Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్‌వేస్‌ దక్కించుకునే పనిలో నరేశ్ గోయల్! ‘టాటా’ ఆసక్తి

ఆర్థిక సంక్షోభంతో చిక్కుకున్న జెట్‌ ఎయిర్వేస్‌ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం తీసేసుకున్నది. అయితే దాని నిర్వహణకు సామర్థ్యం గల బిడ్డర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు 26 ఏళ్ల పాటు సంస్థను నడిపిన సామర్థ్యం గల జెట్‌ మాజీ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ సైతం దానిపై మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

Naresh Goyal Likely To Submit Bid For Stake In Jet Airways: Report
Author
Mumbai, First Published Apr 12, 2019, 10:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై: జెట్‌ ఎయిర్వేస్‌లో వాటా కొనుగోలు కోసం చాలా మంది పోటీ పడవచ్చని మార్కెట్‌వర్గాలు అంటున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు జెట్‌ను దక్కించుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే చేజారిన కంపెనీకి తిరిగి దక్కించుకునేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ కూడా బరిలోకి దిగనున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొనడమే ఆసక్తి కర పరిణామం. 

శుక్రవారం నరేశ్‌ గోయల్ బిడ్‌ సమర్పించే అవకాశం ఉంది. ఈ బిడ్డింగ్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని, కావాలనుకుంటే ఎయిర్‌లైన్స్‌ ప్రమోటర్‌ కూడా పోటీపడవచ్చని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.
 
జెట్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్. జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు కోసం ప్రారంభ బిడ్లు సమర్పించేందుకు తొలుత బుధవారం నిర్దేశించిన గడువును శుక్రవారం వరకు పొడిగించారు. 

ఇందులో అర్హత పొందిన బిడ్డర్లు ఈ నెల 30నాటికి బైండింగ్‌ (విధిగా పాటించాల్సిన) బిడ్లను సమర్పించాలి. బ్యాంకుల కన్సార్షియం తరఫున ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్‌ ద్వారా జెట్‌ ఎయిర్వేస్లో 75 శాతం వరకు వాటాను ఆఫర్‌ చేస్తోంది.
 
ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలైన టీపీజీ క్యాపిటల్‌ అండ్‌ ఇండిగో పార్టనర్స్‌, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌), ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే బిడ్లను సమర్పించాయని సమాచారం. ఎయిర్‌ కెనడా, డెల్టా ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఏషియా కూడా ప్రారంభ బిడ్లు సమర్పించే అవకాశం ఉంది. 

జెట్‌పై టాటా గ్రూపు సైతం ఆసక్తిగా ఉన్నదని మార్కెట్లో ఊహాగానాలు నెలకొన్నాయి. ఇప్పటికే విస్తారా, ఎయిర్‌ ఏషియాలో ప్రధాన వాటాలు కలిగిన టాటా గ్రూపు.. మరో ఎయిర్‌లైన్స్‌ను కొనుగోలు చేయడం కంటే ఉన్నవాటి అభివృద్ధిపై దృష్టిపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
 
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటాను తనఖా పెట్టారు. 26.01 శాతం వాటాకు సమానమైన 2.95 కోట్లకు పైగా షేర్లను బ్యాంక్‌ వద్ద గోయల్‌ తాకట్టు పెట్టారని జెట్‌ ఎయిర్‌వేస్‌ గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారమిచ్చింది. 

గత నెల 25న జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు బ్యాంకర్లు రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికలో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి నరేశ్ గోయల్‌, ఆయన సతీమణి అనితా గోయల్‌ తప్పుకున్నారు. అంతేకాదు గోయల్‌ తన చైర్మన్‌ పదవినీ వదులుకున్నారు.
 
జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం నడుస్తున్న విమానాల సంఖ్య 14కు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ విదేశీ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఉన్న అర్హతను కేంద్రం సమీక్షించనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అంతర్జాతీయ మార్గాల్లో సేవలందించే ఎయిర్‌లైన్స్‌ కనీసం 20 విమానాలు కలిగి ఉండాలి. 

ఈ విషయమై విమాన రంగ నియంత్రణ మండలి (డీజీసీఏ) నుంచి నివేదికను కోరినట్లు విమాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. జెట్‌ను ఇప్పటికే డీజీసీఏ వివరాలు కోరిందని ఆయన వెల్లడించారు. నిధుల కొరతతో తీవ్రంగా సతమతం అవుతున్న ఈ ఎయిర్‌లైన్స్‌.. అద్దె చెల్లించలేకపోవడంతోపాటు ఇతర కారణాలతో భారీ సంఖ్యలో విమానాలను నిలిపివేసింది. 

అద్దె చెల్లించక పోవడంతో తాజాగా మరో 10 విమానాలను నిలిపివేయాల్సి వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. దీంతో అద్దె చెల్లించలేక నిలిపివేసిన విమానాల సంఖ్య 79కి చేరుకుంది.
 
విమానాల కొరత కారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు సర్వీసులను నిరవధికంగా రద్దు చేసినట్లు ట్రావెల్‌ ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. దాంతో కోల్‌కతా, పాట్నా, గువాహటి, డెహ్రాడూన్‌కు జెట్‌ సర్వీసులు నిలిచిపోయినట్లు వారు చెప్పారు. 

అంతేకాదు, గురువారం నాడు అంతర్జాతీయ మార్గాల్లో నడిపే సర్వీసులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పైలట్లు వేతన బకాయిల కోసం గడువు విధించారు. సవాలక్ష సమస్యల నుంచి జెట్‌ ఎయిర్వేస్‌ బయటపడుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.
 

Follow Us:
Download App:
  • android
  • ios