Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు 21నుంచి సేవలకు పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు రెడీ

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ)సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజు పోస్టు పేమెంట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నారు. 

Narendra Modi to launch India Post Payments Bank on 21 August

ఎట్టకేలకు 21నుంచి సేవలకు పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు రెడీ
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు(ఐపీపీబీ)సేవలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రోజు పోస్టు పేమెంట్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించనున్నారు. ప్రతి జిల్లాలో కనీసం ఒక శాఖ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక సేవలను గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ చేసేందుకు పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

అతిపెద్ద నెట్‌వర్క్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు సొంతం

పూర్తిస్థాయిలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) సేవలు అందుబాటులోకి వస్తే దేశంలోకెల్లా అతిపెద్ద నెట్ వర్క్ గల బ్యాంక్ ‘ఐపీపీబీ’ నిలుస్తుంది. 650 పోస్టాఫీసుల్లో ఏర్పాటయ్యే బ్యాంకు శాఖలకు పోస్టాఫీసుల అనుబంధ ప్రాంతాల్లో అదనంగా 3,250 యాక్సెస్ పాయింట్లను అందుబాటులోకి తేనున్నది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 11 వేల మంది పోస్ట్ మ్యాన్లు ఇంటి వద్దనే బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకు రానున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్జీఏ) వేతనాల చెల్లింపులకు ఈ బ్యాంకును ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. వ్యక్తిగతంగా రూ. లక్ష, చిన్న వ్యాపారులు రూ. లక్ష డిపాజిట్ చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతిని ఇచ్చింది. 

1.55 లక్షల పోస్టాఫీసుల నుంచి ఇలా సేవలు

‘ఆగస్టు 21న ప్రధానమంత్రి ఐపీపీబీని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రెండు శాఖలను ప్రయోగాత్మకంగా నడుపుతున్నాం. త్వరలోనే దేశవ్యాప్తంగా 648శాఖలను ప్రారంభిస్తాం. ప్రతి జిల్లాలో ఒక ఐపీపీబీ కచ్చితంగా ఉంటుంది’ అని సమాచార మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐపీపీబీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో 1.55లక్షల పోస్టాఫీస్‌లు ప్రజలకు ఆర్థిక సేవలను అందించనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం అన్ని పోస్టాఫీస్‌లను పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఐపీపీబీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారు సమీప పోస్టాఫీస్‌కు వెళ్లి డిజిటల్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసే సౌకర్యాలను పొందవచ్చు. ఎయిర్‌టెల్‌, పేటీఎంల తర్వాత అనుమతి పొందిన మూడో పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ. ఏ బ్యాంకు నుంచైనా ఆర్‌టీజీసీ, ఎన్‌ఈఎఫ్‌టీ, ఐఎంపీస్‌ల ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. పెన్షన్లు విత్ డ్రా చేసుకోవడంతోపాటు. భారత జాతీయ చెల్లింపుల సంస్థ పరిధిలోని అన్నిరకాల యుటిలిటీ సేవలను ఆన్ లైన్ లో పొందొచ్చు. 

కనీస నిల్వల లేమి సాకుతో రూ.5000 కోట్లు వసూలు చేసిన బ్యాంకులు

కనీస సగటు నిల్వలు లేవనే సాకుతో ఖాతాదారుల నుంచి దేశంలోని బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన మొత్తం జరిమానా సుమారు అక్షరాలా రూ.5,000 కోట్లు అని తాజాగా వెల్లడైన ఓ నివేదిక ద్వారా తెలిసింది. అందులో భారతీయ స్టేట్‌ బ్యాంక్ (ఎస్బీఐ) వసూలు చేసిన జరిమానా దాదాపు సగం వరకూ ఉంది. ఆ బ్యాంకు ఏడాదిలో మొత్తం రూ.2,433.87 కోట్ల జరిమానాను వసూలు చేసి జరిమానా వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనే ఎస్బీఐ రూ.1,700 కోట్లు వసూలు చేసింది. దీంతో విమర్శల సాకుతో కనీస నిల్వల మొత్తాన్ని తగ్గించినా జరిమానాలను విధిస్తూనే ఉన్నదన్న మాట నిజం.  ప్రైవేట్ రంగ బ్యాంకులు యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రాబట్టిన ఛార్జీలు 30 శాతంగా ఉన్నాయి. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ రూ.590.84 కోట్లు రాబట్టి ఎస్‌బీఐ తర్వాత స్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2016-17లో రూ.619.39 కోట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసింది.

ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకింత సంయమనం

ఇక యాక్సిస్‌ బ్యాంకు రూ.530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.317.6 కోట్లు వసూలు చేశాయి. గత ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీన ఎస్బీఐ ఖాతాదారుల కనీస సగటు నిల్వల నిబంధనలను సవరించి అధిక మొత్తంలో వసూలు చేయడంతో విమర్శలు వచ్చాయి. దీంతో ఆ ఛార్జీలను తగ్గిస్తూ 2017 అక్టోబర్‌ ఒకటో తేదీన ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన కింద కొన్ని కోట్ల ఖాతాలకు కనీస సగటు నిల్వల నిబంధనలు వర్తించవు. భారీ మొత్తంలో బ్యాంకులు జరిమానా వసూలు చేశాయి. ఒఖవైపు ప్రధానమంత్రి పిలుపుతో జన్‌ధన్‌ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో 30 కోట్ల ఖాతాలు కొత్తగా ఓపెన్‌ కాగా, ఇతర వినియోగదారులపై ఈ జరిమానాలేమిటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. 

నోట్ల రద్దుతో జరిగిన నష్టం పూడ్చుకునేందుకు బ్యాంకుల యత్నం

2016, నవంబర్‌ 8న రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని మోడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంకింగ్‌ కార్యకలాపాల్లో కొంత కాలంపాటు స్తబ్దత ఏర్పడింది. రద్దయిన నోట్లను వెనక్కి తీసుకుంటూ కొత్త నోట్లను పౌరులకు అందజేసే క్రమంలో బ్యాంకుల్లో ఇతర లావాదేవీలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐలాంటి కొన్ని బ్యాంకులు తమకు జరిగిన నష్టాన్ని ఖాతాదారులపై రుద్దేందుకు యత్నించాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం తనకేమీ తెలియదన్నట్లు మౌనం వహించింది. అప్పటికే నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు బ్యాంకుల చర్య పుండుమీద కారం చల్లినట్టుగా బాధ పెట్టింది. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి సెగ బ్యాంకులను తాకింది. దాంతో, జరిమానాల విషయంలో మిగతా బ్యాంకులు కొంత సంయమనంతో వ్యవహరించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios