Asianet News TeluguAsianet News Telugu

సంక్షోభంలో జెట్ ఎయిర్‌వేస్... షేర్లు తనఖా పెట్టిమరీ రూ.700 కోట్ల రుణం

తొలి నుంచి నిర్మించిన సామ్రాజ్యం ‘జెట్ ఎయిర్వేస్’ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా మేనేజ్మెంట్ వదులుకునేందుకు నరేశ్ గోయల్ సిద్ధంగా లేరు. ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అందుకే తన వాటా కుదుటబెట్టుకుని రూ.700 కోట్ల రుణం ఇవ్వాలని ఎస్బీఐని కోరారు.

Naresh Goyal refuses to cede control of Jet Airways
Author
Mumbai, First Published Jan 19, 2019, 12:08 PM IST

ముంబై: దేశీయ రెండో ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం ఎడతెగని వివాదంగా కొనసాగుతూనే ఉన్నది. సంస్థ ప్రమోటర్ నరేశ్ గోయల్ సంస్థపై యాజమాన్య హక్కులను కోల్పేయేందుకు సిద్ధంగా లేరు. జెట్ ఎయిర్వేస్ భాగస్వామ్య సంస్థ 'ఎతిహాద్'.... వాటా తగ్గించుకుని యాజమాన్య హక్కులను వదులుకోవాలని నరేశ్ గోయల్‌ను కోరింది. కానీ అందుకు నిరాకరించిన నరేశ్ గోయల్.. ఎస్బీఐ వద్ద తన వాటా షేర్లను తనఖా పెట్టి రూ.700 కోట్ల రుణం స్వీకరించేందుకు సిద్దమయ్యారు. 

యాజమాన్యంపై తన హక్కులను కొనసాగించేందుకు జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ నరేశ్ గోయల్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)కి ఒక ఫైనాన్సియల్ ఆఫర్ ప్రతిపాదించారు. జెట్ ఎయిర్వేస్ సంస్థకు అత్యధికంగా రుణాలిచ్చిన బ్యాంకర్లలో ఎస్బీఐ పెద్దది కావడం గమనార్హం. సంస్థలో తన వాటా కనీసం 25 శాతం తనఖా పెట్టుకుని రూ.700 కోట్ల రుణం ఇవ్వాలని ఎస్బీఐని కోరారు. 

అయితే ఎస్బీఐని రుణం ఇవ్వాలని కోరిన నరేశ్ గోయల్.. ప్రమోటర్‌గా తనకు సంస్థలో 10 శాతం, అంతకంటే తక్కువ షేర్లు కలిగి ఉంటే ప్రయోజనాలు ఉండవని, హక్కులు కూడా ఉండవని పేర్కొన్నారు. కానీ ఈ రూమర్లపైస్పందించబోమని జెట్ ఎయిర్వేస్, ఎతిహాద్ అధికార ప్రతినిధులు తెలిపారు. 

జెట్ ఎయిర్వేస్ సంస్థను రుణాల ఊబి నుంచి రక్షించడానికి జరుగుతున్న చర్చలు ఎప్పటికప్పుడు అసంపూర్ణంగానే ముగుస్తున్నాయి. నిధుల సేకరణకు గల వివిధ రకాల ఆప్షన్లను జెట్ ఎయిర్వేశ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాము జెట్ ఎయిర్వేస్ రుణ చెల్లింపుల ప్రణాళిక అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నతెలుస్తోంది. అయితే జెట్ ఎయిర్వేస్ బతికి బట్టగట్టాలంటే సంస్థలో నరేశ్ గోయల్ తన వాటాను తగ్గించుకోవాల్సిందే.. అప్పుడు ఎతిహాద్ వాటా పెంచుకునే అవకాశం లేకపోలేదు. 

రెండున్నర దశాబ్దాలుగా సంస్థను నడుపుతున్న నరేశ్ గోయల్.. జెట్ ఎయిర్వేస్ నిర్వహణపై పూర్తి పట్టు కలిగి ఉన్నారు. మొదటి నుంచి సంస్థను నిర్మించుకుంటూ వచ్చిన నరేశ్ గోయల్‌తో జెట్ ఎయిర్వేస్ సంస్థలో 24 శాతం వాటాను కొనుగోలు చేసిన ఎతిహాద్ సంబంధాలు చెప్పుకోదగినంత మెరుగ్గా ఏమీ లేవని తెలుస్తోంది. అంత తేలిగ్గా యాజమాన్య హక్కులను నరేశ్ గోయల్ వదులుకునేలా కనిపించడం లేదని, అందువల్లే ఎతిహాద్ యాజమాన్యానికి కూడా ఆ సంస్థలో ఈక్విటీ కొనుగోలు చేయాలని లేదని వారి సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios