Asianet News TeluguAsianet News Telugu

ల్యాంకో దివాలాపై 27నే ఎన్సీఎల్టీ తుది నిర్ణయం: ఈ - కామర్స్‌తో నో యూజ్

దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు రాష్ట్రాల్లో తర్వాత దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ల్యాంకో ఇన్ ఫ్రా సంస్థ వేల కోట్ల అప్పుల్లో చిక్కుకున్నది. రుణాలు తీర్చలేని ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ దివాలా ప్రక్రియ తుది తీర్పును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఈ నెల 27వ తేదీన వెలువరించే అవకాశం ఉన్నది.

NCLT to pronounce orders on Lanco's liquidation plea on Aug 27
Author
Hyderabad, First Published Aug 22, 2018, 4:15 PM IST

హైదరాబాద్: దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు రాష్ట్రాల్లో తర్వాత దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న ల్యాంకో ఇన్ ఫ్రా సంస్థ వేల కోట్ల అప్పుల్లో చిక్కుకున్నది. రుణాలు తీర్చలేని ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ దివాలా ప్రక్రియ తుది తీర్పును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సిఎల్‌టి) ఈ నెల 27వ తేదీన వెలువరించే అవకాశం ఉన్నది.

ల్యాంకో ఇన్ ఫ్రా కంపెనీని కొనుగోలు చేసేందుకు తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ చేసిన ప్రతిపాదనకు ల్యాంకోకు రుణాలిచ్చిన బ్యాంకుల కమిటీ అంగీకరించలేదు. గురువారం మరో మారు హైదరాబాద్‌ ఎన్‌సిఎల్‌టిలో ల్యాంకో లిక్విడేషన్‌పై చర్చించనుందని తెలుస్తోంది. ఈ కంపెనీ స్వాధీనానికి తాజాగా పవర్‌‌మెక్‌ ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ ఆసక్తిగా ఉంది. ఆగస్టు 27న ఇరు పార్టీల వాదోపవాదనలను బెంచ్‌ విననున్నది. అనంతరం దీనిపై తుది తీర్పు వెలువరించనున్నది.

వాస్తవానికి త్రివేణి ప్రతిపాదనను రుణ దాతల కమిటీ (సీఓసీ) తిరస్కరించిన తర్వాత మరో సారి అవకాశం ఉండదని సమాచారం. త్రివేణి ఎర్త్‌మూవర్స్‌ రెండు సార్లు ప్రతిపాదించిన ప్రణాళికను సీఓసీ ఆమోదించలేదు. వచ్చే దఫా స్పష్టత రాకపోతే ల్యాంకోను మూసివేసి, మిగిలిన ఆస్తుల విక్రయానికి (లిక్విడేషన్‌) అవసరమైన దరఖాస్తును ఎన్‌సిఎల్‌టిలో దాఖలు చేయనున్నారు.

రూ.45వేల కోట్ల బకాయిలు.. 
గతేడాది ఆగస్టులో ఎన్‌సిఎల్‌టి హైదరాబాద్‌ బెంచ్‌ ల్యాంకో బోర్డు అధికారాలను రద్దు చేసి, దివాలా ప్రక్రియకు సావన్‌ గోదియావాలాను నిపుణుడిగా నియమించింది. ఎన్‌సిఎల్‌టి ఇచ్చిన 270 రోజుల గడువు మే4తోనే ముగిసింది. దీంతో లిక్విడేషన్‌, ఇతర పరిష్కారానికి నిపుణుడు ఎన్‌సిఎల్‌టి ఆశ్రయించనున్నట్టు ల్యాంకో ఇది వరకే ఎక్స్ఛేంజీలకు తెలిపింది.


