Asianet News TeluguAsianet News Telugu

ముఖేశ్ ఇన్ టాప్: రోజు ఆదాయం అక్షరాల రూ.300 కోట్లంట!

ముకేశ్ అంబానీ వరుసగా ఏడోసారి బార్ క్లేస్ హురన్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. గమ్మత్తేమిటంటే హిందూజా, మిట్టల్, ప్రేమ్ జీ ఆస్తులన్నీ కలిపినా ముకేశ్ అంబానీ ఆదాయం ఎక్కువే. ఎన్నారైల్లో హిందూజా కుటుంబం టాప్‌గా నిలిచింది.
 

Mukesh Ambani Tops Barclays Hurun Rich List For 7th Time In A Row
Author
Mumbai, First Published Sep 26, 2018, 7:58 AM IST

వాణిజ్య పరంగా, రికార్డుల పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ మరో రికార్డును నమోదు చేసుకున్నారు. గత ఏడాది కాలంగా ఒకరోజుకు రూ.300 కోట్లు ఆదాయం సంపాదిస్తున్నారని బార్‌క్లేస్‌ హ్యురన్‌ ఇండియా సంస్థ ఈ ఏడాది దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో పేర్కొంది. ఆయన మొత్తం ఆస్తి రూ.3,71,000 కోట్లతో వరుసగా ఏడో ఏడాది కూడా దేశీయ ధనవంతుల్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు.

గతేడాదితో పోలిస్తే జియో పుణ్యమా? అని రిలయన్స్ షేర్ 45 శాతం పెరుగడం గమనార్హం. జాబితాలో తర్వాతీ స్థానంలో ఉన్న ముగ్గురు కార్పొరేట్ సంస్థల అధినేతల సంపద కంటే ముఖేశ్‌ అంబానీ ఆస్తి ఎక్కువే కావడం మరో విశేషం. అంబానీ తర్వాతీ స్థానాల్లో వరుసగా ఎస్పీ హిందూజా ఆస్తి రూ.1,59,000 కోట్లు, ఎల్‌ఎన్‌ మిట్టల్‌ సంపద 1,14,500 కోట్లు, విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ ఆస్తి రూ.96,100 కోట్లుగా నమోదైంది.

రూ.89,700 కోట్ల సంపదతో సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ సంఘ్వీ ఐదో స్థానంలో ఉన్నారు. ఈయన గతేడాది కన్నా మూడు స్థానాలు వెనకబడ్డారని బార్ క్లేస్ నివేదిక తెలిపింది. సుజ్లోన్ సంస్థలో పెట్టిన వాటాలు 50 శాతానికి పైగా నష్టపోవడంతోనే దిలీప్ సంఘ్వీ తన వాటాలను కోల్పోయారు. కాకపోతే సన్ ఫార్మా తెచ్చి పెట్టిన లాభాలు.. సుజ్లోన్ లో ఆయన షేర్ల పతనాన్ని సరిచేసింది. 

ఆరో స్థానంలో ఉన్న కొటక్‌ మహీంద్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్‌ కొటక్‌ ఆస్తి రూ.78,600 కోట్లు, తర్వాత స్థానంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సైరస్‌ ఎస్‌.పూనవల్ల సంపద రూ. 73,000 కోట్లు, ఆదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత గౌతం ఆదానీ ఆస్తి రూ.71,200 కోట్లు కాగా, సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ సంపద రూ.69,400 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.

రూ. 1000 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ సంపద కలిగి ఉన్న వారి జాబితాను ఏటా బార్‌క్లేస్‌ హ్యురన్‌ ఇండియా సంస్థ వెల్లడిస్తుంది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రూ.వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ సంపద ఉన్న వారు 2017లో 617 మంది ఉండగా ఈ ఏడాది 831 మంది ఉన్నారు. రూపాయి విలువ తగ్గిపోతూ ఉండడం, ముడి చమురు ధరలు పెరుగుతండడం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా భారత్‌లో సంపద సృష్టి రేటు ఎన్నడూ లేనంతగా అనూహ్యంగా పెరుగుతోందని బార్ క్లేస్ నివేదిక పేర్కొన్నది.

అత్యంత సంపన్న పది కుటుంబాల్లోనూ మొదటి స్థానాన్ని అంబానీ కుటుంబమే దక్కించుకుంది. తర్వాతి స్థానాల్లో గోద్రేజ్‌, హిందూజ, మిస్త్రీ, సంఘ్వీ, నాడార్‌, అదానీ, దామానీ, లోహియా, బుర్మాన్‌ ఉన్నారు. సంపన్నుల జాబితాలో 66 ప్రవాస భారతీయులు కూడా ఉన్నారు.

వారిలో స్వయం ఉపాధిపై అభివ్రుద్ధి సాధిస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోనే 21 మంది వ్యక్తులు ఉన్నారు. తర్వాతీ స్థానాల్లో అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఎన్నారైలు ఉన్నారు. ఎన్నారైల్లో రూ.1.59 లక్షల కోట్ల సంపదతో హిందూజా అండ్ ఫ్యామిలీ గ్రూప్ మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్ల సంపదతో యూఏఈకి చెందిన యూసుఫ్ అలీ ఎంఏ అత్యంత సంపన్నుడు.

Follow Us:
Download App:
  • android
  • ios