Asianet News TeluguAsianet News Telugu

రిటైల్ టు మొబైల్ ఆపై మీడియాలో ముకేశ్‌దే హవా

అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సమీప భవిష్యత్‌లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాకు చెందిన ఫాంగ్ (ఫేస్ బుక్, యాపిల్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, గూగుల్) సంస్థల సరసన చేరొచ్చు. ప్రస్తుతం చైనా రిటైల్ దిగ్గజం ఆలీబాబాకు చేరువలో ఉన్న రిలయన్స్.. 2027 నాటికి 300 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎలారా క్యాపిటల్ అంచనా వేసింది.

Mukesh Ambani may leapfrog Jeff Bezos, Jack Ma
Author
Mumbai, First Published Jan 9, 2019, 9:33 AM IST

రిటైల్‌, స్మార్ట్ ఫోన్లు, టెలి కమ్యూనికేషన్ల రంగం మొదలు  మీడియా రంగాల్లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మరింత దూసుకెళ్లనున్నది. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్లకు పైగా మార్కెట్‌ విలువ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వచ్చే దశాబ్దిలో దేశంలోనే అగ్రగామి సంస్థగా అవతరించే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ ఎలారా క్యాపిటల్‌ తాజా నివేదికలో పేర్కొంది.

2027కు సంస్థ మార్కెట్‌ విలువ 300 బిలియన్‌ డాలర్లకు (రూ.21 లక్షల కోట్లకు పైగా) చేరే అవకాశం ఉన్నదని వ్యాఖ్యానించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్.. అమెరికాకు చెందిన ‘ఫాంగ్‌’ (ఎఫ్‌ఏఏఎన్‌జీ) స్టాక్స్‌ సరసన చేరొచ్చని ‘ఎలారా’ అభిప్రాయం.

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో అత్యంత ప్రముఖ, ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్న అయిదు సాంకేతిక దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్‌, యాపిల్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌  గూగుల్‌ సంస్థలను కలిపి ‘ఫాంగ్‌ స్టాక్స్‌’ అని పిలుస్తారు. ఇదే తరహాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశీయంగా అతిపెద్ద వినియోగదారు సంస్థగా అవతరిస్తుందన్నది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దూరదృష్టి, తెలివితేటల్ని ప్రశంసనీయమని ఎలారా వ్యాఖ్యానించింది. ఆయన సారథ్యంలో సంస్థ మరెన్నో ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని, దీన్ని విస్మరిస్తే మదుపరులు లాభాలు కోల్పోయే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) హరేంద్ర కుమార్‌ పేర్కొన్నారు.

రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌, మీడియా కంపెనీల సాయంతో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, వినియోగదార్ల పరంగా అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌)ను అధిగమించడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చునని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అతి పెద్ద ఎంఎఫ్‌సీజీ సంస్థగా కొనసాగుతున్న హెచ్‌యూఎల్‌కు 70 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని ఎలారా తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద కొన్ని మంచి బ్రాండ్లు ఉన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ఆర్‌ఐఎల్‌ తమ సంప్రదాయ చమురు ఉత్పత్తి, శుద్ధి వ్యాపారంపై ప్రస్తుతం ఎక్కువగా లాభాలు ఆర్జిస్తూ.. రిటైల్‌, టెలికాం వ్యాపారాలు ఇంకా ఊపందుకోవాల్సి ఉంది. వచ్చే ఐదేళ్లలో ఇవి గణనీయంగా వృద్ధి చెంది రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్‌ 24 శాతం వరకు ప్రతిఫలం అందించే అవకాశం ఉందని ఎలారా అంచనా వేసింది. 

వినియోగ వస్తువుల వాణిజ్యంపై వచ్చే ఆదాయం బాగా పెరిగితే, కమొడిటీ మార్కెట్‌ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వీటిని విడదీసే అవకాశం కూడా కనిపిస్తోందని లారా క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) హరేంద్ర కుమార్‌ తెలిపారు. 

ఈ సంస్థ నిర్వహిస్తున్న వినియోగదారు వ్యాపారం నుంచి రూ.లక్ష కోట్ల నిర్వహణ లాభం ఆర్జించాలనేది ముకేశ్‌ అంబానీ లక్ష్యం. దీన్ని వచ్చే దశాబ్దంలో (2027 నాటికి) చేరుకోగలరనిపిస్తోంది. ప్రస్తుతం అలీబాబా గ్రూప్ సముపార్జిస్తున్న లాభానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరువలో ఉంది.

ముకేశ్‌ అంబానీ ఆశించినట్లు జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌ విలువ ప్రస్తుత స్థాయి 100 బిలియన్‌ డాలర్ల నుంచి మూడు రెట్లకు (300 బి.డాలర్లు- రూ.21 లక్షల కోట్లు) పెరిగే అవకాశం కనిపిస్తోందని లారా క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) హరేంద్ర కుమార్‌ తెలిపారు. కాగా, బీఎస్‌ఈలో మంగళవారం ఆర్‌ఐఎల్‌ షేర్ 0.05 శాతం లాభంతో రూ.1103.95 వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios