న్యూ ఢీల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ, నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ కరోనా సంక్షోభంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా డైరెక్టర్ల బోర్డు పర్మనెంట్ ఉద్యోగులకు ఆరు నెలల నుండి రెండేళ్ల కాలానికి వేతనం లేని సెలవు (ఎల్‌డబ్ల్యుపి) పథకాన్ని ఆమోదించింది.

ఇది ఐదు సంవత్సరాల వరకు పొడిగించే ఆవాకాశం కూడా ఉన్నట్లు తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది."ఈ పథకం (ఎల్‌డబ్ల్యుపి) పర్మనెంట్ ఉద్యోగులకు వేతనాలు, భత్యాలు లేకుండా సెలవు మంజూరు చేయడానికి, ఆరు నెలల కాలానికి లేదా రెండు సంవత్సరాల కాలానికి  విచక్షణతో ప్రవేశపెట్టబడింది.

జూలై 14న ఎయిర్ ఇండియా స్టాఫ్ నోటీసులో ఈ విషయాన్ని తెలిపింది."బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 2020 జూలై 7న జరిగిన 102వ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించింది, దీని ద్వారా ఉద్యోగులు ఆరు నెలల నుండి లేదా రెండు సంవత్సరాల వరకు వేతనం లేకుండా సెలవు తీసుకోవచ్చు.

also read కరోనావైరస్, లాక్ డౌన్ వల్ల రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గుతాయనేది భ్రమే... ...

ఇది ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు అని కూడా"నోటీసులో తెలిపింది.అంతేకాదు ఆగస్టు 15 లోపు ఎల్‌డబ్ల్యూపీ ఉద్యోగుల జాబితాను  అందించాలని  సంబందిత అధికారులను అదేశించింది.

కాగా కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగం కుదేలైంది. కరోనా కట్టిడికి అమలు చేసిన లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధానంగా విమానయాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోవడంతో ఆదాయం భారీగా పడిపోయింది.

 మహమ్మారి కారణంగా దేశీయంగా విమానయాన సంస్థలు 2020- 2022 మధ్యకాలంలో 1.3 ట్రిలియన్ల రూపాయల ఆదాయ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం ఒక నివేదికలో వెల్లడించింది. ఎయిర్ ఇండియా తన జాబితాలో 11,000 మంది శాశ్వత ఉద్యోగులను కలిగి ఉంది, ఇందులో దాని అనుబంధ సంస్థల సిబ్బంది కూడా ఉన్నారు.