న్యూయార్క్/ న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ 13వ స్థానాన్ని పొందారు. గతేడాదితో పోలిస్తే ఆయన ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్నారు.  ముకేశ్‌ అంబానీ సంపద 2018లో నమోదైన 4010 కోట్ల డాలర్లు నుంచి పెరిగి దాదాపు రూ.3.5 లక్షల కోట్లు (5000 కోట్ల డాలర్లకు) చేరింది.

2017లో ముకేశ్‌ అంబానీ 37వ స్థానంలో ఉండగా.. 2018లో 19వ స్థానానికి తన ర్యాంకును పెంచుకున్నారు. ఈ సంవత్సరం మరో ఆరు స్థానాలు మెరుగుపర్చుకొని 13వ స్థానానికి చేరారు. 2016లో హైపర్ టెలికం మార్కెట్లోకి 4జీ ఫోన్‌లో జియో ప్రారంభించడంతో టెలికం ప్రొవైడర్ల మధ్య ధరల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం 280 మిలియన్ల మంది కస్టమర్లు కలిగి ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో భారత్ కు చోటు దక్కిన 106 మంది ఇండియన్లకు ముకేశ్ అంబానీ సారథ్యం వహిస్తున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కుబేరులతో ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. 2019 ఫిబ్రవరి చివరినాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరలు ఆధారంగా నికర సంపదను ఫోర్బ్స్‌ లెక్కించింది. 994 మంది వ్యక్తుల సంపద గతేడాదితో పోలిస్తే తగ్గింది. 2018లో కేవలం 360 మంది సంపద మాత్రమే తగ్గింది. 2019లో కుబేరుల సగటు సంపద 400 కోట్ల డాలర్లు, 2018లో అది 410 కోట్ల డాలర్లు. 

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మళ్లీ అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. రెండో స్థానంలో బిల్‌ గేట్స్‌, మూడో స్థానంలో వారెన్‌ బఫెట్‌ నిలిచారు. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద గతేడాదితో పోలిస్తే 1900 కోట్ల డాలర్లు మేర పెరిగి 13100 కోట్ల డాలర్ల (రూ. 9లక్షల కోట్లు) పైనే చేరింది. 

ఇక రెండోస్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ సంపద 9000 కోట్ల డాలర్ల నుంచి 9650 కోట్ల డాలర్లకు చేరగా.. వారెన్‌ బఫెట్‌ సంపద 150 కోట్ల డాలర్లు పెరిగి 8250 కోట్ల డాలర్లకు చేరిందని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ తెలిపింది. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కంపెనీ సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ నాలుగో ర్యాంక్ పొందారు. 

ఇక సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ సంపద ఏడాది క్రితంతో పోలిస్తే 900 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో ఆయన ర్యాంకు కూడా ఐదు నుంచి ఎనిమిదికి పడిపోయింది. న్యూయార్క్ మాజీ మేయర్ మిచైల్ రెండు స్థానాలు పెంచుకున్నారు. 

సంపన్నుల జాబితాలో టాప్ -100లో నలుగురు భారతీయులు మాత్రమే చోటు దక్కించుకున్నారు. వాళ్లలో ముకేశ్‌ అంబానీ ముందువరుసలో నిలువగా.. మిగతా ముగ్గురు విప్రో ఛైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ 36వ ర్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ 82వ ర్యాంకు, అర్సెల్లర్‌ మిట్టల్‌, సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ 91వ ర్యాంక్ పొందారు.

వీరితోపాటు ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా 122వ ర్యాక్, ఆదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ 167వ ర్యాక్, భారతీ ఎయిర్ టెల్ హెడ్ సునీల్ మిట్టల్ 244 ర్యాంక్, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు బాలక్రుష్ణ 365వ ర్యాంక్ కలిగి ఉన్నారు.

పిరమాల్ ఎంటర్ ప్రైజెస్ అజయ్ పిరమాల్ 436వ ర్యాంక్, బయోకాన్ వ్యవస్థాపకుడు కిరణ్ మజుందార్ 617వ ర్యాంక్, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్నార్ నారాయణమూర్తి 962వ ర్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ 1349వ ర్యాంక్ పొందారు. 

ఈసారి జాబితాలో మొత్తం 2,153 మంది కుబేరులకు ర్యాంకులు లభించింది. వీరి మొత్తం సంపద 8.7 లక్షల కోట్ల డాలర్లు. 2018 జాబితాలో 2,208 మంది కుబేరులు జాబితాలో చోటు దక్కించుకోగా.. వీరి మొత్తం సంపద 9.1 లక్షల కోట్లు.  జాబితాలో చోటు దక్కించుకున్న కుబేరుల్లో 1,450 మంది స్వయం శక్తితో పైకి ఎదిగినవారని ఫోర్బ్స్‌ తెలిపింది.

ఫోర్బ్స్‌ రూపొందించిన కుబేరుల జాబితాలో నలుగురు తెలుగువారికి చోటు లభించింది. దివీస్‌ లేబొరేటరీస్‌ వ్యవస్థాపకుడు మురళీ దివి 3.4 బిలియన్‌ డాలర్ల నికర సంపదతో 645వ ర్యాంకు పొందారు. అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్‌ప్రసాద్‌ రెడ్డికి 804వ ర్యాంకు లభించింది. ఆయన నికర సంపద 2.8 బిలియన్‌ డాలర్లు. 

మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యవస్థాపకుడు పీపీ రెడ్డి 1008వ ర్యాంకు, ఎండీ పీవీ కృష్ణారెడ్డి 1057వ ర్యాంకుతో జాబితాలో చోటు సంపాదించారు. వీరిద్దరి నికర సంపద వరుసగా 2.3 బిలియన్‌ డాలర్లు,  2.2 బిలియన్‌ డాలర్లు. అయితే 2016 తర్వాత కుబేరుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి, దశాబ్దిలో రెండోసారి. 

ప్రాంతాల వారీగా ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలో 60 మంది, చైనాలో 49 మంది కుబేరులు ఆవిర్భవించారు. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఖండ దేశాల్లోని కుబేరుల జాబితా తగ్గిపోతున్నది. అమెరికన్ల స్థానాన్ని బ్రెజిల్ కుబేరులు ఆక్రమిస్తున్నారు.     అమెరికాలో 609 మంది కుబేరులు ఉండగా, ప్రపంచంలోకెల్లా 20 మందిలో 14 మంది సంపన్నులు అమెరికన్లే.