ఈ-కామర్స్‌‌పై అంచనాలు తారుమారు
వినియోగదారులకు ఆన్‌లైన్‌ మార్కెట్‌పై ఆసక్తి పడిపోతోంది. 12 నెలల్లో దాదాపుగా 5.4 కోట్ల మంది ఈ లావాదేవీల నుంచి బయటికి వచ్చేశారని గూగుల్‌, ఒమ్డీయర్‌ నెట్‌వర్క్‌ సంయుక్తంగా నిర్వహించిన ఒక నివేదికలో తేలింది. దీంతో భారత్‌లో ఇంటర్నెట్‌ చాలా వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ఇ-కామర్స్‌కు భారీ డిమాండ్‌ ఉంటుందన్న అంచనాలు తలకిందులయ్యాయి. గతేడాది 54 మిలియన్ల మంది ఒక్కసారి మాత్రమే ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. మరోసారి ఈ వేదికల్లో ఎలాంటి కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆన్‌లైన్‌ వ్యాపార వర్గాలు దాదాపుగా రూ.3.5 లక్షల కోట్లు (50 బిలియన్‌ డాలర్ల) వ్యాపారం కోల్పోయారని అంచనా.

దీని ప్రకారం భారత్‌లో కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌ వినియోగదారులు భారీగా పెరుగుతున్నారు. ప్రతీ ఏడాది దాదాపుగా 4 కోట్ల మంది కొత్తగా నెట్‌ వినియోగంలోకి వస్తున్నారు. మొత్తంగా 39 కోట్ల ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 40 శాతం మంది ఎప్పుడో ఒక్కసారి ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో 56 శాతం మంది పురుషులు నమోదయ్యారని అంచనా. ఇందులో 60 శాతం మంది పట్టణ వసూలే. అందులోనూ 80 శాతం మంది 34 ఏళ్ల లోపు వారే. 

5.4 కోట్ల మంది ఈ-కామర్స్‌కు దూరం కాగా మరో 5 కోట్ల మంది క్రియాశీలక కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కొనసాగుతున్నారు. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు తగ్గడానికి కారణాలను ఆ సంస్థలు ఈ నివేదికలో వెల్లడించాయి. ఆన్‌లైన్‌ ఉత్పత్తులపై నమ్మకం పడిపోవడం. 18% మంది దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు చేస్తున్నప్పుడు ముట్టుకొని చూసే అవకాశం లేకపోవడం. అఫ్‌లైన్‌ లేదా రిటైల్‌ మార్కె ట్‌లో కొనుగోళ్లు అనుకూలంగా ఉండటం. ఇ-కామర్స్‌లో కొనుగోలు చేసిన ఉత్పత్తులను రిటర్న్‌ చేయడానికి, రిఫండ్‌ పొందడం క్లిష్టంగా ఉండటం. మరోవైపు ఆన్‌లైన్‌ పోర్టళ్లల్లో ఉపయోగించే ఆంగ్ల భాషలో షరతులు, విదివిధానాలు అర్థం కాకపోవడం ప్రధాన కారణమే.

సవాళ్లు పొంచి ఉన్నాయన్న గూగుల్‌ ఇండియా
ఆన్‌లైన్‌ వినియోగదారులు తగ్గిపోవడం ఈ-కామర్స్‌ కంపెనీలకు పెద్ద సవాల్‌ అని గూగుల్‌ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ సేల్స్‌ వికాస్‌ అగ్నిహోత్రి పేర్కొన్నారు. తిరిగి 5 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షిస్తే 50 బిలియన్‌ డాలర్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. చాలా మంది నూతన వినియోగదారులు ఆన్‌లైన్‌కు దగ్గర కావడం లేదని ఒమిడ్యర్‌ నెట్‌వర్క్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రూపా కడ్వా అన్నారు. కొన్ని ఇంగ్లీష్‌తో పాటు హిందీలో సమాచారం ఇస్తున్నా, అనేక స్థానిక భాషల్లో ఉత్పత్తుల సమాచారం లభించకపోవడంతో కొనుగోలుదారులు నిరాశకు గురైతున్నారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios