం కొనుగోలు చేయడంతోపాటు ఈటీఎఫ్ బాండ్ల కొనుగోలు పద్దతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ రెండు విధానాలు మన దేశంలో పెద్దగా విజయవంతం కాలేదు. సమగ్ర పసిడి విధానంలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ‘పేపర్‌ రహిత డీమాట్‌’ గోల్డ్‌ పెట్టుబడులను ప్రోత్సహించవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా.
 
మన దేశ ఎగుమతులో 15 శాతం వాటా బంగారం లేదా ఇతర విలువైన రాళ్లతో తయారు చేసిన నగలదే. ఇందుకోసం దిగుమతి చేసుకునే పసిడి దిగుమతలపైనా అనేక ఆంక్షలు ఉన్నాయి. దీంతో ఎగుమతిదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమగ్ర పసిడి విధానంతో ఈ సమస్యలకు చెక్‌ పడుతుందని ఎగుమతిదారులు ఆశాభావంతో ఉన్నారు. 

దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించాలని బులియన్ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలాగే  బంగారం, ఆభరణాల విక్రయంపై జీఎస్టీని మూడు శాతం నుంచి తగ్గించడంతోపాటు ఎగుమతులపై ఐజీఎస్టీని పూర్తి ఎత్తేయాలని ఈ పరిశ్రమ వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. 

ఇతర వాణిజ్య ఎగుమతులకు ఇస్తున్న ఎంఈఐఎస్‌ పథకాన్ని ఆభరణాల ఎగుమతులకూ వర్తింపచేయాలని, బంగారం సరఫరా పెంచేందుకు స్పాట్‌ ఎక్స్చేంజీలు ఏర్పాటు చేయాలని, బ్యాంకింగ్‌ రంగంలో ‘బులియన్‌ బ్యాంకింగ్‌’ను అనుమతించాలని పసిడి వ్యాపారులు కోరుతున్నారు. 
 
కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ అదనపు కార్యదర్శి కే రాజారామన్ స్పందిస్తూ ఆర్థిక అభివృద్ధితో పాటు మరిన్ని ఉద్యోగాలు కల్పించే శక్తి పసిడి పరిశ్రమకు ఉందన్నారు. ఇందుకోసం పరిశ్రమ అవసరాలకు సరిపోయే సమగ్ర విధానాన్ని రూపొందించాల్సి ఉందని తెలిపారు. 
 
ఇండియా గోల్డ్‌ పాలసీ సెంటర్‌  చైర్మన్ అరవింద్ మాట్లాడుతూ సమగ్ర పసిడి విధానం క్యాడ్‌ అదుపు తప్పకుండా చూస్తూనే స్మగ్లింగ్‌ను అడ్డుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇందుకోసం బంగారంపై పన్నుల భారం తగ్గించాలని సూచించారు. అలాగే అవసరమైన సమాచారంతో ధరల్లో పారదర్శకత పాటించడంతోపాటు ఎగుమతులనూ ప్రోత్సహించేలా ఉండాలని పేర్కొన్నారు.
 
ప్రపంచ స్వర్ణ మండలి భారత్ ఎండీ పీఆర్‌ సోమసుందరం స్పందిస్తూ కొత్త విధానం ద్వారా బులియన్‌ బ్యాంకింగ్‌, గోల్డ్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజీల కల సాకారమవుతుందన్నారు. దీనివల్ల పారదర్శకత ఏర్పడి కస్టమర్లతో పాటు చిన్న నగల వ్యాపారులూ ప్రయోజనం పొందుతారని వివరించారు. 
 
సమగ్ర పసిడి విధానం ద్వారా 2025 నాటికి ప్రస్తుతం 900 కోట్ల డాలర్లుగా ఉన్న నగల ఎగుమతులను 1800 కోట్ల డాలర్లకు పెంచుకోవచ్చునని జీజేఈపీసీ చైర్మన్‌ ప్రమోద్‌ కుమార్‌ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న 50 లక్షల మందికి తోడు మరో 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.