న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఒక గాడిన పడినట్లు కనిపిస్తోంది. ఆ సంస్థ భాగస్వామ్య సంస్థ ఎతిహాద్ తన 24 శాతం వాటాకు అదనంగా వాటా పెంచుకునేందుకు సరైన వాటా ఇచ్చేందుకు బోర్డు నుంచి తప్పుకునేందుకు సిద్ధమేనని జెట్ ఎయిర్వేస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) నరేశ్‌ గోయల్‌ తెలిపినట్లు సమాచారం. 

షేర్‌కు రూ.150 మాత్రమే ఇస్తానని ఎతిహాద్‌ పేర్కొనడమే నరేశ్ గోయల్‌కు రుచించడం లేదని తెలుస్తోంది. సంస్థతోపాటు వాటాదారులకు మేలు కలిగేలా చూడాలన్నదే నరేశ్ గోయల్‌ యత్నం అని తెలుస్తోంది. 

యాజమాన్యం చేతులు మారితే, మరో 25 శాతం వాటాలు కొనేందుకు కొత్త పాలకవర్గం ఓపెన్‌ ఆఫర్‌కు రావాలి. దీనినుంచి మినహాయింపు ఇవ్వాలనీ ఎతిహాద్‌ కోరుతోంది. ఎతిహాద్‌ ఆఫర్‌ ప్రకారం జెట్‌ ఎయిర్వేస్‌ విలువ రూ.1,800 కోట్లే అవుతుంది.

జెట్ ఎయిర్వేస్ రుణదాతల అంచనా ఇంతకంటే చాలా అధికం. జెట్‌ ఎయిర్వేస్‌కు బ్యాంకులు ఇచ్చిన రుణాలే రూ.8,200 కోట్లు ఉన్నాయి. గత వారం జెట్‌ రుణదాతల బృందానికి సారథ్యం వహిస్తున్న ఎస్బీఐతో ఎతిహాద్‌ చర్చలు జరుపుతూ ఒక్కో షేర్‌కు రూ.150 చొప్పున వెచ్చించి అదనపు వాటాను కొనుగోలు చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలో నరేశ్ గోయెల్‌ సంస్థపై తన పట్టును కొనసాగించడానికి, ఎక్కువ మొత్తానికి తన వాటాను విక్రయించేందుకు మొండిగా ప్రవర్తించడం లేదని తెలుస్తోంది. తన వాటా విక్రయానికి గరిష్ట ధర వచ్చేంత వరకేనని ఆయన వేచి చూస్తున్నట్టు నరేశ్ గోయల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గరిష్ట విలువను ఆర్జించేందుకు ఆయన ఎక్కువగా చర్చలు జరుపుతున్నట్టుగా ఆ వర్గాలు వెల్లడించాయి. 

కంపెనీ టేక్‌వర్‌ కారణంగా మేనేజ్‌మెంట్‌లో మార్పు వస్తే మాత్రం కొత్త విక్రేత సాధారణ ప్రజానీకానికి 25% వాటా కొనుగోలు నిమిత్తం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. సెబీ నిబంధనల మేరకు ఒపెన్‌ ఆఫర్‌ నిమిత్తం నాలుగు విభిన్న పరిమతులను పాటించాలి. వీటి ప్రకారం చూస్తే ఎతిహాద్‌ సంస్థ ప్రకటించిన ధర కంటే ఎక్కువగానే చెల్లించి వాటాను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జెట్‌లో వాటా కొనుగోలును ఎతిహాద్‌ సంస్థ భారంగానే పరిగణించే అవకాశం కనిపిస్తోంది.

జెట్‌ స్టాక్‌ ధర గడిచిన 52 వారాల్లో రూ.163 నుంచి రూ.830 మధ్య పలికింది. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి షేరు ఒక్కింటి ధర రూ.276గా నమోదైది. ఈ నేపథ్యంలో ఎతిహాద్‌ సమ్మతించిన రూ.150 ధర అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు. సరికదా సెబీ టేక్‌ ఓవర్‌ కోడ్‌ దీనికి సమ్మతించదు. ఈ నేపథ్యంలో సెబీ అనుమతి లభించడం కష్టమేనని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. స్పైస్‌జెట్‌ కొనుగోలు సమయంలో సెబీ కోడ్‌ను పక్కనబెట్టి టేక్‌ ఓవర్‌ నిబంధనలకు సంబంధించి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రమోటర్‌ అజయ్ సింగ్‌కు మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ విషయంలో సెబీ ఎలా వ్యవహరిస్తుందన్నది వేచి చూడాలి.