Asianet News TeluguAsianet News Telugu

లోన్‌ రెడీ: ఎన్బీఎఫ్‌సీలతో ఈ-కామర్స్ ప్లస్‌ స్టార్టప్స్‌ క్యూ

పలు సంస్థలు మనం కొనుగోళ్లకు అప్పులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అంటే, చేతిలో డబ్బు ఉండక్కర్లేదు.. క్రెడిట్ కార్డుతో కూడా పనిలేదన్నమాట. రూ.500 నుంచి రూ.లక్ష వరకూ ఎంతైనా తీసుకోవచ్చు. కాకపోతే 14 రోజుల్లోగా తిరిగి చెల్లించేయాలి. ఇదంతా వడ్డీ లేకుండానే సుమా!  ఈ గడువు దాటితే మూడు శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. 

NBFCs ready fireworks for big bang deals during festive season
Author
Mumbai, First Published Oct 7, 2018, 11:36 AM IST

పండగల వేళ ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కోవాలని.. ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనాలని కలలు కంటూ ఉంటారు. పోనీ సినిమాకు వెళ్లాలని ఉన్నా.. ఆన్లైన్లో ఆర్డరిచ్చి నచ్చిన తిండి తినాలనుకున్నా.. కానీ, ధరలు అధికంగా కనిపిస్తున్నాయి. కానీ సమయానికి సరిపడా డబ్బు అందుబాటులో ఉండదు.

కానీ ప్రస్తుతం బ్యాంకింగ్‌ సంస్థలతోపాటు ఈ – కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ముందుకు వచ్చాయి. కొనాలనుకున్నప్పుడు కొని, తర్వాత చెల్లించే వీలుండే వెసులుబాటును ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఉండే ఎన్నో యాప్లు అందుబాటులోకి తెస్తున్నాయి. ముందు కొనుగోలు చేసి తర్వాతే చెల్లించండని ఉత్సాహపరుస్తున్నాయి.

సాధారణంగా ఒక వస్తువు కొనాలనుకుంటే రెండు మార్గాలుంటాయి. చేతిలో డబ్బు ఉంటే అప్పటికప్పుడే చెల్లించేస్తాం. వస్తువును ఇంటికి తెచ్చుకుంటాం. లేకపోతే క్రెడిట్ కార్డును వాడుకుంటాం. పూర్తి బిల్లు చెల్లించగలిగితే ఒకేసారి చెల్లిస్తాం.. కాకుంటే నెలసరి వాయిదాల పద్ధతిలోకి మార్చుకుంటాం.

వీటికి భిన్నంగా పలు సంస్థలు మనం కొనుగోళ్లకు అప్పులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. అంటే, చేతిలో డబ్బు ఉండక్కర్లేదు.. క్రెడిట్ కార్డుతో కూడా పనిలేదన్నమాట. రూ.500 నుంచి రూ.లక్ష వరకూ ఎంతైనా తీసుకోవచ్చు. కాకపోతే 14 రోజుల్లోగా తిరిగి చెల్లించేయాలి. ఇదంతా వడ్డీ లేకుండానే సుమా!

మరి, ఇలా ఇచ్చేవారికి లాభం ఏమిటన్నది మీ సందేహమా? మీరు లావాదేవీ చేసిన వెబ్సైట్ లేదా కొన్న వస్తువును తయారు చేసిన సంస్థ నుంచి వారికి ఎంతో కొంత అందుతుందిలెండి! సినిమా టిక్కెట్లు, రైల్వే టిక్కెట్ల బుకింగ్, ఆన్లైన్లో ఆహార పదార్థాలు కొనడం ఇలా అన్నింటికీ ఇప్పుడు పే లేటర్ వెసులుబాటు ఉంది.

క్రమంగా ఆన్లైన్ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది వీటికోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నా.. బిల్లు చెల్లించడంలో ఆలస్యమైతే, ఈఎంఐగా మార్చుకున్నప్పుడు అధిక వడ్డీలను భరించాల్సి వస్తోంది.

తాత్కాలికంగా ఐదారు రోజులకు డబ్బు సర్దుబాటు అయ్యే సందర్భాల్లో క్రెడిట్ కార్డును వాడటం వల్ల పెద్ద ప్రయోజనమూ ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులో తగినంత బ్యాలెన్స్ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు పే లేటర్ సౌకర్యం ఉపయోగపడుతుంది.

ఈ యాప్లన్నీ సాధారణంగా  20-35 ఏళ్లలోపు వారినే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ వయస్కులు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్లు చేస్తుండటమే అందుకు కారణం. పైగా ఖర్చు పెట్టేందుకు కూడా వీరే ముందుంటారు. దీంతోపాటు ఇప్పుడిప్పుడే ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నవారినీ, ఎలాంటి క్రెడిట్ కార్డులు లేనివారిని ఆకట్టుకునేందుకు వారికి పలు వెసులుబాటునూ కల్పిస్తున్నాయి. 
 
యువకులు ప్రస్తుతం ఒక్క రోజులో ఎన్నో ఆన్లైన్ లావాదేవీలు చేస్తుంటారు. ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు కొంటారు.. ఆహార పదార్థాలకు ఆర్డర్ ఇస్తారు. అవసరమైన వస్తువులను తీసుకుంటారు.. క్యాబ్ సేవలను వినియోగించుకుంటారు.. విహార యాత్రలకు సంబంధించి హోటల్ బుకింగ్ చేసుకుంటారు.. ఇలాంటివన్నీ చేసేటప్పుడు ప్రతిసారీ క్రెడిట్ కార్డు వివరాలు తెలియజేయాలి. వేగాన్ని కోరుకుంటున్న నేటి యవత ప్రతిసారీ ఈ వివరాలను నమోదు చేయాలంటే.. కాస్త చిరాకు పడతారు.

