జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగేందుకు నరేశ్‌ గోయల్‌ అంగీకరించినట్లు సమాచారం. పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజార్టీ వాటా కొనుగోలు ప్రక్రియను రుణ సంస్థలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు నరేశ్‌ గోయల్‌ అంగీకరించారంటూ వచ్చిన వార్తలపై జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ రాగిణి చోప్రాను సంప్రదించగా.. తనకు ఆ విషయం తెలియదని చెప్పారు. 

ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ బిలియన్‌ డాలర్ల అప్పులు,  రుణ బాధలు, నిధుల లేమి, కనీసం పైలట్లకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో చిక్కుకున్నది. దీన్ని  చక్కదిద్దే కసరత్తులో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేష్‌ గోయెల్  సంస్థనుంచి వైదొలగనున్నారు.  

ప్రస్తుతం 51శాతం వాటా కలిగిన  ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌గా గోయల్‌ తప్పుకునేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నష్టాలతో కునారిల్లుతూ, నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్‌ ఎయిర్‌వేస్‌కు వాటా దారైన ఇతిహాద్ ఎయిర్‌లైన్స్‌ బెయిల్‌​అవుట్‌ ప్యాకేజీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో గోయల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ మేరకు  ఇరు విమానయాన​ సంస్థలు  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుయని ఇప్పటికే వార్తలు బిజినెస్‌ వర్గాల్లో వ్యాపించాయి. 

ఇతిహాద్‌కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్‌లో 24శాతం వాటా ఉండగా, మరో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయని ఇప్పటికే పలు మీడియా సంస్థలు నివేదించాయి 

ఈ డీల్‌ ఓకే అయితే ఇతిహాద్ వాటా మరింత పెరగనుంది. అటు ఫౌండర్‌ నరేష్ గోయల్ వాటా 20శాతానికి పడిపోతుంది. అలాగే రూ. 3000 కోట్ల రుణాలు అందించడానికి రుణదాతలు ముందుకొచ్చాయని సమాచారం. అయితే తాజా పరిణామంపై జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దుబే ఉద్యోగులకు ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. మున్ముందు సంస్థ మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతోందని సిబ్బంది సహనంగా ఉండాలని పేర్కొన్నారు.

కంపెనీ నిలదొక్కుకునే ముందు కొన్ని ఇబ్బందులు తప్పవని, కానీ  ఉద్యోగుల సంపూర్ణ మద్దతు, నిబద్ధతతో  సమిష్టి కృషితో భవిష్యత్‌లో బలమైన సంస్థగా నిలబడతామనే ధీమాను వ్యక్తం చేశారు. 

మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌కు అతిపెద్ద రుణదాత స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం,  ఛైర్మన్‌  నరేష్‌ గోయల్‌, ఇతిహాద్‌ సీఈఓ టోనీ డగ‍్లస్‌ మధ్య ఒక అత్యవసర భేటీని ఏర్పాటు  చేసింది.

అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందంటూ గత నెల 25వ తేదీన, కొంతమంది ముఖ్య వాటాదారులతో కలిసి ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.  

తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్ వేస్ రుణ బాధలనుండి బయట పడే అవకాశం ఉందని అంచనా. తాజాగా అద్దె చెల్లించక గురువారం మరో ఆరు విమానాల కార్యకలాపాలను ఆపేశారు. ఈ నెలలో ఇలా కార్యకలాపాలు ఆపేసిన విమానాల సంఖ్య 19కి చేరినట్లైంది. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ కొన్ని నెలలుగా తీవ్ర నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో విమానాల అద్దెలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.