రుణ సంక్షోభంలో చిక్కుకుని ఎస్బీఐ సారథ్యంలో బ్యాంకుల కన్సార్టియం చేతికి చిక్కిన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ పీకల్లోతు.. దాదాపు చరమాంకంలో చిక్కుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్‌ 15 దాకా అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడమే దీనికి కారణం. 

మరోవైపు ఇటు నరేశ్ గోయల్, అటు ఎతిహాద్ సంస్థ కూడా బిడ్ దాఖలు చేశారు.జెట్ ఎయిర్ వేస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇండిగో, స్పైస్ జెట్ వ్యూహాలు రచిస్తున్నాయి. 20 లోపు విమాన సర్వీసులు మాత్రమే నడుపడంతో అంతర్జాతీయ హోదా కొనసాగించాలా? వద్దా అన్న విషయమై కేంద్రం కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిత్వ కార్యాలయం (పీఎంఓ) అప్రమత్తమైంది. 

సంబంధిత శాఖలు, విభాగాలు, జెట్ ఎయిర్వేస్ ప్రస్తుత యాజమాన్యంలతో  అత్యవసర సమావేశానికి పీఎంఓ పిలుపునిచ్చింది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ న్రుపేంద్ర మిశ్రాను కలుసుకుని జెట్‌ ఎయిర్వేస్‌ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషించనున్నారు.

మరోవైపు తమకు జీవితాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జెట్‌ ఎయిర్‌వేస్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. దాదాపు 2000 మంది ఉద్యోగులు ముంబైలో ర్యాలీ నిర్వహించారు. తక్షణం తమకు జీతాలు చెల్లించాచి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

దీనిపై యాజమాన్యం తమకు స్పష్టతనివ్వాలని పైలట్లు, ఇతర ఉద్యోగులు అభ్యర్థించారు. అంతేకాదు మాజీ ఛైర‍్మన్‌ నరేష్‌ గోయల్‌, సీఈవో వినోద్‌ దువే,  యాజమాన్యంపై లేబర్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేశాయని సమాచారం.  

25 ఏళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఘోరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్‌ దేశీయంగానూ 10 విమానాలను రద్దు చేసింది. దీంతో అద్దె బకాయిలు చెల్లించలేక నిలిపి వేసిన విమానాల సంఖ్య 79కి చేరింది. మరోవైపు అనూహ్యంగా జెట్‌ విమానాలను రద్దు చేయడంతో విమాన ప్రయాణికుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. 

కోల్‌కతా, ముంబై విమానాశ్రయాల్లో టికెట్ల డబ్బులు రిఫండ్‌ కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో విమానాశ్రయాలు కిక్కిరిసిపోయాయి. అలాగే  రద్దయిన టికెట్ల డబ్బులను తిరిగి ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని సిబ్బంది చెబుతున్నారని ప్రయాణీకులు వాపోయారు. అసలు దీనిపై నిర్దిష్ట సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా జెట్‌ ఎయిర్‌వేస్‌లో నెలకొన్న సమస్యను పరిశీలించాలని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పౌర విమానయానశాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను  ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ సమస్యను చక్కదిద్దాలంటూ సురేష్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. 

జెట్‌ పరిస్థితులపై సమీక్ష జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ‘జెట్‌ సమస్యపై సమీక్ష జరపాలని విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను ఆదేశించాం. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించి వారికి సరైన భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం’ అని సురేశ్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. 

గురువారం వరకు 14 విమానాలతో సేవలందించిన సంస్థ శుక్రవారం కేవలం 9 విమానాలనే నడిపే స్థితికి పడిపోయింది. శుక్రవారం జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 9 విమానాలే సర్వీసులు అందిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. వీటిలో రెండు బోయింగ్‌ 737 కాగా.. మరో ఏడు ప్రాంతీయ జెట్‌ ఏటీఆర్‌లు ఉన్నాయి. 

ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులను నిలిపివేసింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు నిరవధికంగా సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

మరోపక్క టికెట్‌ కొనుగోలు చేసిన ప్రయాణికులకు సొమ్ము వాపసు కిందే జెట్‌ దాదాపు రూ. 3000 కోట్లు చెల్లించాల్సి ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనసాగించడంపై ప్రభుత్వం పరిశీలించనుంది. 

జెట్ ఎయిర్వేస్ విమానాల సంఖ్య 123 నుంచి 14కు పరిమితం కావడంతో,  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నివేదిక కోసం పౌర విమానయాన శాఖ వేచి చూస్తోంది. నివేదిక అందాక పరిశీలించి చర్యలు చేపడతామని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలా తెలిపారు. 

కనీసం 20 విమానాలుంటేనే, అంతర్జాతీయ సర్వీసులను ప్రభుత్వం అనుమతిస్తోంది. సంస్థ వద్ద ఉన్న 14 విమానాల్లో.. బోయింగ్‌ బి777 విమానాలు 7 కాగా, ఒకటి ఎయిర్‌బస్‌ ఏ330 విమానాలు. వీటిని అంతర్జాతీయ సర్వీసులకు వాడతారు. మరో 6 విమానాల్లో మూడు బీ737 ఎస్‌ మోడల్‌వి. 

జెట్‌ ఎయిర్‌వేస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి, చౌకధరల విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్‌జెట్‌లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. గిరాకీకి అనుగుణంగా ఛార్జీలు పెరగడం వల్ల అధికాదాయం వస్తుండగా, మార్కెట్‌ వాటా పెంచుకునే వీలూ ఈ సంస్థలకు కలిగింది. ఛార్జీలు తక్కువగా ఉన్న 50 నెలల్లో, దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో డబుల్ డిజిట్ వృద్ధి నమోదైంది. 

ఛార్జీలు పెరుగుతున్నందున, ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి గణనీయంగా తగ్గి, ఫిబ్రవరిలో ఐదో శాతానికి పరిమితమైంది. అయినా కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ 1123 విమానాల్లో 14 మాత్రమే రాకపోకలు సాగిస్తున్నందున, మిగతా సంస్థల విమానాలకు ప్రయాణికుల గిరాకీ అధికంగానే ఉంటోంది.

దీనికి తోడు ఛార్జీలు పెరగడంతో, మార్చి త్రైమాసికంలో విమానయాన సంస్థలకు 15 శాతం అధిక ప్రతిఫలం లభించిందని అంచనా. ఇందువల్ల ఇండిగో, స్పైస్‌జెట్‌ ఆదాయాలు, లాభాలు కూడా పెరిగే వీలుంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మాత్రం రూ.600 కోట్ల నష్టాల్లో ముగియవచ్చని భావిస్తున్నారు.

ఛార్జీల పెంపుదల వల్ల, మెట్రో మార్గాల్లో అధిక విమానయాన సర్వీసులు నిర్వహిస్తున్న ఇండిగోకు, స్పైస్‌జెట్‌ కంటే అధిక లాభం చేకూరుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల సంఖ్యలో 20 శాతం, ఛార్జీల పెరుగుదల 14 ఉండటంతో, ఇండిగో ఆదాయం మార్చి త్రైమాసికంలో 34 శాతం అధికంగా రూ.7721 కోట్లకు చేరవచ్చన్నది అంచనా. 

ఇండిగో నికర లాభం కూడా రూ.480 కోట్లుగా నమోదు కావచ్చని, ఫలితంగా ఆర్థిక సంవత్సరం మొత్తానికీ లాభాలు నమోదు చేస్తుందనీ చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం జూన్‌లో రూ.28 కోట్లు, డిసెంబర్ త్రైమాసికంలో రూ.191 కోట్ల లాభాలను ఇండిగో  ప్రకటించినా, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.652 కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసిన సంగతి విదితమే.

ఇండిగో దేశీయ మార్కెట్‌ వాటా 45 శాతంగా ఉంటుంది. అంతర్జాతీయ మార్గాల్లో రెట్టింపై ఇండిగో వాటా 8 శాతానికి చేరింది.  అధికాదాయం, మార్కెట్‌ వాటా పెంచుకునేందుకు 222 సీట్లుండే ఏ-321 నియో విమానాలు 5 ఇండిగో సమకూర్చుకుంది.

ప్రయాణికుల సంఖ్యలో 11 శాతం వృద్ధికి తోడు, ఛార్జీలు 15 శాతం పెరగడం వల్ల స్పైస్‌జెట్‌ ఆదాయ వృద్ధి మార్చి త్రైమాసికంలో 26 శాతంగా నమోదు కావచ్చని అంచనా. ఇంధన ధరలు కూడా అంతకుముందుతో పోలిస్తే, కాస్త తగ్గడం వల్ల మార్చి త్రైమాసికంలో రూ.2574 కోట్ల ఆదాయంపై రూ.85 కోట్ల లాభాన్ని ఆర్జిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ మాదిరిగానే స్పైస్‌జెట్‌ కూడా బోయింగ్‌ 737 విమానాలను కలిగి ఉండటానికి తోడు కొత్తగా మరిన్ని విమానాలను కొనుగోలు చేస్తోంది. అందువల్ల జెట్‌ ఎయిర్‌వైస్‌ నుంచి పైలట్లను చేర్చుకోవడం కూడా స్పైస్‌జెట్‌కు సులభం అవుతుంది. ఒకే తరహా విమానాలకు అయితే పైలట్లకు మరోసారి శిక్షణ అవసరం ఉండకపోవడమే ఇందుకు కారణం.