ఇలాంటివారికి ఒకే క్లిక్తో చెల్లింపు పూర్తయ్యేలా పే లేటర్ యాప్లు ఉపయోగపడుతున్నాయి. అంతా కలిపి ఒకేసారి బిల్లు చెల్లించడం కూడా యువతను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వేగంగా లావాదేవీలను పూర్తి చేయాల్సిన సందర్భంలో ఇవి మరింత ప్రయోజనం కల్పిస్తున్నాయి. కేవలం ఏదైనా సేవలు, వస్తువుల కొనుగోళ్లకే తప్ప.. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడంలాంటివి వీటితో సాధ్యపడవు. 

ముందు ఇష్టమైన, అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి తర్వాత చెల్లించమని సూచిస్తున్న సంస్థలు బ్యాంకింగేతర రుణ సంస్థల్లాంటివి. ఇవి కూడా క్రెడిట్ కార్డు తరహాలోనే పనిచేస్తాయి. కాబట్టి, మన దగ్గర్నుంచి ఏ విధమైన అధిక రుసుములూ వసూలు చేయవు. కానీ, లావాదేవీ పూర్తయిన 14 రోజుల్లోగా ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఒకవేళ ఈ వ్యవధి దాటితే నూటికి 3శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు రూ. 10వేల నుంచి రూ.25,000 వరకూ పే లేటర్ ఖాతాలో జమ చేస్తూ 30 రోజుల వరకూ వ్యవధినిస్తోంది.

మనదేశంలో ఈ తరహా విధానం ఇంకా కొత్తదే. అయితే వేగంగా వృద్ధి చెందుతోంది. కొన్ని స్టార్టప్‌ సంస్థలు ఇందులో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈపేలేటర్, సింపుల్, లేజీపే లాంటివి ఇందుకు ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇందులో ఈపేలేటర్ ప్రముఖ వెబ్సైట్ ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది కూడా. స్టార్టప్‌లే కాకుండా.. ఐసీఐసీఐ బ్యాంకు, మొబైల్ వ్యాలెట్ పేటీఎం వంటివి కొంతమంది ప్రత్యేక ఖాతాదారులకు ఆహ్వానాలు పంపిస్తూ ఈ వెసులుబాటును కల్పిస్తున్నాయి.

అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ దిగ్గజాలు కూడా ఇటువంటి వెసులుబాటునే కల్పిస్తున్నాయి. క్రెడిట్ కార్డులపైనే కాకˆ డెబిట్ కార్డులపైనా ఈఎంఐ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ రెండింటితో అవసరం లేకుండానూ రూ.60వేల వరకూ అరువు ఇస్తున్నాయి. నమ్మకమైన ఖాతాదారులను ఇందుకు ఎంచుకుంటున్నాయి.

ముఖ్యంగా రానున్న పండగల సీజన్ను ఉపయోగించుకుంటున్నాయి. ‘కార్డ్లెస్ క్రెడిట్’ పేరుతో ఇస్తున్న ఈ సౌకర్యం వల్ల ముఖ్యంగా మొబైళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతాయని ఈ సంస్థలు భావిస్తున్నాయి. 3-5 నెలల్లోపు తిరిగి చెల్లించే వీలు కల్పిస్తున్నాయి.

పే లేటర్ యాప్లలోకి వెళ్లి.. ముందుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి. ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డునూ అదనంగా అడుగుతుంటారు. ఈ మెయిల్, మొబైల్ ఫోనులాంటి అడిగిన వివరాలను పేర్కొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

ఈ వివరాలన్నింటినీ వెంటనే ఆయా యాప్లు మీ క్రెడిట్ స్కోరు.. గతంలో చేసిన కొనుగోళ్ల వివరాలు తదితరాలన్నీ కొన్ని క్షణాల్లో తనిఖీ చేసుకుంటాయి. అవన్నీ సరిగా ఉంటే.. వెంటనే రూ.20వేల వరకూ మీ పే లేటర్ ఖాతాలో జమ చేస్తాయి. అంతే.. ఈ పే లేటర్ సంస్థలతో ఒప్పందం ఉన్న ఈ కామర్స్ లేదా ఇతర సేవలను అందించే వెబ్సైట్లలో చెల్లింపు చేసేటప్పుడు పే లేటర్ వెసులుబాటును వినియోగించుకోవడమే. బ్యాంకులో ఇప్పటికే కేవైసీ నిబంధనలు పూర్తి చేసి ఉంటాం కాబట్టి, దీన్ని వెంటనే వాడుకోవచ్చు.

నచ్చితే వెంటనే కొనాలనే నిర్ణయం తీసుకుంటున్న నేటి యువత ఇలాంటి తక్షణ రుణాలతో అప్పులను అలవాటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు. అత్యవసరాల్లోనే ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలి కానీ.. సరదా కొనుగోళ్ల కోసం కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గడువులోపు బాకీ తీర్చాలని, లేకపోతే వడ్డీ భారం మోయలేనంత అవుతుందని మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios