Asianet News TeluguAsianet News Telugu

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ మైసూర్ అతివ.. తొలి మహిళ గీతా గోపీనాథ్

మైసూరులో పుట్టి పెరిగిన గీతా గోపీనాద్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె నియామకం మొత్తం అతివలకే రోల్ మోడల్ అని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టినా లాగార్డే పేర్కొన్నారు.
 

Mysore-Born Gita Gopinath Joins IMF As First Woman Chief Economist
Author
Washington, First Published Jan 9, 2019, 8:24 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థలో చీఫ్ ఎకనమిస్ట్గా తొలి మహిళ నియమితులయ్యారు. భారత్లోని కర్ణాటక రాష్ట్రం మైసూర్ ప్రాంతానికి చెందిన గీతా గోపీనాథ్కు ఆ పదవి దక్కింది. ఐఎంఎఫ్లో అత్యున్నత పదవి పొందిన తొలి మహిళగా గీత ఘనత సాధించారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్.

ఐఎంఎఫ్ పరిశోధన విభాగం డైరెక్టర్గా పనిచేసిన మౌరీ ఆస్టెఫెల్డ్ డిసెంబరు 31 పదవీ విరమణ పొందారు. ఆయన పదవీ విరమణ తర్వాత గీతకు చీఫ్ ఎకనమిస్ట్గా పదవి దక్కింది.గత ఏడాది అక్టోబరు 1వ తేదీనే గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా  నియమించుకుంటున్నట్లు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టీన్ లగార్డే  తెలిపారు. ఆమె ప్రపంచంలోని అత్యుత్తమ ఆర్థికవేత్తల్లో ఒకరని ప్రశంసించారు.

గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్‌కు  11వ చీఫ్ ఎకనమిస్ట్ కానున్నారు. తనకు ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నానని గీత ఆనందం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు పెద్ద సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థల (ఎంఎన్సీ)కు ఇబ్బందులు పెరిగాయని గీత తెలిపారు. 

ఐఎంఎఫ్‌లో ఆమె నియామకం కాకతాళీయం కాదని, ప్రపంచంలోని మహిళలందరికీ రోల్ మోడల్ గీతా గోపీనాథ్ అని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిస్ లాగార్డే పేర్కొన్నారు. మేధోసంపత్తితో కూడిన విధాన నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్తానని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు.
 
అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలో డాలర్ వంటి డామినెంట్ కరెన్సీల పాత్ర గురించి తెలుసుకుంటానని, డాలర్ కొరతతో తలెత్తే సమస్యల పరిష్కారానికి చర్యలు చూపుతామని గీతా గోపీనాథ్ వివరించారు.  అత్యధిక దేశాలు అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో రుణాలు తీసుకుంటారు. 

అయితే ప్రపంచీకరణ నుంచి ప్రపంచదేశాలన్నీ తిరోగమనం దిశగా ప్రయాణిస్తున్నాయని, దీనికి కారణాలను అన్వేషించి చర్యలు చేపట్టాల్సి ఉందని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు.  కొన్ని నెలలుగా అమెరికా, చైనా పరస్పరం విధించుకుంటున్న వాణిజ్య పన్నులతో అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొన్నదన్నారు. 

అద్భుతమైన అకడమిక్‌ నైపుణ్యాలు, అంతర్జాతీయంగా అపారమైన అనుభవం, నాయకత్వ లక్షణాలు కలిగిన గీతా గోపినాథ్‌.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థికవేత్తల్లో ఒకరని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టీనా లగార్డే అన్నారు. 
 
ప్రపంచ దేశాలు గ్లోబలైజేషన్‌ నుంచి వెనక్కి తగ్గుతుండటాన్ని నివారించడం ఐఎంఎఫ్‌ ముందున్న పలు ప్రధాన సవాళ్లలో ఒకటని ది హార్వర్డ్‌ గెజిట్‌కిచ్చిన ఇంటర్వ్యూలో గీత తెలిపారు. గత 50–60 ఏళ్లలో ప్రపంచ దేశాలు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వాణిజ్యం పెంచుకోవడం వంటివి చేశాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లోబలైజేషన్‌ నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గుతున్నాయి.

‘చైనా తదితర దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించడం, ఆయా దేశాలు కూడా అదే రీతిలో స్పందించడం కొన్ని నెలలుగా చూస్తున్నాం. దీంతో వాణిజ్య విధానాలపై అనిశ్చితి పెరుగుతోంది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం పెరగడం వల్ల అంతర్జాతీయంగా పేదరికం తగ్గినా.. దాని ప్రభావంతో అసమానతలు పెరిగిపోయాయన్న ఆందోళన ఉంది.

ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేందుకు తగు చర్యల అవసరం‘ అని గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. అమెరికా వడ్డీ రేట్లను పెంచుతుండటం వల్ల వర్ధమాన దేశాలపై పడుతున్న ప్రభావాలు, వాణిజ్యంలో డాలర్‌ ఆధిపత్య ప్రభావాలు మొదలైన వాటిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.    

Follow Us:
Download App:
  • android
  • ios